Abn logo
Sep 20 2021 @ 23:20PM

రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం

కార్యాలయానికి తాళం వేస్తున్న ఇంటి యజమాని నర్సమ్మ

కల్హేర్‌, సెప్టెంబరు 20: రెండేళ్లుగా కార్యాలయ అద్దె చెల్లించపోవడంతో ఇంటి యజమాని ఆఫీసుకు తాళం వేసిన సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో చోటుచేసుకున్నది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్గాపూర్‌లో 2016 అక్టోబరులో ప్రైవేటు భవనంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఏశబోయిన నర్సింహులు, సాయిలుకు చెందిన ఇంటికి అద్దెకు తీసుకుని అప్పుడప్పుడు కిరాయి చెల్లించేవారు. రెండేళ్లుగా రూ.లక్షా50వేల అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్లు ఇంటి యజమాని తల్లి నర్సమ్మ తెలిపారు. తహసీల్దార్‌ రత్నం అద్దె బకాయి విషయమై కలెక్టర్‌, ఆర్డీవోలతో మాట్లాడానని, బిల్లు రాగానే ఇస్తానని చెప్పినా తాళం ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. స్థానిక ఎంపీటీసీ పీరప్ప జోక్యం చేసుకుని 15 రోజుల్లో అద్దె చెల్లిస్తామని చెప్పడంతో తాళం తీశారు.