రుణాలు సరే, మార్కెట్‌ మాటేమిటి?

ABN , First Publish Date - 2020-05-19T06:24:33+05:30 IST

కరోనా సంక్షోభానికి పూర్వమే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (క్లుప్తంగా ‘చిన్న పరిశ్రమలు’) సమస్యల ఊబిలో కూరుకుపోయాయి. బ్యాంకులు వ్యవసాయేతర రంగాలకు ఇచ్చిన రుణాలలో ‘చిన్న పరిశ్రమల’ వాటా 2019 మార్చిలో...

రుణాలు సరే, మార్కెట్‌ మాటేమిటి?

సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలను ఇతోధికంగా పెంచి తీరాలి. అదే సమయంలో చిన్న పరిశ్రమలకు వస్తు సేవల పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మార్కెట్ డిమాండ్ లేని పక్షంలో, చిన్న పరిశ్రమలకు ఉదారంగా బ్యాంకు రుణాల సదుపాయం కల్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనముండదు. వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న చిన్న పరిశ్రమలు రుణాలతో పునరుజ్జీవం పొందలేవు.


కరోనా సంక్షోభానికి పూర్వమే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (క్లుప్తంగా ‘చిన్న పరిశ్రమలు’) సమస్యల ఊబిలో కూరుకుపోయాయి. బ్యాంకులు వ్యవసాయేతర రంగాలకు ఇచ్చిన రుణాలలో ‘చిన్న పరిశ్రమల’ వాటా 2019 మార్చిలో 5.58 నుంచి 2020 ఫిబ్రవరిలో 5.37 శాతానికి తగ్గిపోయింది. ‘చిన్న పరిశ్రమలు’ రుణాలు తీసుకోగల పరిస్థితులలో లేవు; బ్యాంకులూ వాటికి పరపతి సదుపాయం కల్పించే పరిస్థితీ లేదు. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడగల సత్తాను ‘చిన్న పరిశ్రమలు’ కోల్పొతుండడమే ఇందుకు కారణం. కరోనా లాక్‌డౌన్ పరిస్థితిని మరింతగా దిగజార్చింది. మార్కెట్‌లో డిమాండ్ వుండి, చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించుకుని లాభాలు ఆర్జించగలిగినప్పుడే రుణాల లక్ష్యం నెరవేరుతుంది.


సముపార్జించిన లాభాలతో రుణాలపై వడ్డీ, అసలును వ్యాపారస్తులు చెల్లించగలుగుతారు. మరి మార్కెట్‌లో డిమాండ్ లేనప్పుడు లాభార్జన అసాధ్యం. ఫలితంగా రుణాలు భారమవుతాయి. చెప్పవచ్చినదేమిటంటే ‘చిన్న పరిశ్రమలు’ వర్ధిల్లాలంటే రుణసదుపాయం కల్పించడంకంటే వాటి ఉత్పత్తులకు మార్కెట్ డిమాండ్ ఉండడమే ముఖ్యం. 


చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలోని ఒక ‘స్వయం సహాయక బృందం’ వ్యవహారాలను అధ్యయనం చేశాను. ఆ ‘బృందం’ ఇచ్చిన రుణాలతో గ్రామస్తులు పాడి పశువులను కొనుక్కున్నారని, వారి ఆదాయాలు పెరిగాయని ఆ స్వయం సహాయక బృందాన్ని ప్రమోట్ చేసిన ఎన్‌జిఓ తెలిపింది. గ్రామస్తులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే గ్రామంలోని పాడి పశువుల సంఖ్య పెరిగిందా అని గ్రామస్తులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వారు సమాధానమిచ్చారు. దీన్ని బట్టి గ్రామస్తులు తమకు లభించిన రుణాన్ని కొత్త పాడిపశువుల కొనుగోలుకు ఉపయోగించలేదని స్పష్టమయింది. గృహ నిర్మాణానికి, వివాహ వేడుకలకే వారు ఆ సొమ్మును వినియోగించారు. స్వయం సహాయక బృందం ద్వారా లభించిన రుణ సహాయం వాస్తవానికి ఆ గ్రామస్తుల ఆదా యం క్షీణించడానికి దారితీసింది! గతంలో పాల విక్రయం ద్వారా లభించిన సొమ్ము గ్రామస్తుల చేతుల్లో వుండేది. స్వయం సహాయక బృందం రుణాలతో పాల ఆదాయంలోని కొంత భాగం బ్యాంకు వడ్డీ చెల్లించడానికి వెళ్ళిపోతుంది. పాడి పశువుల సంఖ్య పెరగనందున ఆదాయంలో పెరుగుదల లేదు. పైగా వడ్డీ చెల్లింపు అదనపు భారంగా పరిణమించింది.


