కరోనా కాలం.. మళ్లీ తాళం

ABN , First Publish Date - 2021-05-12T07:53:40+05:30 IST

నగరం నుంచి వివిధ

కరోనా కాలం.. మళ్లీ తాళం

లాక్‌డౌన్‌ 2021

సమాచారం వెల్లడైన మరుక్షణం..

ఉక్కిరిబిక్కిరి అయిన జనజీవనం

సరుకుల కొనుగోళ్లకు పరుగులు

మద్యం షాపుల చుట్టూ వేలాది మంది

ఒకరినొకరు తోసుకుంటూ ఎగబడ్డ వైనం

పెరిగిన బ్లాక్‌ మార్కెటింగ్‌

ఇక పనులు దొరకవని ఊళ్లకు తరలివెళ్తున్న శ్రామికులు

ఆటో దగ్గరి నుంచి లారీ దాకా

ఏది దొరికితే అందులో ప్రయాణం

పోలీసుల పహారాలో నగరం

లాక్‌డౌన్‌ జీవితానికి సన్నద్ధమవుతున్న జనం


కరోనా రెండో దశతో పాటు రెండో లాక్‌డౌన్‌ వచ్చిపడింది. గడిచిన ఏడాది కరోనాని కంట్రోల్‌ చేయడానికి విధించిన లాక్‌డౌన్‌.. ఇక మరోసారి రాదులే, ఉండదులే అనుకున్న సిటీ ప్రజలు కొత్త లాక్‌డౌన్‌ జీవితానికి సిద్ధపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమాచారం వెలువడినప్పటి నుంచి జన జీవనంలో హడావిడి పెరిగింది. సరుకుల కొనుగోళ్లు, ఇతర ఏర్పాట్లతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన ఏడాది లాక్‌డౌన్‌ అనుభవాలతో వచ్చే రోజులలో దైనందిన జీవితాన్ని సాగించడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


ఆర్టీసీ బస్సులు 20 శాతమే

చాదర్‌ఘాట్‌, మే 11(ఆంధ్రజ్యోతి) : నగరం నుంచి వివిధ జిల్లాలకు నడిచే బస్సులు దాదాపుగా రద్దు కానున్నాయి. కేవలం వంద కిలో మీటర్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే రంగారెడ్డి రీజియన్‌ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసింది. లాక్‌డౌన్‌కు ముందే 50 శాతానికి పడిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు తాజాగా అమలులోకి వచ్చిన నిబంధనలతో 20 శాతానికి తగ్గనున్నాయి. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి బెంగళూరు, ముంబై, చెన్నై, మంగుళూరు, నాగ్‌పూర్‌, షోలాపూర్‌, చత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లాకు వెళ్లే బస్సులు 15 రోజుల క్రితమే రద్దయ్యాయి. ప్రయాణికుల ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో రంగారెడ్డి రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల నుంచి దాదాపు 500 బస్సులకు గాను 250 బస్సులే నడుస్తున్నాయి. బుధవారం నుంచి వాటిలో సుమారు 50 బస్సులు మాత్రమే నడవనున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులతోపాటు ప్రయాణికులను చేరవేసేందుకు వీలైనన్ని బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. 


వంద కిలో మీటర్ల పరిధి వరకే 

ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వంద కిలో మీటర్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. తాండూరు నుంచి వికారాబాద్‌ వరకు, వికారాబాద్‌ నుంచి నగరానికి, పరిగి, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, జహీరాబాద్‌, నార్కట్‌పల్లి, నల్గొండ, దేవరకొండ, యాదాద్రి, జనగాం ప్రాంతాలకు బస్సుల రాకపోకలు సాగనున్నాయి. వంద కిలోమీటర్లు పైబడి ఉన్న ప్రాంతాల నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వచ్చిన బస్సులు తిరిగి మరుసటి రోజున ఉదయం 6 గంటలకు బయలుదేరనున్నాయి. అప్పటి వరకు డ్రైవర్లు, కండక్టర్లు బస్‌స్టేషన్‌లోనే విశ్రాంతి తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ) రద్దు

అల్వాల్‌,  మే 11 (ఆంధ్రజ్యోతి): హకీంపేట్‌లోని తెలంగాణ స్టేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో విజయవంతమైన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌ ఆర్టీలరీ సెంటర్‌లో ఈ నెల 30న  నిర్వహించనున్న కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (సీఈఈ)ని వాయిదా వేసినట్లు రక్షణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితి మెరుగైనప్పుడు కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీని ఠీఠీ.్జౌజీుఽజీుఽఛీజ్చీుఽ్చటఝడ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకుని ఏఆర్‌వో సికింద్రాబాద్‌ కార్యాలయానికి వచ్చి తాజా అడ్మిట్‌ కార్డులను పొందాలన్నారు. 


రూ. 5 భోజన కేంద్రాలు యథాతథం

హైదరాబాద్‌ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు యథాతథంగా నడుస్తాయని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రేటర్‌లో వ్యాప్తంగా 150 కేంద్రాల ద్వారా రూ. 5కే రోజూ 35 వేల నుంచి 40 వేలమందికి భోజనం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో కూడా ఈ కేంద్రాలు పేదలకు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. 


