Abn logo
Apr 4 2020 @ 05:04AM

పూట గడిచేది ఎలా?

‘కంటికి కనిపించని శత్రువుతో...బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నా...’  ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్‌. ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒకరూ ఇద్దరూ కాదు... వేలాది మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అన్నివర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉపాధి దూరమై...బతుకు భారమై పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారు. రోజువారీ కూలీలు... కార్మికులు రోడ్డున పడ్డారు. చిరుద్యోగికి వేతన కష్టాలు ప్రారంభమయ్యాయి. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే నిరుద్యోగ యువత పడరాని పాట్లు పడుతున్నారు. పంటను ఇంటికి తెచ్చుకోలేక రైతులు... పనిలేక రైతు కూలీలు దిగులు చెందుతున్నారు.  అనేక మందికి రోజు గడవడమే కష్టమవుతోంది.అన్నివర్గాలనూ  వెంటాడుతున్న కష్టాలు

కార్మికులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఉపాధికి దూరం

కుటుంబ జీవనం ప్రశ్నార్థకం 

భవిష్యత్‌పై వెంటాడుతున్న బెంగ


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ ఇచ్ఛాపురం రూరల్‌): కరోనా...అనేక మంది జీవితాలను తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా చిరు జీవులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ఈ వైరస్‌ను నిరోధించే క్రమంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌... చిరుజీవుల ఆర్థిక స్థితిపై తీవ్రంగా దాడి చేస్తోంది. ఇలానే కొనసాగితే పరిస్థితి ఏమిటి...ఇదీ అన్నివర్గాల్లో వినిపిస్తున్న మాట. లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వారు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌పై బెంగ వారిని వెంటాడుతోంది. శ్రీకాకుళం వలసల జిల్లా. రైతులతో పాటు రైతు కూలీలు అధికం. చిన్నసన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు.


వీరు వ్యవసాయ సీజన్లలో స్థానికంగా ఉంటూ..మిగతా సమయాల్లో ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో వేలాది మంది పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌ వేళ వీరందరికీ ఉపాధి గగనమైంది. పనులకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతేడాది మే నుంచి మొన్నటి డిసెంబరు వరకూ ఇసుక కొరతతో భవన నిర్మాణరంగం నిలిచిపోయింది. జనవరి నుంచి పనులు ప్రారంభంకాగా...ఇప్పుడు కరోనా రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పట్లో భవన నిర్మాణ రంగం ఊపందుకోదని తెలియడంతో భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారు.  


స్వయం ఉపాధితో చాలామంది కుటుంబాలను పోషిస్తున్నారు. టిఫిన్‌ షాపులు, మెకానిక్‌ షెడ్‌లు, చిరు వ్యాపారాలు, తోపుడుబండ్లు, కూరగాయల దుకాణాలు, చికెన్‌ షాపులు వంటివి పెట్టుకొని లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ గత కొద్దిరోజులుగా ఉపాధి లేకుండా పోయింది. ఇక వాహనరంగంలో కూడా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వీరికి పని లేకుండా పోయింది. జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి వెంబడి దాబాలు, హోటళ్లలో వేలాది మంది యువత పనిచేస్తున్నారు. ఇక్కడి వారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు టైర్లకు పంక్చర్లు వేసుకొని ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ప్రస్తుతం పనిలేక పస్తులతో ఉంటున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 


ఆటోలు తిరగక...

ఆటో డ్రైవర్లు పడరాని పాట్లు పడుతున్నారు. రోజంతా ఆటో తిప్పితే కానీ వారి కుటుంబ జీవనం గడిచేది కాదు. అటువంటిది రోజుల తరబడి ఆటోలు నిలిచిపోవడంతో కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారింది.  జిల్లాలో మొత్తం 35 వేల వరకు ఆటోలు ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా వీటితో జీవనాధారం పొందుతున్నారు. వారిని కదిపితే కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆటోకు చెల్లించాల్సిన ఫైనాన్స్‌ కోసం పాట్లు పడుతున్నారు. కుటుంబపోషణ కష్టతరంగా మారిన నేపథ్యంలో కార్మికులు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు


ఇబ్బంది పడుతున్నాం...  పొట్నూరు వాసు, చిరుదుకాణదారుడు 

కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారింది. చిన్న దుకాణమే కుటుంబానికి ఆధారం. లాక్‌డౌన్‌తో రెండు వారాలు దుకాణాన్ని మూసేశాం. అప్పటి నుంచి పైసా సంపాదన లేదు. పిల్లలతో కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.


పోషణ కష్టతరం .. డి.అప్పారావు, ఆటో డ్రైవర్‌, బూర్జపాడు

 సుమారు పదేళ్లుగా ఆటో నడుపుతున్నాను. ఆటో నడిస్తేనే ఇల్లు గడిచేది. లాక్‌డౌన్‌ ప్రభావంతో 15 రోజులుగా ఆటో నడవక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాధారణ రోజుల్లో డీజిల్‌ ఖర్చులు పోను రూ.300 వరకు వచ్చేది. దాంతో కుటుంబ జీవనం హాయిగా గడిచిపోయేది. ఇప్పుడు సంపాదన లేకపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement