మరోసారి లాక్‌డౌన్‌.. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్

ABN , First Publish Date - 2020-07-11T16:48:23+05:30 IST

తాండూరు, పెద్దేముల్‌ ప్రాంతంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. పెద్దేముల్‌ మండలంలో కరోనా కలవర పెడుతోంది. రెండు రోజుల క్రితం

మరోసారి లాక్‌డౌన్‌.. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్

పెద్దేముల్‌లో నేటినుంచి 18 తేదీ వరకు..

తాండూరులో 13 నుంచి 20 వరకు

 అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేత


తాండూరు / పెద్దేముల్‌(రంగారెడ్డి) : తాండూరు, పెద్దేముల్‌ ప్రాంతంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. పెద్దేముల్‌ మండలంలో కరోనా  కలవర పెడుతోంది. రెండు రోజుల క్రితం మారెపల్లి గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడికి బయటపడితే శుక్రవారం పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  శుక్ర వారం ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామపెద్దలు వ్యాపార స్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. శనివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటినీ స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని జడ్పీటీసీ ధారాసింగ్‌ ప్రజలు, వ్యాపారులను కోరారు. తాండూరు వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తాండూరు గ్రేన్‌ అండ్‌ సీడ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో వెల్ఫేర్‌ సలహాదారు కరణం పురుషోత్తంరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్నందున రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి వివరించారు. ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు అన్ని దుకాణాలు మూసివేసి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మురళీకృష్ణాగౌడ్‌, వ్యాపార ప్రతినిధులు బంటారం సుధాకర్‌, కుంచం మురళీ తదితరులు పాల్గొన్నారు.


అత్యవసరమైతేనే బయటకు రావాలి: డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ 

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. విందులు, వినోదాలు పూర్తిగా మానుకోవాలి. అందరూ ఒకచోట అస్సలు గుమికూడొద్దు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ముక్కు, నోరు కప్పిఉంచే విధంగా మాస్కును ధరించాలి. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నివారించడం సాధ్యమే.


సిటిస్కాన్‌ ద్వారా కరోనా పాజిటివ్‌ గుర్తింపు

కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను కిట్ల ద్వారా కాకుండా సిటిస్కాన్‌ ద్వారా కూడా గుర్తించవచ్చునని వైద్యులు జడ్పీ చైర్‌రప్సన్‌ సునీతారెడ్డికి సూచించడంతో వెంటనే సిటిస్కాన్‌ ద్వారా కూడా పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గత కొన్ని నెలలుగా మరమ్మతులు లేక మూలనబడ్డ సిటిస్కాన్‌  మరమ్మతుల కోసం రూ.4లక్షలు అవసరమవుతాయని, ఆ నిధులను ఆస్పత్రి అభివృద్ధి నిధుల కింద లేదా ఇతర నిధుల కింద వెంటనే విడుదల చేసి మరమ్మతులు చేయించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కలెక్టర్‌ను కోరారు. సిటిస్కాన్‌ ద్వారా లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ను సులువుగా గుర్తించే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఉన్న సిటిస్కాన్‌ ద్వారా పరీక్షలకు రూ.800లతో నిర్ధారించుకోవచ్చు. కిట్లద్వారా రూ.4వేల వరకు వ్యయం అవుతుంది. ఆస్పత్రిలో మరింత తక్కువ ఫీజుతో సిటిస్కాన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఎక్విప్‌మెంట్స్‌ను సమకూర్చాలని చైర్‌పర్సన్‌ రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తిని కూడా కోరారు. ఇదిలా ఉంటే తాండూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని జనాభా అందరికీ కరోనా పరీక్షల కోసం 500 కిట్లు మాత్రమే వైద్యవిధాన పరిషత్‌ కేటాయిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-07-11T16:48:23+05:30 IST