5.0 గైడ్‌లైన్స్‌తో.. ఐపీఎల్‌కు ఊపిరి!

ABN , First Publish Date - 2020-06-01T09:29:35+05:30 IST

విదేశీ ఆటగాళ్లు లేకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించడంపై ఫ్రాంచైజీలు సుముఖంగా లేవు. ఇప్పటికే ఈ విషయమై కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరిచాయి.

5.0 గైడ్‌లైన్స్‌తో.. ఐపీఎల్‌కు ఊపిరి!

  • అంతర్జాతీయ ప్రయాణాలకు అవకాశం 
  • అక్టోబరులో లీగ్‌?

కరోనా వైరస్‌ ప్రభావం లేకపోయి ఉంటే ఈపాటికి ఐపీఎల్‌ -13వ సీజన్‌లో చాంపియన్‌ ఎవరో కూడా తేలేది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి దాకా లీగ్‌పై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా కేంద్రం సూచించిన లాక్‌డౌన్‌ 5.0 గైడ్‌లైన్స్‌తో అందరికీ ఐపీఎల్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ లాక్‌డౌన్‌ చివరి ఫేజ్‌లో అంతర్జాతీయ ప్రయాణాలతో పాటు భారీ క్రీడా ఈవెంట్లకు అనుమతి ఇచ్చే వీలుండడం బీసీసీఐకి ఊపిరిపోసినట్టయింది.


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): విదేశీ ఆటగాళ్లు లేకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించడంపై ఫ్రాంచైజీలు సుముఖంగా లేవు. ఇప్పటికే ఈ విషయమై కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరిచాయి. మొత్తం భారత ఆటగాళ్లతో లీగ్‌ను ఆడిస్తే ఇది మరో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలా మారుతుందన్నది వారి వాదన. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ స్టార్‌ ఆటగాళ్లు ఇక్కడికి ఎలా రాగలుగుతారు? ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్‌లో వారు ఆడకపోతే ఉత్కంఠ భరిత మ్యాచ్‌లకు చోటుంటుందా? అనే ప్రశ్న లు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపించాయి. కానీ ఈ సందేహాలన్నింటికీ కేంద్ర హోం శాఖ తాజా గైడ్‌లైన్స్‌ సమాధానమిచ్చినట్టయింది. ఇంతకుముందు లాక్‌డౌన్‌ 4.0తో క్రికెట్‌ అభిమానులతో పాటు బీసీసీఐ కూడా నిరాశ చెందినా, 5.0తో మాత్రం వీరందరిలో ఆశలు చిగురించాయి.


తాజా సడలింపుతో సంతోషం: ‘ఫేజ్‌-3లో అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకలు, జిమ్నాజియం, స్విమ్మింగ్‌పూల్స్‌, సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద రంగాలకు సంబంధించి ప్రజా సమూహాలకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటాం’.. అంటూ శనివారం ప్రకటించిన ఈ ఐదో విడత గైడ్‌లైన్స్‌ క్రికెట్‌ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తింది. ఈ మూడో దశ ఆగస్టులో అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు రాకపోకలతో పాటు భారీ క్రీడా ఈవెంట్లకు కూడా వీలు చిక్కుతుంది. అదే జరిగితే ఆయా జట్లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రస్సెల్‌, నరైన్‌, బెయిర్‌స్టో, వార్నర్‌, విలియమ్సన్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే వీలుంటుంది. మరోవైపు తాజా గైడ్‌లైన్స్‌పై బోర్డు కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది నిజంగా మాకు సానుకూలాంశమే. ఒకవేళ అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణ జరిగి, క్రీడా కార్యకలాపాలకు అనుమతి లభిస్తే మా భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి సారిస్తాం’ అని ధూమల్‌ తెలిపాడు.


అక్టోబరులో ఐపీఎల్‌!: ఐపీఎల్‌ నిర్వహణపై ఇప్పటి వరకు బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అక్టోబర్‌-నవంబరులో జరిగే వీలుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశమున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని, ఈనెల 10న జరిగే సమావేశంలో ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. ఒకవేళ అంతా సానుకూలంగా జరిగితే కచ్చితంగా ఆ స్లాట్‌లో బీసీసీఐ తమ లీగ్‌ను జరపాలనుకుంటోంది. అప్పటికి విదేశీ ఆటగాళ్ల రాకపై ఆంక్షలు ఉండకపోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో 13వ సీజన్‌ను నిర్వహించే వీలుంటుంది. దీంతో అటు అభిమానులకు ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌తో పాటు బోర్డు ఖజానా కూడా భారీ ఆదాయంతో నిండడం ఖాయం.

Updated Date - 2020-06-01T09:29:35+05:30 IST