ఇజ్రాయెల్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-09-19T07:23:01+05:30 IST

జనాభా దాదాపు 87 లక్షలు...! రోజుకు పాజిటివ్‌ కేసులు 5 వేలు..! ప్రపంచంలో అత్యధిక తలసరి సంక్రమణ రేటు...! దీంతో ఇజ్రాయెల్‌లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు.

ఇజ్రాయెల్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

మూడు వారాల పాటు అమలుకు నిర్ణయం


జెరూసలెం, సెప్టెంబరు 18: జనాభా దాదాపు 87 లక్షలు...! రోజుకు పాజిటివ్‌ కేసులు 5 వేలు..! ప్రపంచంలో అత్యధిక తలసరి సంక్రమణ రేటు...! దీంతో ఇజ్రాయెల్‌లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. శుక్రవారం నుంచి మూడువారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. జనం గుమిగూడకుండా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. దీంతోపాటు ప్రజలు వారి ఇళ్ల నుంచి అర కిలోమీటరు పరిధిలోనే సంచరించాల్సి ఉంటుంది. వ్యాపార-వాణిజ్య సంస్థలను పూర్తిగా మూసివేయాలని ఆదేశాలిచ్చారు.


కాగా, వచ్చే వారం నుంచి సెలవు దినాలు (జ్యూయిష్‌ హాలిడేస్‌) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా యూదులు.. కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకుంటారు. సామూహిక ప్రార్థనలు చేస్తారు. అయితే, కారణం లేకుండానే లాక్‌డౌన్‌ విధించడం లేదని, ఆస్పత్రులు రోగులతో నిండిపోకుండా ఉండేందుకు కఠిన చర్యలు తప్పడం లేదని ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు జాతినుద్దేశించి గురువారం రాత్రి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇజ్రాయిల్‌లో ఇప్పటివరకు 1.75 లక్షల కేసులు నమోదయ్యాయి. 1,200 మంది మృతిచెందారు. కాగా, ప్రపంచంలో కరోనా కేసులు గురువారంతో 3 కోట్లు దాటాయి. వీటిలో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల కేసులే కోటిన్నర వరకు ఉన్నాయి. 

Updated Date - 2020-09-19T07:23:01+05:30 IST