కౌలు రైతులకు రుణాలు

ABN , First Publish Date - 2020-10-24T11:28:12+05:30 IST

సెంటు భూమిలేని చిన్న, సన్నకారు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కౌలు రైతులకు రుణాలు

స్వయం సహాయక సంఘాల ఏర్పాటు

ఒక్కో ఆర్‌బీకే పరిధిలో 5 సంఘాలు

రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు రుణం


నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 23 : సెంటు భూమిలేని చిన్న, సన్నకారు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు అందిస్తోంది. జిల్లాలో దాదాపుగా 875 సంఘాలను వ్యవసాయశాఖ  ఏర్పాటు చేయగా అందులో 128 సంఘాలు రుణాలు పొంది పంటలు పండిస్తున్నాయి.


భూయజమాని అవసరం లేకుండా కేవలం సాగు పత్రంతోనే కౌలు రైతులకు బ్యాంకుల నుంచి ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. ఇందుకోసం కౌలు చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు ఐదుగురితో స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ముందుగా వీరంతా కౌలు చేసుకుంటున్నట్లు ఈ-పంట నమోదులో రికార్డు చేసుకుని ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖకు చెందిన వీఏఏల ద్వారా సాగుపత్రం పొంది ఉండాలి. ఈ పత్రంతోపాటు వ్యక్తిగత ఫొటోలు, ఐదు మంది కలిసి గ్రూపు ఫొటో అవసరం. ఏపంటను వేసుకుంటున్నారో ముందే తీర్మానం చేసుకోవాలి. ఆధారుకార్డు, సాగుపత్రం, ఫొటోలతో రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వీఏఏలను సంప్రదిస్తే స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత బ్యాంకు ఖాతా తెరవాలి.


ఇప్పటికే 128 సంఘాలకు రుణం

ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో కనీసం 5 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం జిల్లాలో సుమారు 3300 సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటికే 1732 సంఘాలను ఏర్పాటు చేశారు. వాటిలో 875 సంఘాలకు బ్యాంకు ఖాతాలు తెరిచారు. 128 సంఘాలకు దాదాపుగా రూ.127.75 లక్షల మేర రుణాలు అందించారు. ఒక్కో సంఘానికి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు రుణం ఇస్తున్నారు. ఈ రుణాల వల్ల అధిక వడ్డీల బాధ నుంచి కౌలు రైతులకు కొంతమేర ఉపశమనం లభించినట్లైంది. రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ వర్తింపజేయడమేకాక మరింత రుణం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 


సద్వినియోగం చేసుకోండి- అనిత, ఏడీఏ, వ్యవసాయశాఖ

కౌలు చేసుకునే చిన్న, సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూయజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి నుంచి ఏ పత్రాలు తీసుకోకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తోంది. తప్పనిసరిగా ఈ-క్రాప్‌ బుకింగ్‌లో పేరు నమోదై సాగుపత్రం తీసుకుని ఉండాలి. 

Updated Date - 2020-10-24T11:28:12+05:30 IST