క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-05-20T05:31:28+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను జూన్‌ 2 లోగా గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు.

క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- జూన్‌ 3 నుంచి 10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం

- జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


కరీంనగర్‌, మే 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను జూన్‌ 2 లోగా గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో పలు అంశాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 3వ తేదీ నుంచి మొదలుకొని 15 రోజులపాటు 5వ విడత కరీంనగర్‌ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ హాబిటేషన్‌, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు గ్రామ, పట్టణాలకు అతి సమీపంలో ఉండేలా ఎకరం స్థలాన్ని గుర్తించాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం 15 రోజుల కార్యాచరణ రూపొందించుకొని గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా కమ్యూనిటీ సోక్‌ పిట్‌లు ఉండేలా చూడాలని  తెలిపారు. పవర్‌డే కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. వైకుంఠధామాల్లో కచ్చితంగా నీటి సదుపాయం, టాయిలెట్లు, విద్యుత్‌, బయోఫెన్సింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకరోజు అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని, గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీల్లో చేపట్టిన పనుల వివరాల బుక్‌లెట్‌ను తయారు చేయించాలని, చివరిరోజు గ్రామ సభలను నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ప్రగతిలో ఉన్నవి, ఇంకా నిర్మాణాలు చేపట్టవలసిన వాటి నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలని అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్రాస్‌ కంట్రీ వాక్‌ నిర్వహించి ఎవెన్యూ ప్లాంటేషన్‌ కొరకు అనువైన స్థలాలను గుర్తించాలని చెప్రాఉ. జిల్లా వ్యాప్తంగా దళితబంధు కార్యక్రమాన్ని వేగవంతం చేసి లబ్దిదారుల యూనిట్ల ఎంపికను అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మున్సిపల్‌ కమిషననర్‌ సేవా ఇస్లావత్‌, అటవీ శాఖాధికారి, పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎస్సీ కార్పొపేషన్‌ ఈడీ సురేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:31:28+05:30 IST