సందర్శకులతో కళకళలాడిన తాజ్‌మహల్

ABN , First Publish Date - 2020-09-21T14:04:28+05:30 IST

ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌ను ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరిచారు....

సందర్శకులతో కళకళలాడిన తాజ్‌మహల్

బారులు తీరిన పర్యాటకులు

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌ను ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరిచారు. తాజ్ మహల్ సందర్శన కోసం పర్యాటకులు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరారు. 17వ శతాబ్దంలో నిర్మించిన తాజ్ ను కరోనా వల్ల మార్చి 17వతేదీ నుంచి మూసివేశారు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొన్నారు. సోమవారం తైవాన్ దేశానికి చెందిన పర్యాటకుడు మొదటి తాజ్ సందర్శకుడని అధికారులు చెప్పారు. రెండు షిప్టుల వారీగా కేవలం ఐదువేల మంది పర్యాటకులను మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. 


తాజ్ వద్ద కౌంటరులో టికెట్లు విక్రయించడం లేదు. ఆన్ లైన్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు కొన్న వారిని స్కాన్ చేసి తాజ్ సందర్శనకు అనుమతిస్తున్నారు. పర్యాటకులకు థర్మల్ తనిఖీలు చేయడంతోపాటు తాజ్ ఆవరణను శానిటైజ్ చేశామని పురావస్తుశాఖ అధికారి గుప్తా చెప్పారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు తాజ్ మహల్ సందర్శకులకు గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజ్ గేటు వద్ద అంబులెన్సును కూడా సిద్ధంగా ఉంచారు. ఆరునెలల తర్వాత తాజ్ సందర్శకులతో కళకళలాడింది. 

Updated Date - 2020-09-21T14:04:28+05:30 IST