Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ దూరం తగ్గిందా? పెరిగిందా?

ఆంధ్రజ్యోతి(26-05-2020)

లాక్‌డౌన్‌తో దంపతులకు పూర్వం వీలుపడనంత ఏకాంతం చిక్కింది. అయితే ఈ పరిస్థితి కొందరు దంపతుల మధ్య అన్యోన్యతకు బదులు దూరాన్ని పెంచింది. దాంపత్య జీవితం బలపడవలసిన ఈ సమయం, లేనిపోని లైంగిక సమస్యలకు కారణమైంది. కష్టకాలంలోనూ దాంపత్య మధురిమలను జంటగా ఆస్వాదించాలంటే మనసెరిగి మసలుకోవాలని అంటున్నారు వైద్యులు.


కరోనా, తదనంతర లాక్‌డౌన్‌ ఎవరూ ఊహించినవి కావు. హఠాత్తుగా ఇంటికే పరిమితం కావలసి రావడం, బయటకు వెళితే కరోనా సోకుతుందనే భయం, ఆర్థిక ఇబ్బందులు పలు మానసిక సమస్యలకు దారితీశాయి. లైంగిక జీవితం సక్రమంగా సాగాలంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. మనసు హుషారుగా ఉండి, ఎటువంటి ఒత్తిళ్లూ, ఆందోళనలూ లేనప్పుడే లైంగికంగా చురుగ్గా ఉండగలం. అయితే హుషారు మందగించి, కుంగుబాటుకు లోనైతే ఆ ప్రభావం కచ్చితంగా లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కోరికలు, పటుత్వం తగ్గడం లాంటి లక్షణాలు కొత్తగా మొదలవుతాయి. నిజానికి, ముందు నుంచీ ఎలాంటి సెక్స్‌ సమస్యలూ లేని వారికి లాక్‌డౌన్‌ మూలంగా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేదు. అలా తలెత్తితే అందుకు అర్థం లేని భయాలు, ఆందోళనలే కారణమని గ్రహించాలి. ఉద్యోగ అభద్రత, ఆర్థిక పరిస్థితి దిగజారడం గురించిన ఆందోళనలతో లైంగికాసక్తి తగ్గడం సహజం. ఇవి పూర్తిగా మానసికమైన కారణాలు. 


ఒకటికి రెండు తోడైతే?

కొత్తగా లైంగిక సమస్య తలెత్తితే, అప్పటికే లాక్‌డౌన్‌ మూలంగా చోటుచేసుకున్న ఒత్తిడిని ఈ పరిస్థితి రెట్టింపు చేస్తుంది. ఫలితంగా మానసికంగా కుంగుబాటు పెరుగుతుంది. ఈ సమయంలో వైద్యులను కలిసే వీలు లేకపోవడంతో, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇవన్నీ లాక్‌డౌన్‌ మూలంగా మొదలైన లైంగిక సమస్యలకు ఓ కోణం మాత్రమే! ఇందుకు భిన్నమైన మరో కోణం కూడా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు దంపతులకు కేవలం వారాంతాల్లో మాత్రమే సన్నిహితంగా గడిపే వీలు చిక్కేది. మిగతా రోజుల్లో పని అలసట కారణంగా శారీరకంగా దగ్గరయ్యే ఓపిక, తీరిక ఉండేవి కావు. కానీ ఆఫీసు పనులతో, వ్యాపార పనులతో బిజీగా గడిపేసే భర్తలు లాక్‌డౌన్‌ మూలంగా ఇంటికే పరిమితం అవడంతో వారి నుంచి రెట్టింపు అన్యోన్యతనూ, సాన్నిహిత్యాన్నీ భార్యలు ఆశించే పరిస్థితి.


సాధారణంగా పరిమిత సెక్స్‌ సామర్థ్యానికి అలవాటు పడి, ఆ మేరకే తోడ్పడే హార్మోన్లు, ఉన్నపళాన పరిమితికి మించి అవసరం పడితే ఆ స్థితినీ శరీరం తట్టుకోలేదు. దాంతో లైంగిక సామర్ధ్యం కొంత సన్నగిల్లుతుంది. నిజానికి అదే హార్మోన్‌ స్థాయి లాక్‌డౌన్‌ పూర్వం సరిపోయి ఉండవచ్చు. కాబట్టి కొత్తగా సమస్య తలెత్తిందని భావించవలసిన అవసరం లేదు. ఇలా అంతిమంగా పూర్వం లేని కొత్త లైంగిక సమస్యలు లాక్‌డౌన్‌ ఫలితంగా పురుషులను వేధించే అవకాశం ఉంది.


తగ్గిన హార్మోన్‌ స్థాయులు!

