Abn logo
Mar 30 2020 @ 06:07AM

ఏడోరోజూ లాక్‌డౌన్‌

నిర్మానుష్యంగా మారిన రోడ్లు 

 ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

కొనసాగుతున్న లాక్‌డౌన్‌


తాండూరు/తాండూరు రూరల్‌/బషీరాబాద్‌/పెద్దేముల్‌/యాలాల : లాక్‌డౌన్‌ వారం రోజులకు చేరుకుంది. ఆదివారం నాటికి లాక్‌డౌన్‌ ప్రకటించి 8 రోజులు పూర్తయింది. తాండూరులోని రైతుబజార్‌లో పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయని, కూరగాయల విక్రదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్డీవో వేణుమాధవరావు స్థానిక కౌన్సిలర్‌తో కలిసి అవగాహన కల్పించారు. శివాజీచౌక్‌లో మటన్‌, చికెన్‌ షాపుల వద్ద వ్యక్తిగత దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించాలని కోరుతూ కౌన్సిలర్లు ప్రభావకర్‌గౌడ్‌, సాహు శ్రీలత అవగాహన కల్పించారు. తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఏర్పాటు చేశారు.


అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌, ఏఆర్‌ ఎస్‌ఐ అచ్చుతరామారావు, డాక్టర్‌ అపూర్వారెడ్డిని డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆదేశించారు. పెద్దేముల్‌ మండలం నుంచి ఇతర రాష్ట్రాల్లో కూలీ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి గ్రామాలకు వచ్చిన వారి వివరాలను అందించాలని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సర్పంచ్‌లను కోరారు. బషీరాబాద్‌ మండలంలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారు. ఎస్‌ఐ గిరి ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. యాలాల మండలం జుంటుపల్లిలో సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి మురుగు కాల్వలపై మందు పిచికారీ చేయించారు. ప్రజలకు బయటకు రావొద్దని అందరికీ అవగామన కల్పిస్తున్నారు.


తాండూరు మండలంలో 163 మంది గుర్తింపు

తాండూరు మండలానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 163 మందిని సర్వేలెన్స్‌ టీం గుర్తించింది. వారిని ఎప్పటికప్పుడు డాక్టర్‌ అపూర్వారెడ్డి ఆధ్వర్యంలో సూపర్‌వైజర్‌ వెంకటేష్‌ నేతృత్వంలో వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. మల్కాపూర్‌లో 10 మంది, అల్లాపూర్‌లో 7 మంది గృహనిర్బంధంలో ఉండాలని వైద్యాధికారులు ఆదేశించారు. 


బెల్ట్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం

ధారూరు: ధారూరు మండలంలోని పలు గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.  మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పరిగి, బొంరా్‌సపేట్‌, యాలాల్‌ మండలాలల వైన్స్‌ షాపుల నుంచి దొంగచాటుగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం.  


మాస్కుల పంపిణీ

నవాబుపేట: నవాబుపేట మండలంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఆదివారం నవాబుపేటలో  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, దాతాపూర్‌ సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డిలతో కలిసి ప్రజలకు కూరగాయలు, రైతులకు మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. 


ప్రశాంతంగా లాక్‌డౌన్‌

బంట్వారం (కోట్‌పల్లి) : బంట్వారం, కోట్‌పల్లి మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో ఆదివారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలంతా ఇళ్లకు పరిమితమై పనులలో నిమగ్నమయ్యారు. గ్రామాలలో రైతులు వారి పొలం పనులు చేసుకుంటున్నారు. మండలంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలకు బయటకు రావడం లేదు.   


ఉచితంగా కూరగాయల పంపిణీ

మోమిన్‌పేట: కరోనా నేపథ్యంలోమోమిన్‌పేటలో అఖిలపక్షం నాయకులు సిరాజొద్దీన్‌, మజర్‌, ఎజాజ్‌పటేల్‌, ఎజాజ్‌పాషా, ఎస్‌ఐ రవికుమార్‌, దాత రవీందర్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ నాయకుడు వెంకట్‌తో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలకు కూరగాయలు అందజేశారు.  సామాజిక దూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్‌లు ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.  మొరంగపల్లి గ్రామంలో సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డితో పాటు మెట్టకుంట రవీందర్‌రెడ్డి ప్రజలకు ఉచితంగా కూరగాయలు అందజేశారు. 


కరోనాపై అవగాహన అవసరం

మర్పల్లి : కరోనా వైర్‌సపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే పూర్తి స్థాయిలో ఎదుర్కోవచ్చని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మర్పల్లి మండలంలోని రావులపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీటీసీ రవి, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. 


