సీసీఆర్‌సీతో కౌలు రైతులకు రుణాలు

ABN , First Publish Date - 2021-06-15T04:56:13+05:30 IST

పంట సాగు హక్కు పత్రాలు(సీసీఆర్‌సీ) పొందిన రైతులందరికీ రుణాలు మంజూరు చేయడంతోపాటు , కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీసీఆర్‌సీతో కౌలు రైతులకు రుణాలు
నియామక పత్రాలు అందిస్తున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌, జూన్‌ 14: పంట సాగు హక్కు పత్రాలు(సీసీఆర్‌సీ)  పొందిన రైతులందరికీ రుణాలు మంజూరు చేయడంతోపాటు , కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి  ఆర్‌బీకేలో ఆయా రెవెన్యూ కార్యదర్శి, వ్యవ సాయ సహాయకులు, బ్యాంకు మిత్రల సమన్వయంతో, ఈనెల  25 వరకూ సాగు హక్కు పత్రాల మంజూరుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తా మన్నారు. గత ఏడాది 20,934  సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయగా ఈ ఏడాది 34,వేల కార్డులు జారీ చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. సీసీఆర్‌సీ  ద్వారా తీసుకునే వ్యవసాయ రుణాల బాధ్యత కౌలు రైతు పైనే ఉంటుందని  తెలిపారు. ఆ రుణంతో భూమికి యజమానికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఈ పత్రాల ద్వారా పంటల బీమా పథకం , సున్నా వడ్డీ , వైఎస్‌ఆర్‌ భరోసా  పొందొచ్చని వెల్లడించారు.  ఈ సాగు హక్కు పత్రాల గడువు  11 నెలలు మాత్రమే ఉంటుందన్నారు. దేవదాయ భూములు సాగు చేస్తున్న వారు కూడా సీసీఆర్‌సీ పొందొచ్చన్నారు.  ఈ కార్డులు పొందిన వారికి జిల్లా వ్యాప్తంగా రూ.308 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నా మని తెలిపారు. 

నిజాయితీగా పని చేయండి

 ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నీతి, నీజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సూచించారు. జిల్లాలోని మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల స్ధానంలో వారి వారసులు, కుటుంబ సభ్యులు ఐదుగురికి వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తూ  నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువ ఉద్యోగులు కష్టపడి పని చేసే తత్వాన్ని అలవరచుకోవాలని కోరారు.  జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, కలెక్టరేట్‌ ఏవో దేవి ప్రసాద్‌ పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో   నిర్వహించిన టెలీ ‘స్పందన’కి వివిధ సమస్యలపై 20 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఆయా వినతులను సంబంధిత అధికారులకు పంపించారు. 


  

Updated Date - 2021-06-15T04:56:13+05:30 IST