లైంగిక ఆరోగ్యానికి తోడ్పడే హార్మోన్లు సజావుగా స్రవించాలంటే శరీరం, మనసు చురుగ్గా ఉండాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ సమయం విశ్రాంతిగా గడపడం, నియమిత నిద్ర వేళలు పాటించకపోవడం వల్ల సెక్స్‌ హార్మోన్‌ స్రావాలు తగ్గుతాయి. కొందరు పురుషుల్లో లైంగిక సామర్థ్యంతో నేరుగా సంబంధం ఉన్న టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ తగ్గుతుంది. మరికొందరిలో టెస్టోస్టెరాన్‌ స్థాయి సమంగానే ఉన్నా, పరిమితంగా ఉండవలసిన ఈస్ట్రోజెన్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్లు పెరిగిపోతాయి. ఫలితంగా టెస్టోస్టెరాన్‌ పని చేయకుండా పోతుంది. పూర్వం నుంచి హార్మోన్‌ చికిత్స కొనసాగుతూ, లాక్‌డౌన్‌ కారణంగా దానికి ఆటంకం ఏర్పడడం మూలంగా హార్మోన్‌ స్థాయులు తారుమారై ఇంకొందరిలో సమస్యలు తలెత్తవచ్చు. 


పిల్లల కోసం ప్రయత్నించే సమయంలో....

ఫెర్టిలిటీ సమస్యలతో చికిత్స కొనసాగిస్తున్న దంపతుల మీద లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువ. చికిత్స తీసుకుంటూ ఆఫీసులకు వెళుతూ రోజులో ఎక్కువ సమయం గడిపేసే దంపతులు, లాక్‌డౌన్‌ మూలంగా ఇళ్లకు పరిమితం అయ్యారు. దాంతో పిల్లలు లేని లోటు స్పష్టంగా తెలిసిరావడం, పిల్లలు కలగకపోవడానికి కారణం నువ్వుంటే నువ్వంటూ గొడవపడే పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఫలితంగా పూర్వం లేని లైంగిక సమస్యలూ కొత్తగా మొదలయ్యాయి.


అనుమానం ఉంటే?

లాక్‌డౌన్‌లో తలెత్తిన ప్రతి లైంగిక సమస్యా మానసికమైనది కాకపోవచ్చు. తరచి చూసుకుని ఎటువంటి ఒత్తిళ్లూ, ఆందోళనలూ లేకపోయినా సామర్థ్యం తగ్గినట్టు అనిపిస్తే, ప్రత్యక్షంగా వైద్యులను కలవడం అవసరం. సామర్థ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకూ మంచి చికిత్సలున్నాయి. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు.


కేస్‌ స్టడీ

‘‘సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడిపే ఓ 40 ఏళ్ల ఓ వ్యక్తి ఫోన్‌ కన్సల్టెన్సీలో సంప్రతించాడు. లాక్‌డౌన్‌ మూలంగా అతని కంపెనీ నష్టాలకు లోనైంది. దాంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఓ పక్క లక్షల్లో అద్దెలు కట్టలేక, మరోపక్క సాఫ్ట్‌వేర్‌ డేటా సెక్యూరిటీ గురించిన బెంగతో అతనికి రాత్రుళ్లు నిద్ర కూడా కరువైంది. ఫలితంగా మానసికంగా, శారీరకంగా హుషారు  తగ్గింది. ఈ పరిస్థితిలో అతని భార్య నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. పిల్లలను కనడం కోసం ఊహించని రీతిలో చిక్కిన లాక్‌డౌన్‌ ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె నుంచి ఒత్తిడి ఎదుర్కోవడంతో అతను మరింత ఆందోళనకు లోనయ్యాడు. ఫలితంగా పూర్వం లేని కొత్త లైంగిక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు కొత్తగా లైంగిక సమస్యలు తలెత్తడం, సామర్థ్య నిరూపణకు వైద్యులు, వైద్య పరీక్షలు అందుబాటులో లేకపోవడం అతని సమస్యను రెట్టింపు చేశాయి. చివరకు ఫోన్‌ కన్సల్టేషన్‌ ద్వారా అతన్ని నెమ్మదింపజేసి, అవసరాన్ని బట్టి తాత్కాలిక మందులు సూచించడం జరిగింది. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ లాక్‌డౌన్‌ సమయంలో బోలెడన్ని!


మనసెరిగి నడుచుకోవాలి!

లైంగికాసక్తికి తోడ్పడే అంశాల్లో దంపతులిద్దరి సమాన భాగస్వామ్యం ప్రధానమైనది. ఒకరినొకరు అర్థం చేసుకుని, మనసెరిగి  నడుచుకుంటే లాక్‌డౌన్‌ని మించిన క్లిష్ట సమయాల్లో కూడా ఎటువంటి లైంగిక సమస్యా తలెత్తే వీలుండదు. భర్త మానసిక పరిస్థితిని గమనించి, అర్థం చేసుకుని, లోపించిన లైంగికాసక్తికి తగ్గట్టుగా భార్యలు నడుచుకోవాలి. పరిస్థితులు మెరుగవుతాయని ధైర్యం చెబుతూ ఆలంబనగా నిలవాలి. అలాగే లాక్‌డౌన్‌ మూలంగా పని ఒత్తిడి పెరిగి, అలసటతో దూరం జరిగే భార్యల పరిస్థితినీ భర్తలు అర్థం చేసుకుని మెలగాలి. వీలైతే వారికి ఇంటి పనుల్లో ఆసరా అందించాలి. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకుంటే లైంగిక జీవితం సజావుగా సాగుతుంది.


డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌

ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌

Advertisement
Advertisement