సచివాలయాలకు తాళం వేసి.. సర్కారుపై నిరసన

ABN , First Publish Date - 2022-04-19T08:24:16+05:30 IST

ఒకరు అధికార పార్టీ నాయకుడు. పనులు చకాచకా జరుగుతాయని భావించి, గ్రామ సచివాలయ భవనం నిర్మించాడు. నష్టం వచ్చినా

సచివాలయాలకు తాళం వేసి.. సర్కారుపై నిరసన

బిల్లు చెల్లించలేదని ప్రకాశంలో వైసీపీ నాయకుడి ఆగ్రహం

అద్దె ఇవ్వలేదని అన్నమయ్య జిల్లాలో యజమాని ఆవేదన 

10 లక్షలు నష్టం వచ్చినా నిర్మాణం.. ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవం 

అప్పులు పెరిగిపోయాయని అధికార పార్టీ నేత ఆవేదన


ఒకరు అధికార పార్టీ నాయకుడు. పనులు చకాచకా జరుగుతాయని భావించి, గ్రామ సచివాలయ భవనం నిర్మించాడు. నష్టం వచ్చినా  ఎమ్మెల్యేతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేయించాడు. అయితే, రెండేళ్లవుతున్నా ఆయనకు పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. మరొకరు భవనం యజమాని. గ్రామ సచివాలయానికి భవనాన్ని అద్దెకు ఇచ్చారు. 3 నెలలుగా బాడుగ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకున్నవారు లేరు. దీంతో విసిగిపోయిన ఆ ఇద్దరూ సచివాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి.


ముండ్లమూరు/నందలూరు, ఏప్రిల్‌ 18: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో వైసీపీ నాయకుడు, అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలో భవనం యజమాని సోమవారం సచివాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. పసుపుగల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్‌ మారం అంజిరెడ్డి 2019లో సచివాలయ భవన నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. ఆ ఏడాది ఫిబ్రవరి 10న భూమిపూజ చేయించి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. 2020 సెప్టెంబరు 17న ఎమ్మెల్యే వేణుగోపాల్‌ భవనాన్ని ప్రారంభించారు. అయితే ఇంతవరకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదని అంజిరెడ్డి వాపోయా రు. భవన నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సొంతింటి మాదిరిగా నాణ్యత ప్రమాణాలతో రూ. 40 లక్షలతో నిర్మించినట్టు తెలిపారు. ఈ భవన నిర్మాణం లో తనకు రూ.10 లక్షలకు పైగా నష్టం వచ్చిందని తెలిపారు. అయినా బిల్లులు రాకపోవడంతో ఆవేదనతో నిరసన తెలిపినట్లు వెల్లడించారు. సచివాలయ సిబ్బందిని బయట కు పంపి ఆయన తాళం వేశారు. సచివాలయానికి తాళం వేయడానికి రాజకీయ కోణంలోనూ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయానికి అంజిరెడ్డి తాళం వేసిన విషయాన్ని ఎంపీడీవో చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లగా.. బిల్లు చేయాల్సింది పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన అధికారులని తెలిపారు. అంజిరెడ్డికి రూ.3 లక్షలు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉందని పంచాయతీరాజ్‌ డీఈ విఠల్‌ రాథోడ్‌ తెలిపారు. 


15 వేల అద్దె పెండింగ్‌ 

అన్నమయ్య జిల్లాలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని 2, 3 సచివాలయాలు ఒకే భవనంలో ఉ న్నాయి. కార్యాలయాల కోసం ఇంటి యజమాని జనార్దన్‌ రా వు వద్ద నెలకు రూ.5 వేలుకు బాడుగకు తీసుకున్నారు. ఆయనకు మొత్తం 11 నెలల అద్దె చెల్లించాల్సి ఉంది. ఇటీవల 8 నెలల అద్దె చెల్లించారు. మిగతా 3 నెలలు అద్దె పెం డింగ్‌లో ఉంది. ఈ మొత్తం కూడా చెల్లించాలని యజమాని అడిగినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆయన తాళం వేశారు. విధులు నిర్వహించేందుకు ఉదయం 9 గంటలకు వచ్చిన సచివాలయ సిబ్బంది బయటే వేచి ఉండాల్సి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌, వీఆర్వో రాజు యజమానితో మాట్లాడి తాళాలు తీయించారు.

Updated Date - 2022-04-19T08:24:16+05:30 IST