లాక్‌డౌన్ వల్ల పనిచేసి అలసిపోతున్న మహిళలకు..

ABN , First Publish Date - 2020-05-10T17:17:18+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల నిమిషం తీరిక లేని మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలరు?

లాక్‌డౌన్ వల్ల పనిచేసి అలసిపోతున్న మహిళలకు..

ఆంధ్రజ్యోతి(10-05-2020):

ప్రశ్న: లాక్‌డౌన్‌ వల్ల నిమిషం తీరిక లేని మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలరు?

-రమణి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఇంట్లో అందరి ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ, తమ ఆరోగ్యంపై పెట్టకపోవడం వల్ల మహిళలు తెలియకుండానే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఉదయం అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం వల్ల నీరసం వస్తుంది. దాంతో మధ్యాహ్న భోజనంలో అధిక కెలోరీలు తీసుకుంటారు. తిన్న వెంటనే నిద్ర పోవడం మంచిది కాదు. అందుకే ఉదయం సమయం తక్కువగా ఉంటే ఉడికించిన గుడ్లు, పండ్లు, పాలు లేదా పెరుగు తీసుకుంటే మంచిది. అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. మధ్యాహ్న భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు క్యారట్‌, కీరా, టమోటా లాంటి పచ్చి కూరలు కొద్దిగా తీసుకొని అన్నం పాళ్లు తగ్గించాలి. సాయంత్రం ఐదారు గంటలకు ఓ గ్లాసు మజ్జిగ, కొద్దిగా మొలకెత్తిన గింజలు లేదా ఏవైనా పండ్లు తీసుకుంటే పోషకాలు విరివిగా దొరుకుతాయి. ఇలా సమయానికి తగినంత పోషకాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. కాఫీలు, టీలు మానేసి పాలు లేదా మజ్జిగ; పండ్లు తీసుకోవడం ఉత్తమం. రోజులో కాసేపు ఎండలో గడిపితే మంచిది. తద్వారా లభించే విటమిన్‌ - డి వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలరు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-10T17:17:18+05:30 IST