కొత్త బియ్యం కార్డుదారులకే లాక్‌ డౌన్‌ సాయం

ABN , First Publish Date - 2020-04-04T09:24:51+05:30 IST

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదవర్గాలకు ఇచ్చే వెయ్యి రూపాయల సాయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి మొండిచెయ్యి చూపుతున్నది.

కొత్త బియ్యం కార్డుదారులకే లాక్‌ డౌన్‌ సాయం

అందులోనూ 65 వేల కార్డులకు కోత

మ్యాపింగ్‌ కాకపోవడమే కారణమంటున్న అధికారులు

తరువాత ఇస్తారా? అన్నదానిపై కొరవడిన స్పష్టత

పాతకార్డుల ఆధారంగా 12,45,329 మందికి ఉచిత సరుకులు పంపిణీ చేసిన అధికారులు

కొత్త కార్డులు 11.7 లక్షలు

11.05 లక్షల కార్డుదారులకే రూ.1000 చొప్పున సాయం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదవర్గాలకు ఇచ్చే వెయ్యి రూపాయల సాయంలో  రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి మొండిచెయ్యి చూపుతున్నది. రేషన్‌ కార్డు వున్న ప్రతి కుటుంబానికి రూ.1000 చొప్పున నగదు అందజేస్తామని గతంలో ప్రకటించగా, తీరా డబ్బులు పంపిణీ చేసే సమయానికి కొత్తగా అమలుచేయనున్న బియ్యం పథకం కార్డుదారులకు మాత్రమేనని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక కొత్తకార్డులు మ్యాపింగ్‌ చేయలేదంటూ సుమారు 65 వేల కుటుంబాలకు సాయం  ఇవ్వడంలేదు. అధికారుల లెక్కల ప్రకారం శనివారం జిల్లాలో 11,05,640 కుటుంబాలకు రూ.1000 చొప్పున అందజేస్తారు. 


సంక్షేమ పథకాలకు వేర్వేరుగా కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, అత్యల్ప ఆదాయవర్గాలకు మాత్రమే రూపాయికి కిలో బియ్యం ఇవ్వడానికి ప్రత్యేకంగా బియ్యం కార్డులను జారీ చేసింది. ఏప్రిల్‌ నుంచి అమలులోకి తెస్తున్నట్టు గతంలో ప్రకటించింది. దీని ప్రకారం జిల్లాలో 11.7 లక్షల మంది బియ్యం ్లకార్డులకు అర్హులని తేల్చారు. ఆ మేరకు గత నెల 29 నుంచి సరుకులు పంపిణీ చేయాలని భావించారు. అయుతే లాక్‌డౌన్‌తో ఉపాధి లేనందున గతంలో ఉన్న 12,45,329 మంది తెల్లకార్డుదారులకు రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌ నాలుగున ప్రతి కార్డుదారుడికి రూ.1000 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, దీనిని బియ్యంకార్డుతో ముడిపెట్టింది. దీంతో పాతకార్డుదారుల్లో 75 వేల కుటుంబాలకు సాయం అందే పరిస్థితి లేదు.


కానీ జిల్లా అధికారులు శుక్రవారం విడుదల చేసిన జాబితా ప్రకారం మరో 65 లక్షల మందికి కూడా మొండిచేయి చూపారు. కొత్త బియ్యం కార్డులను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 11.7 లక్షల మందికి రూ.1000 చొప్పున అందజేయాలి. కానీ 11.05 లక్షల మందికే నిధులు విడుదల చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.... కొత్తగా మంజూరుచేసిన బియ్యం కార్డుల్లో గత నెలాఖరు వరకు 11.05 లక్షల కార్డులనే మ్యాపింగ్‌ చేశారని, ఆ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. అయితే కార్డులు మ్యాపింగ్‌ కాని వారికి తరువాత ఇస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. 


బుచ్చెయ్యపేటలో 1,152 మందికి.....

బుచ్చెయ్యపేట: కొత్త బియ్యం కార్డుల నిబంధన ప్రకారం మండలంలో 1,152 కుటుంబాలకు రూ.1000 సాయం అందదు. పాత రేషన్‌కార్డులు 21,988 కాగా కొత్తగా ఇస్తున్న బియ్యం కార్డులు 20,836 వున్నాయి. దీంతో ఈ మేరకు తగ్గిన పాత కార్డుదారులకు లాక్‌ డౌన్‌ సాయం అందదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-04T09:24:51+05:30 IST