ఉన్నట్టా... లేనట్టా...?

అయోమయంలో ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థ‌లు


ఫుడ్‌ మొదలు ప్రామిసరీ నోట్ల వరకూ, గ్రోసరీ మొదలు గోట్‌ మీట్‌ వరకూ నగరంలో చాలా మంది ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లపై ఆధారపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు, కావాల్సిన వస్తువులు ఇంటి ముంగిటకే వచ్చేస్తున్నాయి. కరోనా విజృంభణ కాలంలో ఇది మరింత ఎక్కువైంది. ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిపోయింది. బయటకు వెళ్లడానికి భయపడుతున్న నగరవాసులు చాలా వరకూ తమకు కావాల్సిన సరుకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని ఇంటి వద్దనే డెలివరీ చేయించుకుంటున్నారు. కొన్ని ప్రముఖ యాప్‌లు సరుకులు బుక్‌ చేసుకోవడానికి సైతం టోకెన్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నాయంటే వాటికున్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు పలు రెస్టారెంట్లు, హోటల్స్‌ సహా ఆన్‌లైన్‌ డెలివరీ సేవలపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ తమకు అనుమతులు ఉన్నట్టా, లేనట్టా అనే సందేహంలో ఉన్నారు. అధికారులను సంప్రదిస్తే స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు. 


మా సంగతేంటి..?

‘గెస్ట్‌ ఎరైవల్స్‌ తగ్గాయి. కానీ ఇప్పటికే ఇక్కడున్న వారు, ఆల్రెడీ బుక్‌ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనే మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో మాకు కనిపించలేదు’ అంటున్నారు ఓ స్టార్‌ హోటల్‌ మేనేజర్‌. ‘లాక్‌డౌన్‌ తప్పదని తెలుసు. ఇప్పటికే గెస్ట్స్‌ లేక రెస్టారెంట్స్‌ క్లోజ్‌ చేసుకుని ఫుడ్‌ డెలివరీలపై దృష్టి సారించాలనుకుంటున్నాం. ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియడం లేదు. ఉదయం 10 గంటల వరకే అంటే టిఫిన్స్‌ కూడా సరిగా పూర్తి కావు.’ అని రెస్టారెంటీర్లు వాపోతున్నారు. కొవిడ్‌  రోగులకు ఫుడ్‌ డెలివరీ సేవలను అందిస్తున్న కొంతమంది కూడా తమ సంగతేంటన్న డైలమాలో ఉన్నారు. 


డెలివరీ లేకపోతే..

ఆన్‌లైన్‌ డెలివరీలకు అనుమతి ఇవ్వకపోతే నగరంలో కొవిడ్‌ వ్యాప్తి అడ్డుకోవడం కష్టమేనంటున్నారు కొందరు. ఇటీవలి కాలంలో షాప్‌లకు వెళ్లి కొనుగోలు చేసేవారు బాగా తగ్గిపోయారు. విద్యావంతులలో 60ు మంది ఆన్‌లైన్‌ ద్వారానే తమ అవసరాలు తీర్చుకుంటున్నారిప్పుడు. ఇది గుర్తెరిగే ఆఖరకు వీధి చివరి  కిరాణా షాపులు కూడా హోమ్‌ డెలివరీ అవకాశాలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌ డెలివరీలు ఆగితే జనం తప్పనిసరిగా రోడ్లమీదకు రావాల్సి వస్తుంది. అది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే విషయమై ఓ మాల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ‘ఉదయం 10 గంటల వరకూ అంటే తమ మాల్‌ తెరిచే అవకాశాలు లేనట్లే. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నగరంలో షాపింగ్‌ అంటే సకుటుంబ సపరివార సమేతంగా వస్తుంటారు. ఆఖరకు కిరాణా కొనడానికి కూడా. ఆన్‌లైన్‌కు అలవాటుపడ్డ వారిని మరలా ఆఫ్‌లైన్‌లో ఉదయమే షాపింగ్‌ చేయండంటే కోరి కరోనాను నెత్తిన పెట్టుకుని తెచ్చుకున్నట్లే’ అని చెప్పుకొచ్చారు. ఫుడ్‌, గ్రోసరీ డెలివరీయాప్‌ల ప్రతినిఽధులు కూడా అదే చెబుతున్నారు. గత లాక్‌డౌన్‌ సమయంలో తాము తొలుత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయితే తదనంతర కాలంలో సడలింపులు ఇచ్చారని, ఇప్పుడు కూడా డెలివరీలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నామని  చెబుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ వైద్య సేవల సిబ్బందికి కూడా పాస్‌లు ఇస్తామంటుండటం, తమ గురించి అసలు ప్రస్తావించకపోవడంతో భయంగా ఉందంటున్నారు డెలివరీ బాయ్‌లు.

- హైదరాబాద్‌ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2021-05-12T07:53:40+05:30 IST