ఇళ్లకే పరిమితమైన ప్రజలు

కొడంగల్‌: భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైర్‌సను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైర్‌సను అరికట్టడంతో భాగంగా కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోలులో సామాజిక దూరాన్ని పాటించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొడంగల్‌ మండలంలోని రావుల్‌పల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు దగ్గర ఆదివారం సర్పంచ్‌ రమేశ్‌రెడ్డి బ్లీచింగ్‌ పౌడర్‌ నీటితో స్ర్పే చేయించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రేషన్‌ బియ్యంతో పాటు రూ.1,500 చౌకధరల దుకాణాల్లో అందించాలని ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్‌బీ.గుల్షన్‌ డిమాండ్‌ చేశారు. అధిక ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ లాక్‌డౌన్‌ను సమీక్షించారు. 


బొంరాస్‌పేట్‌లో..

బొంరాస్‌పేట్‌: కరోనా వైర్‌సను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. వారంతపు సంతలు తుంకిమెట్ల, బొంరా్‌సపేట్‌లో బంద్‌ కావడంతో ప్రజలు కూరగాయల కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయాన్నే బొంరా్‌సపేట్‌లో ప్రజలు గుంపులు, గుంపులుగా బయటకు వచ్చారు. వ్యాపారులు పోలీసుల భయానికి రాకపోవడంతో ప్రజలు వెనుదిరిగారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఆదివారం రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి టీటీ రాములు దుద్యాల్‌ గ్రామంలో పచ్చిమిర్చి, టమాట, వంకాయలు, బీరకాయలు, దోసకాయ తదితర కూరగాయలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కమ్లిబాయి, టీఆర్‌ఎస్‌ నాయకులు కోట్లయాదగిరి, నరేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


పరిగి డివిజన్‌లో...

పరిగి/పరిగిరూరల్‌:దోమ/కులకచర్ల/పూడూరు: ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ బంద్‌ ఏడో రోజూ ఆదివారం సంపూర్ణంగా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను క్షేత్రస్థాయిలో పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా బంద్‌ పాటించారు. పరిగి పట్టణం, గ్రామాలు నిర్మానుష్యాన్ని తలపించాయి. ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. పరిగి పట్టణ మెయిన్‌ రహదారులు, ఇతర కాలనీలో నిర్మూనుష్యంగా బోసిపోయి కనిపించాయి. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిత్యవసరాల కొనుగోళ్ల సమయాన్ని ఇవ్వడంతో ఆ గడువులో జనం సరుకులు తెచ్చుకున్నారు. తొమ్మిది తర్వాత పోలీసులు ఆంక్షలు విధించారు. తొమ్మిది తర్వాత అక్కడడక్కడా కొందరు వ్యాపారులు లోపల నుంచి సరుకులు ఇవ్వడాన్ని గమనించిన పోలీసులు లాఠీలతో పని చెప్పాల్సి వచ్చింది. దుకాణాలు, ఇళ్లు, ఇతర సంస్థలన్నీ మూసిఉంచారు. ఆర్టీసీ డిపో మూసి ఉంచారు.


బస్టేషన్‌ బోసిపోయికనిపించింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ 163 జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు తప్పా మిగతా సంస్థలన్నీ బంద్‌ పాటించాయి. సీఐ లక్ష్మీరెడ్డి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షించారు. సుల్తాన్‌పూర్‌లో ఎంపీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఉపసర్పంచ్‌ సాబేర్‌ ఆధ్వర్యంలో వీధుల్లో ఆల్కలైజ్డ్‌ శానిటైజర్‌ను పిచికారీ చేయించారు. నస్కల్‌ గ్రామంలో ఎం.రాజేందర్‌, సర్పంచి పద్మమ్మ ఆధ్వర్యంలో పిచికారీ చేయించారు.  కలకచర్ల, దోమ, పూడూరు మండలాల్లో లాక్‌డౌన్‌ను పాటించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని గుర్తించి హోంక్వారంటైన్‌ పర్యవేక్షణలో ఉంచారు. కులకచర్లలో సర్పంచి సౌమ్యరెడ్డి ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ అశోక్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌ గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించారు. తీర్మాలాపూర్‌లో  వార్డు మెంబర్‌ మంగమ్మ గ్రామస్తులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. దోమలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. బొంపల్లిలో యువకులు రోడ్లపై కూర్చోవడంతో తహసీల్దార్‌  శైలేంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాలగుప్తా ఆధ్యర్యంలో పూడూరులో శానిటైజర్‌ను పిచికారీ చేయించారు. పూడూరులో తహసీల్దార్‌ దీపక్‌కుమార్‌ తదితరులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ప్రజలకు ఎవ్వరు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. 

Advertisement
Advertisement