ఆర్టీసీ ఆదాయానికి లాక్‌

ABN , First Publish Date - 2021-06-15T05:05:34+05:30 IST

కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది.

ఆర్టీసీ ఆదాయానికి లాక్‌

  • లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న    ప్రజా రవాణా వ్యవస్థ
  • బస్సులు నడవక నష్టాల ఊబిలోకి..
  • మరోవైపు పెరుగుతున్న డీజిల్‌ ధరలు
  • భారమవుతున్న నిర్వహణ

   కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో  వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు నడవక ఆదాయం కోల్పోయిన ఆర్టీసీకి మరోపక్క పెరుగుతున్న డీజిల్‌ ధరలు నష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తున్నాయి.  దీంతో  ఆర్టీసీని కొంతలో కొంతైనా గట్టేక్కించే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : టీఎస్‌ ఆర్టీసీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు నడవక ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ... పెరుగుతున్న డీజిల్‌ ధరలతో మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. ఇప్పటికే పెరిగిన నిర్వహణ వ్యయభారంతో నెట్టుకొస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన సమయంలో ప్రణాళికాబద్ధంగా బస్సులు నడుపుతూ నష్టాల భారం నుంచి బయట పడాలని భావిస్తున్నారు. కరోనా ఉధృతిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెల 12వ తేదీ నుంచి విధించిన లాక్‌డౌన్‌తో ఆర్టీసీ బస్సులు ఎక్కువ సమయం రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేక ఆదాయం కోల్పోయింది. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరమైన పనులు ఉన్న వారే ప్రయాణం చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులు నడిచాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించడంతో ఆర్టీసీకి కొంత వెసులుబాటు లభించింది. ఆదాయం కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కొంతలో కొంతైనా గట్టేక్కించే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉన్న సమయంలో వికారాబాద్‌ జిల్లాలో 108 బస్సులు నడిపించారు. వికారాబాద్‌ డిపో పరిధిలో 27, తాండూరులో 42, పరిగి డిపో పరిధిలో 39 బస్సులు నడిపించారు. లాక్‌డౌన్‌ను సాయంత్రం 5 గంటల వరకు సడలించిన తరువాత 116 బస్సులు నడుపుతుండగా, వికారాబాద్‌ డిపో పరిధిలో 32, తాండూరులో 43, పరిగిలో 41 బస్సులు నడుస్తున్నాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోజూ 97 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూర్చేవి. అయితే లాక్‌డౌన్‌ సమయంలో జిల్లా వ్యాప్తంగా 23 వేల కిలోమీటర్ల మేరకు బస్సులు నడిపించగలిగారు. మధ్యాహ్నం ఒంటిగంటలోగా బస్సులన్నీ డిపోల్లోకి చేరుకోవాలని ఆంక్షలు ఉండడంతో ఆలోపు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో రోజుకూ రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం రాగా, లాక్‌డౌన్‌ను మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలించిన తరువాత రోజుకు రూ. 6 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయం సమకూరింది. సాయంత్రం 5గంటల వరకు లాక్‌డౌన్‌ సడలించడంతో ఇప్పుడు రోజుకూ 48వేల కిలోమీటర్ల దూరం బస్సులు నడిపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజూ సాయంత్రం వరకు బస్సులు నడిచేందుకు అవకాశం ఏర్పడడంతో మూడు డిపోల పరిధిలో రోజుకు రూ.12 లక్షల నుంచి 15లక్షల వరకు ఆదాయం సమకూరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కోల్పోయిన రూ.5 కోట్ల ఆదాయం

కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ సుమారు రూ.5 కోట్ల ఆదాయం కోల్పోయింది. సాధారణ రోజుల్లో తాండూరు, వికారాబాద్‌, పరిగి డిపోల పరిధిలో రోజుకూ రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరేది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ మూడు డిపోల పరిధిలో రూ.7 లక్షల నుంచి రూ.7.50 లక్షల మధ్య మాత్రమే ఆదాయం సమకూరింది. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఆర్టీసీ రూ. 5 కోట్ల ఆదాయం కోల్పోయింది. 

ప్రధాన రూట్లలోనే  సర్వీసులు

వికారాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ప్రధాన రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సాయంత్రం వరకు సడలించిన నేపథ్యంలో ప్రధాన రూట్లలో బస్సులు నడిపించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్‌ డిపో నుంచి హైదరాబాద్‌, సదాశివపేట్‌, పరిగి, శంకర్‌పల్లి, తాండూరు, నస్కల్‌-పరిగి, చేవెళ్ల-శంకర్‌పల్లి రూట్లలో 32 బస్సులు నడిపిస్తున్నారు. తాండూరు డిపో నుంచి 10 రూట్లలో 43 బస్సులు నడిపిస్తున్నారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మైల్వార్‌, బషీరాబాద్‌, కొత్లాపూర్‌, జీవన్గి, నీళ్లపల్లి, సంగం కలాన్‌, కరణ్‌కోట్‌ తదితర రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. పరిగి డిపో నుంచి 41 బస్సులు 6 ప్రధాన రూట్లలో నడిపిస్తున్నారు.  పరిగి-హైదరాబాద్‌, రావులపల్లి-హైదరాబాద్‌, కొడంగల్‌-హైదరాబాద్‌, కోస్గి-హైదరాబాద్‌, పరిగి-మహబూబ్‌నగర్‌, పరిగి-షాద్‌నగర్‌ రూట్లలో బస్సులు నడిపిస్తున్నారు. అయితే ప్రయాణికుల కోరిక మేరకు రద్దీగా ఉండే ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులే ...

జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మూడు డిపోల పరిధిలో 114 ఆర్టీసీ బస్సులు ఉండగా, 133 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం అద్దెబస్సులు నడిపించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులనే నడిపించాలని నిర్ణయించారు. ఇప్పుడు ప్రధాన రూట్లకే పరిమితమైన ఆర్టీసీ సేవలు.. అద్దె బస్సులకు అనుమతి వస్తే మారుమూల గ్రామాల్లో కూడా నడిపించే అవకాశం ఏర్పడుతుంది. తాండూరులో 50, వికారాబాద్‌లో 44, పరిగిలో 39 అద్దె బస్సులు ఉన్నాయి. మారుగ్రామాలకు రవాణా సేవలు విస్తృత పరిస్తేనే ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పడి ఆర్టీసీకి ఆదాయం 

సమకూరనుంది. 

రద్దీ మేరకు బస్సులు పెంచుతాం : రమేష్‌, ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌, వికారాబాద్‌. 

లాక్‌డౌన్‌ వెసులుబాటుతో అన్ని ప్రధాన రూట్లలో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచు తాం. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రమే నడిపిస్తున్నాం. అద్దె బస్సులు నడిపించేందుకు ఉన్నతాధికారులు అనుమతిస్తే ఇంకా ఎక్కువ రూట్లలో ప్రజలకు రవాణా సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. 


Updated Date - 2021-06-15T05:05:34+05:30 IST