లాక్ డౌన్ బేఖాతరు!

ABN , First Publish Date - 2020-03-24T09:38:37+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని.. కలివిడి కన్నా విడివిడిగా

లాక్ డౌన్ బేఖాతరు!

ఇది.. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద దృశ్యం. పోరాట స్ఫూర్తి ఒక్క రోజేనా? ఇలాగైతే... కరోనాపై దేశం గెలిచేనా? ఇది సరికొత్త ఆందోళన! ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు జనం ఇల్లు కదల్లేదు. ‘లాక్‌డౌన్‌’ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా...  తెల్లారేసరికి మళ్లీ మామూలే! ‘వివిధ అవసరాల’ కోసం జనం పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. వాణిజ్య సంస్థలు దాదాపుగా మూతపడినప్పటికీ... రహదారులపై సందడి పూర్తిగా ఆగలేదు. ‘లాక్‌డౌన్‌’ను తీవ్రంగా పరిగణించాలన్న హెచ్చరికలతో మధ్యాహ్నం నుంచి రోడ్లపై జన సంచారం కొంత తగ్గింది. మరోవైపు... సెలవివ్వకుండా లాక్‌డౌన్‌ అంటే ఎలా అని విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు వాపోయారు. విధులు ముగిసిన తర్వాత ఇళ్లు చేరడానికి నానా ఇక్కట్లు పడ్డారు. 


జనసంచారం యథాతథం

కిక్కిరిసిన రైతు మార్కెట్లు

కూరగాయలు భగ్గు

కిలో టమాట 80, బీర 100


నేటి నుంచి కఠిన చర్యలు

బయటకు వస్తే కారణం చెప్పాల్సిందే

లాక్‌ డౌన్‌ విషయంలో పోలీసులు మంగళవారం నుంచి కఠిన వైఖరిని అవలంబించనున్నారు. తగిన కారణం లేకుండా ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సరైన కారణం చూపలేక పోయిన వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు.


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

 కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని.. కలివిడి కన్నా విడివిడిగా ఉంటేనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూకు సంపూర్ణంగా సహకరించిన ప్రజలు సోమవారం నుంచి ఈ నెల 31 వరకు విధించిన లాక్‌డౌన్‌ విషయంలో మాత్రం తొలిరోజే ప్రభుత్వ సూచనలను బుట్టదాఖలు చేశారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా జన సంచారం సాధారణంగానే కనిపించింది. రైతు బజార్లు, నిత్యావసర దుకాణాల వద్ద ప్రజలు కిక్కిరిసి కనిపించారు. రోడ్లపై ఆటోలు, కార్లు, వ్యక్తిగత వాహనాలు భారీగానే కనిపించాయి. దీంతో అసలు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కొనసాగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ప్రజలను నిలువరించే పని చేపట్టాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తొలిరోజు పాక్షికంగానే జరిగినట్టయింది. తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, పుంగనూరు, సత్యవేడు, పీలేరు, కుప్పం వంటి పట్టణాల్లో కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్లపై జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఆటోలు యథాతథంగా తిరిగాయి. ప్రైవేటు వాహనాల రాకపోకలు కూడా కొనసాగాయి. దుకాణాలు కూ డా చాలా వరకు తెరుచుకున్నాయి. జిల్లా యంత్రాంగం, స్థానిక పోలీసు, మున్సిపల్‌ యంత్రాంగాలు ఆలస్యంగా స్పందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. జనం గుంపుగా లేకుండా చూశారు. ఆటోలను అడ్డుకున్నారు. మరోసారి కనిపిస్తే వాహనాలు సీజ్‌ చేసి కేసులు పెడతామని హెచ్చరించారు. దుకాణాలు కూడా బలవంతంగా మూయించారు. మంగళవారం నుంచి ప్రజా రవాణా జరిగినా, నిత్యావసర దుకాణాలు మిన హా మిగిలిన షాపులు తెరిచినా కేసులు పెడతామని హెచ్చరించారు. 


తిరుపతిలో స్పందన శూన్యం

లాక్‌డౌన్‌ను తిరుపతి ప్రజలు సీరియ్‌సగా పరిగణించలేదు. దీంతో ఉదయం నుంచి రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటే ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీషలు పలు ప్రాంతాల్లో పర్యటించారు. గుంపులుగా జనం కనిపించిన చోట్ల హెచ్చరిస్తూ దుకాణాలు మూయించారు. చిత్తూరులో సైతం ప్రజలు, వ్యాపారులు లాక్‌డౌన్‌ పాటించడం లేదని, వాహనాలు యథాప్రకారం నడుస్తున్నాయని కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. మండల కేంద్రమైన కలికిరిలో సోమవారం జరిగిన వారపు సంత కొనుగోళ్లు, అమ్మకందార్లతో కిటకిటలాడింది. బుధవారం ఉగాది కావడంతో సంతలో కొనుగోళ్లకు జనం భారీ ఎత్తున వచ్చారు. దీంతో జనాన్ని నియంత్రించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.  


తెలంగాణలోనూ ఇదే పరిస్థితి!

పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆదివారం జనతా కర్ఫ్యూకి సహకరించిన ప్రజలు.. లాక్‌డౌన్‌ ఆదేశాలను బేఖాతరు చేశారు. నిర్మల్‌ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు యథావిధిగా తిరిగాయి. జగిత్యాల జిల్లాలోనూ లాక్‌డౌన్‌ సరిగా అమలు కాలేదు. హోటళ్లు, టీ కొట్లు, చికెన్‌ షాపులు, కిరాణ షాపులు అన్నీ తెరిచి ఉంచారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఉదయమే పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. అయితే మధ్యాహ్నం నుంచి డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడి వాహనాలను అక్కడే ఆపివేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ విమాన సర్వీసుల కోసం ప్రజలు బారులు తీరారు. కాగా, రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతించాలని వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Updated Date - 2020-03-24T09:38:37+05:30 IST