లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-20T09:44:57+05:30 IST

వేకువన తలుపు తెరిచేసరికి గుమ్మంలో ఎండుటాకులతోపాటు కొన్ని నక్షత్రాలు కూడా గుమ్మం ముందు రాలిపడి వున్నాయి మనీప్లాంట్‌ తీగలలో చిక్కుకుపోయిన ...

లాక్‌డౌన్‌

వేకువన తలుపు తెరిచేసరికి

గుమ్మంలో ఎండుటాకులతోపాటు

కొన్ని నక్షత్రాలు కూడా గుమ్మం ముందు

రాలిపడి వున్నాయి


మనీప్లాంట్‌ తీగలలో చిక్కుకుపోయిన

వేసవి రాత్రుల చల్లగాలి విడిపించుకోడానికి

పెద్ద పెద్ద ఆకుల మధ్య పెనుగులాడుతోంది


అంతదూరాన రహదారి మీద

పిల్లా పాపలతో ఊళ్ళకి తిరిగిపోతున్న

కూలినాలి జనం ఒంటి నుంచి

గాలిలో కలిసి వస్తున్న చెమట ఘాటు

నా మార్నింగ్‌ కాఫీకి ఏదో తెలియని

దుఃఖవాసన కలుపుతోంది


దీపాలు వెలిగించడం

బాల్కనీలలో బారులు తీరడం

మసీదులలో మూకుమ్మడి ప్రార్థనలు చేయడం

గుంపుగా వెళ్ళి దేవుళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించడం

తండోపతండాలుగా వీధుల్లో ఊరేగడం

ఏమి యుద్ధమో ఎవరి మీద ఆగ్రహమో

ఇదేమి లాక్‌డౌన్‌ ఆత్మరక్షణమో

ఇదేమి స్వసంతాన భక్షణమో;

ఇంకెన్ని వేకువలు చూస్తానో నేను

ఇంకెన్ని ఊపిరులు పీలుస్తానో నేను.

దేవిప్రియ

Updated Date - 2020-04-20T09:44:57+05:30 IST