నిబంధనలు బేఖాతరు

ABN , First Publish Date - 2020-07-09T10:39:17+05:30 IST

కరోనా నేపథ్యంలో మొదట్లో లాక్‌డౌన్‌ సంద ర్భంగా చేతిలో శానిటైజర్లు, ముఖాలకు మాస్కులు ధరించి భౌతిక దూరం నిబంధనలు ..

నిబంధనలు బేఖాతరు

విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న జనం

బ్యాంకుల్లో కానరాని భౌతికదూరం

పట్టించుకోని అధికార యంత్రాంగం

కలెక్టర్‌ కార్యాలయానికే పరిమితం

పెరుగుతున్న కరోనా కేసులు

బాధితుల సంఖ్యలోనూ గందరగోళం


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): కరోనా నేపథ్యంలో మొదట్లో లాక్‌డౌన్‌ సంద ర్భంగా చేతిలో శానిటైజర్లు, ముఖాలకు మాస్కులు ధరించి భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించిన జనం క్రమేపీ లాక్‌డౌన్‌ ఎత్తివేతతో షరామామూలే అన్నట్లు పూర్వపు స్థితిలోకి వచ్చేశారు. అయితే వ్యాధి తీవ్రత అంతగాలేని సమయంలో అతిగా జాగ్రత్తలు పాటించిన జనం తీరా వైరస్‌ వ్యాప్తి ఉధృతమైన వేళ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా అడ్డగోలుగా రోడ్లపై సమూహాలుగా తిరుగుతూ గుబులు రేకిత్తిస్తున్నారు.   బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఒక్కో సీట్లో ముగ్గురేసి అపరిచితులు పక్కపక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బ్యాంకుల వద్ద పరిస్థితి మరీ ప్రమాదకరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో పంట రుణాల కోసం రైతులు జిల్లాలోని అన్ని వాణిజ్య బ్యాంకుల వద్ద వందల సంఖ్యలో గుమికూడుతుండడంతో భౌతికదూరం నిబంధ నలను బ్యాంకర్లు గాలికి వదిలేశారు.


ఫలితంగా కొవిడ్‌ సోకిన వ్యక్తి ఆ సమూహంలో ఉంటే అక్కడున్న వారందరికీ ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదముంది. జిల్లాలో ఇప్పటికే 30 కొవిడ్‌  కేసులు నమోదు కాగా వందల సంఖ్యలో ఐసోలేషన్‌ సెంటర్లలో ఉండి డిశ్చార్జి అయ్యారు. ఒకవైపు కరోనా బాధితుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా మారిందన్న ఆరోపణలున్నాయి. జిల్లా అంతటా భౌతిక దూరం నిబంధనలు గాలికొదిలేసినా  అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. లాక్‌డౌన్‌ సందర్భంగా శానిటైజేషన్‌, భౌతికదూరం, వ్యాపార సమూదాయాల నిర్వహణపై ఎంతో హడావుడి చేసిన కలెక్టర్‌ కూడా ప్రస్తుతం కార్యాలయాన్ని వదిలి బయటకు రాకపోవడం ప్రస్తుతం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇటు అధికార యంత్రాంగం పనితీరు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేదు. అధికారులంతా సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లంటూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పొరుగునే పాజిటివ్‌ బాంబు

జిల్లాలో ఇప్పటికే 30 మంది బాధితులు నమోదు కాగా పొరుగు జిల్లా అయిన మంచిర్యాలలో  రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండడంతో  ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత పనుల కోసం మంచిర్యాలకే వెళ్లి వస్తుంటారు. ముఖ్యంగా జిల్లాలో ప్రజల నిత్యావసరలైన ఆహార దినుసులు, దుస్తులు, పాదరక్షల వంటివి మంచిర్యాలలోనే హోల్‌సెల్‌గా కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తుంటారు. ఇటీవల మంచిర్యాలలో ఒక ప్రముఖ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న 18 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అక్కడ దుస్తులు కొనుగోలు చేసిన జిల్లాకు చెందిన వ్యక్తుల్లో దడ మొదలైంది.


ప్రస్తుతం జిల్లాలో అడపదడపా జరుపుతున్న పరీక్షల్లోనే పాజిటివ్‌ కేసులు బయట పడుతున్నాయని మాస్‌ టెస్టులు జరిపితే మరిన్ని కేసులు బయటపడే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ప్రభుత్వం కేవలం లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతుండడం  గమనార్హం. 


అధ్వానంగా వాంకిడి క్వారంటైన్‌ కేంద్రం

జిల్లాలో కరోనా వ్యాధి బారిన పడిన రోగులకు చికిత్స చేయడం కోసం వాంకిడి మండల కేంద్రం లోని ఎస్టీ బాలికల వసతిగృహంలో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో పాజిటివ్‌గా నిర్ధారించిన బాధితులను సికింద్రాబాద్‌లోని గాంధీ, ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సలు చేశారు. అక్కడ కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో ప్రభుత్వం ఆయా జిల్లా ల్లోనే రోగులకు చికిత్స అందించి క్వారంటైన్‌ చేయాలని ఆదేశించింది. అయితే ఆ మేరకు వాంకిడి క్వారంటైన్‌ కేంద్రంలో రోగులకు చికిత్స అందించేందుకు కనీస ఏర్పాట్లు చేయక పోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో గదుల్లో వదిలి వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం వైద్యులు కూడా రోగుల వద్దకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదని అంటున్నారు.


అందిస్తున్న ఆహారం కూడా అత్యంత దారుణంగా ఉందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలల పరిస్థితి మరీ దారుణం.  ఇటీవల ఓ బాధితుడు తాను ఇక్కడ ఉండలేనని, ఎవరూ పట్టించుకోవడం లేదని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. దాంతో జిల్లా వైద్యాధికారి, డీటీడీఓలు ఆగమేఘాల మీద క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అయితే కేంద్రం నిర్వహణకు అవసరమైన నిధులు లేకపోవడం వల్లే ఎవరికి వారు పట్టింపులేనట్లుగా వ్యవహ రిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ఉపయోగించడం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టింది. మరి ఆ నిధులు ఏమై పోయాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 

Updated Date - 2020-07-09T10:39:17+05:30 IST