పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-17T07:08:41+05:30 IST

కనిగిరిలో ఆదివారం అమలు చేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌ విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచే అధికారులు ఆంక్షలను కఠినంగా అమలు చేశారు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌
నిర్మానుష్యంగా ఉన్న రహదారులు

కనిగిరి మే 16 : కనిగిరిలో ఆదివారం అమలు చేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌   విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచే అధికారులు ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. మండలంలో వివిధ గ్రామాల్లో రాకపోకలను స్తంభింపజేశారు. పట్టణంలో రద్దీ వాతావరణాన్ని పూర్తిగా నియంత్రించారు. ప్రజలెవ్వరూ రోడ్లపైకి రాకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. సీఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఎస్‌ఐ రామిరెడ్డి ఉదయం నుంచి ప్రధాన కూడలిలో సిబ్బందిని నియమించి గస్తీ ఏర్పాటు చేశారు. నగర శివారుల్లో పోలీసు సిబ్బందిని ఉంచి బయట నుంచి ఎవ్వరూ ప్రవేశించకుండా ఆంక్షలను అమలు చేశారు. మాంసం దుకాణాలు, కూరగాయలు, ఇతర వ్యాపార సంస్థలన్నీ మూసివేయడంతో కనిగిరి స్తంభించింది. ప్రజలు, వ్యాపారులు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించారు. అత్యవసర సేవలైన మెడికల్‌ షాపులు, పాల విక్రయాలకు మాత్రం అధికారులు అనుమతిచ్చారు. ఆదివారం లాక్‌డౌన్‌ అన్న విషయం శనివారం సాయంత్రానికే ప్రజల్లోకి వెళ్లడంతో ముందుగా  నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి పెట్టుకున్న ప్రజలు ఆదివారం బయటకు రాలేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల పర్యవేక్షణ

వలేటివారిపాలెం: మండలంలోని అన్ని గ్రామాలలో మండల టాస్క్‌పోర్స్‌ కమిటీ సభ్యులు, గ్రామ టాస్క్‌పోర్స్‌ కమిటీ సభ్యులు ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. టాస్క్‌పోర్స్‌ కమిటీ సభ్యులు మండు టెండను సైతం లెక్క చేయకుండా కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలుపరిచారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. కందుకూరు, లింగసముద్రంలలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడంతో మాంసాహారులు చికెన్‌, మటన్‌, చేపలు కోసం వలేటివారిపాలెం వస్తారని మండల టాస్క్‌పోర్స్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సంపూర్ణ లాక్‌డౌన్‌కు మండల ప్రజలు సహకరించారని మండల టాస్క్‌పోర్స్‌ కమిటీ సభ్యులు తహసీల్దారు రెహ్మన్‌, ఎంపీడీఓ రఫీద్‌ అహమద్‌, ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు. 

స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత

దొనకొండ, మే 16: దొనకొండ మండలంలో రోజురోజుకు కరోనా విజృభిస్తొండటంతో దొనకొండలోని హెయిర్‌ సెలూన్‌ షాపుల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఏ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. దీంతో కరోనా కట్టడి కోసం నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బొమ్మలాపురం వెంకటయ్య నేతృత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూకుమ్మడిగా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నుంచి ఈనెల 30 వరకు షాపులను మూసివేస్తున్నారు.

పీ.సీ.పల్లిలో.. 

పీ.సీ.పల్లి : మండలంలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలైంది.  కిరాణా షాపులు, హోటల్స్‌, ఇతర వ్యాపారులు దుకాణాలను మూసి వేసి పూర్తిగా సహకరించారు. మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారి పోకూరి సింగారావు, ఎస్సై ప్రేమ్‌కుమార్‌లు పెదఇర్లపాడు, వెంగళాయపల్లి, పీసీపల్లి, గుంటుపల్లి  గ్రామాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణంలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి  విక్రయాలు సాగించారు. దీంతో మందుబాబులు దుకాణాల వద్దకు వచ్చి మద్యం కొనుగోలు చేసి వెళ్లారు.

చినపవనిలో హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ర్పే

చినపవని(లింగసముద్రం), మే 16: మండలంలోని చినపవని పంచాయతీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో సర్పంచ్‌ దామా సీతారామయ్య ఆధ్వర్యంలో ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీలోని చినపవని, సత్యనారాయణపురంలో ప్రతివీధిలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పంచాయతీలోని ప్రజలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు రావద్దని కోరారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-05-17T07:08:41+05:30 IST