అన్నదాతకు ఆసరా

ABN , First Publish Date - 2020-08-04T10:26:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది.

అన్నదాతకు ఆసరా

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల జారీకి కేంద్రం చర్యలు

పంటలను బట్టి రుణాలు

బ్యాంకుల ద్వారా కార్డుల పంపిణీకి చర్యలు


(పార్వతీపురం): కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఏడాదికి రూ.6 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. వీటి ద్వారా ఆర్థిక ఆసరా కల్పించాలని నిర్ణయించింది. కార్డుల పంపిణీకి మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకుల ద్వారా రుణాలు అవసరమైన రైతులంతా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు పొందవచ్చు. సంబంధిత బ్యాంకుల ద్వారా ఈ కార్డులు జారీ అవుతాయి. వీటి ఆధారంగా పంటను బట్టి రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎకరా వరికి రూ.30 వేలు, చెరకుకు రూ.50 వేలు, అరటికి రూ.60 వేలు, పసుపు పంటకు రూ.70 వేలు ఇలా పంటను బట్టి రుణం మంజూరు చేస్తారు. తొలుత కార్డు కోసం రైతులు తమ పీఎం సమ్మాన్‌ నిధి జమ అవుతున్న బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు జిరాక్సులతో పాటు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం నకళ్లు అందించాలి.


గుర్తింపు నిర్ధారించేందుకు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు అందజేయవచ్చు. ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతు పాస్‌ పోర్టు ఫొటో ఇవ్వాలి. రైతులు ఇచ్చిన పత్రాలను పరిశీలించిన తరువాత బ్యాంకు అధికారులు కార్డులు మంజూరు చేస్తారు. కార్డుల ద్వారా రుణం పొందిన రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే 3 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. తక్కువ వడ్డీతో రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రైతులకు ఐదేళ్ల కాల పరిమితితో ఈ కార్డులు జారీ చేస్తారు. 


కార్డుతో ఉపయోగాలు


పంట అవసరాలను బట్టి దశలవారీగా రుణాలు తీసుకోవచ్చు.

కార్డు తీసుకొనే ప్రతి రైతుకు బీమా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నెలకు రూ. 12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల రైతులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, 18-50 ఏళ్ల వయసు గల రైతులకు రూ.330 ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన బీమా చేయించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రీమియం మొత్తాన్ని ఏటా రైతుల ఖాతాల నుంచి జమ చేసుకుంటారు.


కార్డులు అందిస్తాం.. శ్రీనివాసరావు, జిల్లా ఎల్‌డీఎం

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని అర్హులైన రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తాం. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చేతులమీదుగా ఈ ఏడాది బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎంతమంది రైతులకు అందిస్తామన్న అంశాలను పుస్తక రూపంలో విడుదల చేయనున్నాం.

Updated Date - 2020-08-04T10:26:30+05:30 IST