‘స్థానిక’ పోరుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ABN , First Publish Date - 2022-01-04T14:39:55+05:30 IST

వచ్చే నెలలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు అధికారులు, ఎంపిక వంటి ప్రక్రియ కూడా

‘స్థానిక’ పోరుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

                                - డీఎంకే, ఎంఎన్‌ఎం జోరు


అడయార్‌(చెన్నై): వచ్చే నెలలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు అధికారులు, ఎంపిక వంటి ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. ముఖ్యంగా అధికార డీఎంకే సోమవారం అన్నానగర్‌, చేపాక్‌-ట్రిప్లికేన్‌, థౌజంట్‌ లైట్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల ఎంపికపై సమీక్షా సమావేశం నిర్వహించింది. చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో పోటీచేసే అశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఒక్కో వార్డుకు సగటున 15 నుంచి 25 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో డీఎంకే తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జోరుగా సాగుతు న్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వార్డులకు అభ్యర్థుల ఎంపికకు వడపోత సాగుతోంది. గత నెల 30న చెన్నై ఉత్తర జిల్లా పరిధిలోని రాయపురం, ఆర్‌కే నగర్‌, పెరంబూరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అలాగే, 31వ తేదీ చెన్నై మాధవరంలోని డీఎంకే కార్యాలయంలో తిరువొత్తియూరు, మాధవరం, రెడ్‌హిల్స్‌ స్థానాల పరిధిలో ని వార్డు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సోమవారం థౌజండ్‌లైట్‌, అన్నానగర్‌, చేపాక్‌ - ట్రిప్లికేన్‌ అసెంబ్లీ స్థానాల పరిధిలోని వార్డులకు ఇంటర్వ్యూలు చేశారు. ఇందులో డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌, ఎమ్మెల్యేలు ఎళిలన్‌, మోహన్‌, పార్టీ విభాగ కార్యదర్శులు తదితరులు పాల్గొనగా ముందుగా థౌజండ్‌లౌట్‌ పరిధిలోని ఆరు వార్డులకు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. మొత్తం మూడు నియోజకవర్గాల పరిధిలోని వార్డులకు సంబంధించి మొత్తం 70కి పైగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఒక్కో వార్డుకు ముగ్గురు చొప్పున జాబితా తయారు చేశారు. ఇదేవిధంగా డీఎంకే తరపున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. మరోవైపు నటుడు కమల్‌హాసన్‌ సారథ్యంలోని మక్కల్‌ నీదిమయ్యం తరపున కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను కమల్‌హాసన్‌ నేతృత్వంలోకి బృందం పరిశీలిస్తోంది.

Updated Date - 2022-01-04T14:39:55+05:30 IST