వాడవాడలా వితరణలు

ABN , First Publish Date - 2020-03-29T11:14:57+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా నిరాశ్రయులు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు అన్నదానాలు, ఫుడ్‌ప్యాకెట్లు, శానిటైజర్లు, బియ్యం వితరణ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

వాడవాడలా వితరణలు

రోజూ 45వేలమందికి  టీటీడీ ఆహార పొట్లాలు


తిరుమల, మార్చి 28: లాక్‌డౌన్‌ కారణంగా నిరాశ్రయులు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు అన్నదానాలు, ఫుడ్‌ప్యాకెట్లు, శానిటైజర్లు, బియ్యం వితరణ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ కూడా శనివారం నుంచి ఫుడ్‌ప్యాకెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా తిరుపతిలో ఆహారపొట్లాల పంపిణీని శనివారం ప్రారంభించారు. తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ పర్యవేక్షణలో తొలిరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని క్యాంటీన్‌లో మఽధ్యాహ్నం 15వేల పులిహోరా ప్యాకెట్లను రెవెన్యూ, తుడా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు అందజేశారు.


పొంగళ్‌, పెరుగన్నం, టమెటా రైస్‌, బిసిబెళా బాత్‌, కిచిడీ తదితరాలతో కూడిన మోనును రోజుకొకటి చొప్పున తయారు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం 30వేల ప్యాకెట్లు, రాత్రి 15వేల ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. వీటిని అధికారులు తమ సిబ్బంది సాయంతో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, రెండోసత్రం, తిరుచానూరులోని శ్రీపద్మావతి నిలయం వద్ద నిరాశ్రయులకు అందజేయనున్నారు. 


పలు ప్రాంతాల్లో ఇలా..

జిల్లాలో శనివారం పలు ప్రాంతాల్లో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌ సుమారు వందమందికి అన్నదానం చేశారు. కార్మిక సంక్షేమ సంఘ నాయకుడు శివ ఆధ్వర్యంలో పోలీసు, పారిశుధ్య కార్మికులు, మీడియా సిబ్బందికి అన్నదానం చేసి, పండ్ల వితరణ చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి శానిటైజర్లు పంపిణీ చేశారు. మదనపల్లెలో చంద్రశేఖర్‌రెడ్డి యాచకులకు అన్నదానం చేశారు. వెల్‌విషర్స్‌ సభ్యులు మధ్యప్రదేశ్‌ వలస బాధితుల ఆకలితీర్చారు.


చిత్తూరులో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రుద్రాక్ష ట్రస్ట్‌, మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ, చిత్తూరు తాలూకా పోలీసులు, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా అన్నదానం చేశారు. పలమనేరులో పబ్లిక్‌ ఇష్యూ వాట్సాప్‌ నిర్వాహకుడు సుధీర్‌ అనాథలకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఫుడ్‌ప్యాకెట్లు అందజేశారు. వాల్మీకిపురంలో సహార చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు సాదిక్‌, సభ్యులు అన్నదానం చేశారు. గిరిజన నాయకుడు జీవీ రమణ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు భోజనం పెట్టారు. శాంతిపురంలో తులసి నోబెల్‌ పాఠశాల యాజమాన్యం కూడా ఫుడ్‌ప్యాకెట్లు అందజేసింది. రామకుప్పంలో నితిత్‌ రాఘవ్‌ బ్లీచింగ్‌, స్పిరిట్‌ను మిట్టపల్లె, తిమ్మసముంద్రంలో స్ర్పే చేశారు. వడమాలపేట మండలం పాదిరేడులో పూల గణపతి, చుక్కా శేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం మాస్కులు, శానిటైజర్ల పంపిణీ జరిగింది.


పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్యాణపురం, ఆర్టీసీ, ఆరేటమ్మకాలనీల్లో శనివారం మాస్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుమారస్వామిశెట్టి, ఉషారాణి, గాలి జీవరత్నం నాయుడు, ఉమాశంకర్‌రెడ్డి, కుమార్‌శెట్టి, నవనీత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు బాలకృష్ణ యాదవ్‌ ఆధ్వర్యంలో నిండ్రలో పేదలకు అన్నదానం జరిగింది. 

Updated Date - 2020-03-29T11:14:57+05:30 IST