జిల్లాలో రూ.112 కోట్ల సాయం : మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2020-04-04T09:05:38+05:30 IST

లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో జిల్లాలో పేదలకు ప్రభుత్వ సాయంగా రూ.112 కోట్లను శనివారం అందజేయనున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు.

జిల్లాలో రూ.112 కోట్ల సాయం : మంత్రి పేర్ని

(ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం) : లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో జిల్లాలో పేదలకు ప్రభుత్వ సాయంగా రూ.112 కోట్లను శనివారం అందజేయనున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. బందరు మండలంలోని గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్‌ పిచికారీ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాలన్నింటికీ వెయ్యి రూపాయల చొప్పున అందించడానికి రూ.112 కోట్లను విడుదల చేసి ఆయా సచివాలయాల ఖాతాలకు జమ చేశారన్నారు. శనివారం గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి నగదు అందజేస్తారని మంత్రి తెలిపారు.


క్వారంటైన్‌ కేంద్రం పరిశీలన

 మచిలీపట్నం చిలకలపూడిలోని వరలక్ష్మి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని మంత్రి పేర్ని వెంకట్రామయ్య పరిశీలించారు. పీపీఈ సూట్‌ను ధరించిన ఆయన అక్కడ వైద్య సేవలు పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 349 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని, మచిలీపట్నం నుంచి 27 మంది అనుమానితులను  కేంద్రాలకు తరలించామన్నారు. వారిలో ఇద్దరికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. మిగిలిన రిపోర్టులు రావలసి ఉందన్నారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖల అధికారులతో పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.


రెడ్‌జోన్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి

నూజివీడు : అవగాహనతోనే కరోనాని నివారించగల్గుతామని మంత్రి పేర్నినాని అన్నారు. శుక్రవారం నూజవీడు మున్సిపల్‌ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణ తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌జోన్‌లోని వారు రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, డీఎస్పీ శ్రీనివాసులు  మున్సిపల్‌ కమిషనర్‌  వాసుబాబు పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-04T09:05:38+05:30 IST