స్థానికంగా ఉంటేనే రేషన్‌... లేకుంటే కట్‌

ABN , First Publish Date - 2020-11-11T05:34:54+05:30 IST

ఇంటి వద్దనే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు

స్థానికంగా ఉంటేనే రేషన్‌... లేకుంటే కట్‌
కార్డుదారుల వివరాలు నమోదు చేస్తున్న సచివాలయ సిబ్బంది

పోర్టబిలిటీ రద్దుకు ప్రభుత్వ చర్యలు 


చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 10: లాక్‌డౌన్‌ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఉచిత రేషన్‌ పంపిణీ ఈనెలతో ముగియనుంది. ప్రస్తుతం జిల్లాలో 15వవిడత రేషన్‌ పంపిణీ ఈనెల 3న ప్రారంభం కాగా, 15వతేదీ వరకు కొనసాగనుంది. వచ్చేనెల నుంచి కార్డుదారులు సాధారణ నిత్యావసర సరుకుల కోటా పొందనున్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త బియ్యంకార్డులు అమల్లోకి రానున్నాయి. దీంతో ఇంటి వద్దనే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఇప్పటి వరకు పోర్టబిలిటీ ద్వారా సరుకులు పొందుతున్నారు. అయితే ఇకపై ఇంటి వద్ద అంటే స్థానికంగా నివాసం లేకుంటే రేషన్‌కార్డు రద్దయ్యే అవకాశముంది. కాగా, జిల్లాలో 11.88 లక్షల కార్డుదారులకు రేషన్‌ డోర్‌ డెలివరీ చేయాల్సి బాధ్యతను ప్రభుత్వం సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు అప్పగించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి కార్డుదారుల వివరాల నమోదు(మ్యాపింగ్‌) ప్రక్రియను ప్రారంభించారు. ఇంటి వద్దే రేషన్‌ కార్డుదారుల ఫొటోలను తీసి, చౌకదుకాణాల వారీగా కార్డులను జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌) అందించే కీ రిజిస్టర్‌ మేరకు డీలర్లు బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర సరుకులను కార్డుదారులకు అందిస్తున్నారు. జనవరి నుంచి డోర్‌ డెలివరీ విధానం అమల్లోకి రానున్నడంతో, క్లస్టర్‌ వారీ కార్డుదారుల మ్యాపింగ్‌  మేరకు సరుకులు అందించాల్సి ఉంది. పీడీఎస్‌ మేరకు చౌకదుకాణాలకు కేటాయించిన కార్డుసంఖ్యకు సచివాలయ క్లస్టర్ల వారీగా కేటాయించిన కార్డుల సంఖ్యకు వ్యత్యాసమున్నట్లు చౌక దుకాణదారుల సంఘ నేతలు వాపోతున్నారు. దీన్ని సరిచేస్తే ఇబ్బందులు ఉండవని డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పోర్టబిలిటీ విధానం ద్వారా 25 శాతం మంది కార్డుదారులు లబ్ధిపొందుతున్నారు. డోర్‌ డెలివరీ వ్యవస్థ అమల్లోకి వస్తే ఈ విధానానికి ప్రభుత్వం మంగళం పాడనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అద్దె ఇళ్లు మారినా, ఉపాధి నిమిత్తం వలస వెళ్లి స్థానికంగా లేని పేదలు ఆ నెల రేషన్‌ కోల్పోయే అవకాశం ఉంది. అయితే పోర్టబిలిటీపై స్పష్టమైన ఆదేశాలు పౌరసరఫరాల శాఖ ఇంకా వెల్లడించలేదు. 


అంతంతమాత్రంగా పంచదార కోటా...

  జిల్లావ్యాప్తంగా 15వవిడత ఉచిత రేషన్‌ పంపిణీ ఈనెల 3 నుంచి ప్రారంభమై 15 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పేదలు బియ్యం, శనగలు ఉచితంగా పొందుతున్నారు. అయితే కిలో రూ.17 వంతున అరకిలో పంచదార సరఫరా చేయాల్సి ఉంది. ఆ మేరకు 11.88 లక్షల రేషన్‌కార్డుదారులకు 602 టన్నుల పంచదార కోటా అవసరం. అయితే ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ గోడౌన్లలో 350టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ స్టాక్‌ను జిల్లాలోని 2901 చౌకదుకాణాలకు గాను, 1327 దుకాణాలకు మాత్రమే పంచదార సరఫరా జరిగింది. మిగిలిన కోటా పరిస్థితిపై అదిగోఇదిగో వస్తుందని అధికారులు అంటున్నారు. గత ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికి అరకిలో పంచదార రూ.10 వంతున ఇచ్చేది. దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు అదనంగా అరకిలో పంచదార అందేది. అయితే వైసీపీ ప్రభుత్వం పంచదార కోటా పెంచకపోగా ఉన్న కోటాను పూర్తిస్థాయిలో అందివ్వలేని పరిస్థితిలో ఉంది. దీంతో పంచదార అందక పోతే ఈ దీపావళికి నోరు తీపి చేసుకోలేమని పేదలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-11-11T05:34:54+05:30 IST