ప్రాణాల కంటే ‘నాడునేడు’ ముఖ్యమా ?

ABN , First Publish Date - 2020-04-04T09:35:25+05:30 IST

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ‘నాడు నేడు’ కార్యక్రమం అమలుకు విద్యాశాఖకు చెందిన సిబ్బంది, వాహనాలు అనుమతించాలని విద్యాశాఖ కమిషనర్‌ వీరభద్రుడు శుక్రవారం పోలీసు శాఖకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రాణాల కంటే ‘నాడునేడు’ ముఖ్యమా ?

మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

కమిషనర్‌ ఉత్తర్వులపై ఆగ్రహం


    చిత్తూరు(ఆంధ్రజ్యోతి)/చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 3: లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ‘నాడు నేడు’ కార్యక్రమం అమలుకు విద్యాశాఖకు చెందిన సిబ్బంది, వాహనాలు  అనుమతించాలని విద్యాశాఖ కమిషనర్‌ వీరభద్రుడు శుక్రవారం పోలీసు శాఖకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  విద్యా శాఖ హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డీఈవోలు, ఆర్‌జేడీ ప్రయాణాలను అనుమతించాలని పోలీసులకు కమిషనర్‌ లేఖ రాశారు.


ఆందోళనకర స్థాయిలో కరోనా వ్యాప్తి ఓవైపు.. ఇల్లు వదిలి బయటికెవరూ రావద్దంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు మరోవైపు కొనసాగుతుండగా కమిషనర్‌ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసేవరకు నాడునేడు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర నాయకులు ఇప్పటికే నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేయడం పట్ల ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడం, రోడ్డు మీదకు వస్తే లాఠీ దెబ్బలు, కరోనా భయాందోళన, ఉపాధ్యాయులు సుదూరంగా స్వస్థలాల్లో ఉండడం తదితర కారణాలతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.



ఇది సమయం కాదు : ఎస్టీయూ

  లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా నాడు నేడు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టడం సరి కాదని ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి చంద్రన్‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నాడు నేడు సమావేశాలు తాత్కాలికంగా నిలిపి వేయాలని కోరుతూ ఎస్టీయూ  నాయకులు శుక్రవారం సమగ్ర శిక్షా (ఎస్‌ఎస్‌) కార్యాలయంలోని సెక్టోరియల్‌ ఏఎంవో మోహన్‌, సీఎంవో గుణశేఖర్‌రెడ్డి, డీఈవో కార్యాలయంలోని డీవైఈవో పురుషోత్తంతో చర్చించారు. అధికారులను కలిసినవారిలో ఎస్టీయూ నాయకులు గంటా మోహన్‌, పురుషోత్తం నాయుడు, బాలచంద్రారెడ్డి, మదన్‌మోహన్‌, అమరనాథ్‌, మణి, విశ్వనాథ్‌ తదితరులు ఉన్నారు. 


వాయిదా వేయాల్సిందే..జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, పీలేరు

ఆరోగ్యం కంటే ఏదీ ప్రధానం కాదు. కరోనా దెబ్బకు పెద్ద పెద్ద కార్యక్రమాలే వాయిదా వేస్తుంటే నాడు నేడు పేరుతో అధికారులు ఏకపక్ష ఆదేశాలు జారీ చేయడం అసమంజసం. పాఠశాలలు తెరచిన తర్వాత వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు మేం సహకరిస్తాం. కాదని ఇప్పుడు ఒత్తిడి తెస్తే సంఘాలుగా మేము తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది.


 పాఠశాలలకు ఎలా వెళతారు ?.. బాలాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆపస్‌, పుత్తూరు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాడు నేడు అమలు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గొప్పలకు వెళ్లి, అటు అధికారులు, ఇటు ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టకూడదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం మంచిది. హెచ్‌ఎంలు తదితరులు వారి స్వస్థలాలకే పరిమితమై ఉన్నారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేని ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల వద్దకు వెళ్లడం అసాధ్యం.

Updated Date - 2020-04-04T09:35:25+05:30 IST