పల్లె దవాఖానాకు తాళం

ABN , First Publish Date - 2022-08-17T05:58:49+05:30 IST

పల్లె ప్రజలకు సాధారణ చికిత్స లు స్థానికంగానే అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కానీ వైద్యులు లేరన్న కారణంగా నెలల తరబడి తాళం వేసే కనిపిస్తున్నాయి.

పల్లె దవాఖానాకు తాళం
గుడిహత్నూర్‌ మండలంలో వైద్యుడు లేక మూసి ఉంచిన ముత్నూర్‌ దవాఖానా


126 దవాఖానాలకు 16 మందే వైద్యులు

ఆశలు, ఏఎన్‌ఎంలతోనే నెట్టుకొస్తున్న అధికారులు


ఆదిలాబాద్‌, ఆగస్టు16:(ఆంధ్రజ్యోతి) : పల్లె ప్రజలకు సాధారణ చికిత్స లు స్థానికంగానే అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కానీ వైద్యులు లేరన్న కారణంగా నెలల తరబడి తాళం వేసే కనిపిస్తున్నాయి. చిన్నపాటి వైద్యానికి మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రయోజనమే లేకుండా పోయింది. జిల్లాలో చాలా గ్రామాలు మండల కేంద్రాలకు పది నుంచి 20కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో దూరభారం కావడంతో అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందక ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. కానీ వైద్య సిబ్బంది,  సౌకర్యాలు, వసతులు కల్పించక పోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామాల ప్రజలు అనారోగ్య బారిన పడి కష్టాలు పడుతున్నారు. వర్షాకాలంలో ఊరుదాటి బయటకు వచ్చే పరిస్థితులు లేక పోవడంతో స్థానిక వైద్యాన్నే నమ్ముకుంటూ అనారోగ్య బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 2 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా జిల్లా వ్యాప్తం గా మరో 126 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని చోట్ల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన అసలు వైద్యులు లేక పోవడంతో మూసిన తలుపులు తెరవడం లేదు. దీంతో పల్లె ప్రజలు చిన్నపాటి జ్వరం, అస్వస్థతలకు మండల, జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

చేతులెత్తేస్తున్న వైద్యులు..

జిల్లాలో 126 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 20 మంది మాత్రమే వైద్యులు విధుల్లో చేరారు. ఇటీవల నలుగురు వైద్యులు విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో 16 మంది వైద్యులు మాత్రమే పల్లె దవాఖానాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  మిగతా 110 దవాఖానాల్లో వైద్యులే లేకుండా పోయారు. దీంతో దాదాపుగా అన్ని చోట్ల అరకొరగానే సేవలు అందుతున్నాయి.ఉన్న కాస్త 16 మంది వైద్యులు కూడా తప్పుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా గ్రామాలకు సరైన రోడ్డు మార్గం, రవాణా సౌకర్యాలు లేక పోవడంతో వైద్యులు విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వైద్యుల నియామకం కోసం ప్రభుత్వం పలుమార్లు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఎవరూ ముందుకు రాక పోవడంతో వైద్యుల నియామకాన్ని చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.అలాగేవైద్యుల నియామకంపై జిల్లా అధికారులు కూడా ప్రత్యేక దృష్టిని సారించకపోవడంతో గ్రామీణ నిరుపేదలకు వైద్య సేవలు అందనంత దూరమవుతున్నాయి. 

పేరుకే దవాఖానా..

పల్లె దవాఖానాల్లో ఏఎన్‌ఎం, ఆశావర్కర్లతోనే వైద్య సేవలను నెట్టుకొస్తున్నారు. వైద్యులు లేరన్న కారణంగా కింది స్థాయి సిబ్బంది కూడా ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్లయితే వారానికి ఒకటి రెండు సార్లు ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు వస్తు పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. కింది స్థాయి సిబ్బంది తెలిసి తెలియని వైద్యం చేయడంతో కొన్నిసార్లు వైద్యం వికటిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో అంతంత మాత్రంగానే భరోసా కనిపిస్తోంది. సిరికొండ మండలంలో ఏర్పాటు చేసిన పల్లెదవాఖానాలో ప్రస్థుతం పోలీసు స్టేషన్‌ కొనసాగుతోంది. దీన్నిబట్టి చూస్తుంటే జి ల్లాలో పల్లె దవాఖానాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది. అర్హులైన వైద్యులు లేక పోవడంతో పల్లె దవాఖానాల వైపు గ్రామీణులు కన్నెతిౖ చూడడం లేదంటున్నారు. అసలు నిబంధనల ప్రకారం ప్రతి పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్‌ వైద్యుడితో పాటు ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ అందుబాటులో ఉండాలి. ఎంబీబీఎస్‌ వైద్యుడు అందుబాటులో లేక పోయిన ఆయుష్‌ వైద్యుడితోనైనా వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.అలాగే అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని తెలుస్తోంది. కేవలం దగ్గు, జ్వరానికి సంబంధించిన మందులను మాత్రమే ఇస్తూ ఇతర రోగాల బారిన పడిన వారిని తిప్పి పంపుతున్నారు. 

ఆర్‌ఎంపీలదే పెత్తనం..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చీరాని వైద్యానికి అడ్డుకట్ట వేయాలని భావించే రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసిన ఫలితం లేకుండానే పోయింది. మళ్లీ గ్రామాల్లో ఆర్‌ఎంపీలదే పెత్తనం కనిపిస్తోంది. గత్యంతరం లేక పల్లె ప్రజలు ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. వైద్యం పేరుతో ఆర్‌ఎంపీలు అడ్డగోలు దోపిడీకి ఎగబడుతున్నారు. వచ్చీరాని వైద్యంతో పల్లె ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదివరకే జిల్లాలో ఆర్‌ఎంపీల వైద్యం వికటించి పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. సాధారణ రోగాలనే పెద్దగా చూపుతూ దోపిడీదందాకు ఎగబడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొందరు ఆర్‌ఎంపీలు ప్రైవేట్‌ ఆసుపత్రులతో కుమ్మక్కై కమీషన్‌దందాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా లేక పోలేదు. అవసరం లేకున్నా ఆపరేషన్‌ చేయించడం ఆపై కమిషన్లు దండుకోవడం కొందరు ఆర్‌ఎంపీలకు అలవాటుగానే మారిందంటున్నారు. కొన్ని చోట్లనైతే ఆర్‌ఎంపీ వైద్యులే రక్తపరీక్షలు చేస్తూ ఫీజులు దండుకుంటున్నారు. సొంతంగానే మెడికల్‌ షాపులు నిర్వహిస్తూ అడ్డగోలుగా మందులను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మామూలుగానే తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైద్యులు ముందుకు రావడం లేదు

- రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో 

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల్లో పని చేసేందుకు వైద్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో సుమారుగా 110 పల్లె దవాఖానాల్లో వైద్యులు లేరు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్థుతానికి కొన్ని చోట్ల ఏఎన్‌ఎంలతో వైద్య సేవలను కొనసాగిస్తున్నాం. వైద్యుల కొరతతో వంతుల వారీగా విధులు నిర్వహించే విధంగా సర్దుబాటు చేస్తున్నాం. 


Updated Date - 2022-08-17T05:58:49+05:30 IST