ఇదే విధంగా, నిజమైన అదనపు ఆదాయం కొరవడినప్పుడు ‘చిన్న పరిశ్రమలు’ తీసుకునే రుణాలు వాటి ఆదాయాల తగ్గుదలకు అనివార్యంగా కారణమవుతాయి. పెద్దనోట్ల రద్దు ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధమైన ఫలితాలకు ఎలా దారితీసిందో మనకు తెలుసు. ‘చిన్న పరిశ్రమల’కు మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కూడా అదే విధంగా నిష్ప్రయోజనమైపోగలదని నేను భావిస్తున్నాను. ఈ ఉహాత్మక ఉదాహరణను పరిగణనలోకి తీసుకోండి. ఒక ‘చిన్న పరిశ్రమ’ యజమాని కోటి రూపాయల విలువైన ఆస్తిని బ్యాంకుకు తనఖా పెట్టి రూ.80లక్షల రుణం తీసుకున్నాడు. ఆ ఆస్తి విలువ రూ.60 లక్షలకు పడిపోయింది. అతని సంస్థ కూడా నష్టాల్లోకి దిగజారిపోయింది. దానిని వదిలించుకోవడానికి అతడు నిర్ణయించుకున్నాడు.


సదరు వ్యాపారస్తుడు, బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కయ్యారు. ఫలితంగా నష్టాల్లో పడిన సంస్థకు అదనంగా రూ.2 కోట్ల రుణం మంజూరయింది! ఈ రెండు కోట్ల రూపాయలలో రూ.50 లక్షలు ఛార్టర్డ్ అకౌంటెంట్, బ్యాంక్ మేనేజర్ స్వాయత్తమవుతాయి. వ్యాపారస్తుడు రూ.150 లక్షల లబ్ధి పొందుతాడు. అతని ‘చిన్న పరిశ్రమ’ దివాలా తీస్తుంది. ఆ పరిశ్రమ అధిపతి తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంకు వేలంవేస్తుంది. రూ.60 లక్షలను మాత్రం రాబట్టుకోగలుగుతుంది. అయితే ప్రభుత్వం ‘చిన్న పరిశ్రమల’కు కల్పించిన ఆర్థిక ప్యాకేజీలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు రూ.2 కోట్లు చెల్లిస్తుంది. అంతిమంగా ఆ ఆర్థిక ప్యాకేజీ సాధించేదేమిటి? నష్టాల్లో పడిన ‘చిన్న పరిశ్రమల’ను మూసివేయడానికి లేదా ప్రభుత్వాన్ని మరో విధంగా మోసగించి లబ్ధి పొందడానికి మాత్రమే ఆ ఆర్థిక ప్యాకేజీ అంతిమంగా ఉపయోగపడుతుంది!


‘చిన్న పరిశ్రమలు’ లాభదాయకంగా విలసిల్లాలంటే వాటి ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండాలి; బ్యాంకు పరపతి సదుపాయమూ సులభ రీతుల్లో వాటికి అందుబాటులో ఉండితీరాలి. అప్పుడే అవి వర్ధిల్లగలుగుతాయి. మరి ‘చిన్న పరిశ్రమల’ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ పెంపొందించడానికి కొన్ని అనివార్యమైన అవరోధాలు ఉన్నాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ (డబ్ల్యుటిఓ) ఒప్పందంలో భాగస్వామ్యం; పారిశ్రామిక దేశాలలో వలే ‘అధునాతన’ ఆటోమెటిక్, రోబో ఫ్యాక్టరీలను అభివృద్ధిపరచుకోవాలనే ఆరాటం ఆ అవరోధాలలో ప్రముఖమైనవి. ఆ అధునాతన కంపెనీలు- దేశీయ, విదేశీ- చౌక ధరలకు సరుకులను విరివిగా అందించగలుగుతున్నాయి. ఆ చౌక వస్తువులతో ‘చిన్న పరిశ్రమల’ ఉత్పత్తులు పోటీ పడలేకపోతున్నాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే డబ్ల్యు టి ఓ ఒప్పందం అనుమతించిన మేరకు అన్నిరకాల సరుకులపై దిగుమతి సుంకాలను గరిష్ఠంగా పెంచాలి.


చౌక దిగుమతుల నుంచి మన ‘చిన్న పరిశ్రమల’కు సంరక్షణ కల్పించలేని పక్షంలో అసలు ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వైదొలిగేందుకు కూడా సంసిద్ధమవ్వాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అంతర్జాతీయ వాణిజ్యంలో డబ్ల్యుటిఓ ప్రభావాన్ని తగ్గించారు ఆహార సబ్సిడీల విషయంలో పారిశ్రామికదేశాల పెత్తందారీతనాన్ని మన దేశం విజయవంతంగా సవాల్ చేసింది. డబ్ల్యుటిఓకు చరమ గీతం పాడేందుకు మనం సాహసోపేతంగా వ్యవహరించాల్సిన సమయమాసన్నమయింది. ఈ లక్ష్యసాధనలో భాగంగా మనం తొలుత దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలను ఇతోధికంగా పెంచి తీరాలి. అదే సమయంలో ‘చిన్న పరిశ్రమల’కు వస్తు సేవల పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


దిగుమతి సుంకాల తగ్గుదల దేశీయ కార్పొరేట్ కంపెనీలకు కాకుండా ‘చిన్న పరిశ్రమల’కు లాభదాయంగా ఉండేలా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. మార్కెట్లో డిమాండ్ లేని పక్షంలో చిన్న పరిశ్రమలకు ఉదారంగా బ్యాంకు రుణాల సదుపాయం కల్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనముండదు. లక్షలాదిమందికి ఉపాధికల్పించగల ‘చిన్న పరిశ్రమలు’ రుణాలతో పునరుజ్జీవం పొందలేవు. మార్కెట్ డిమాండ్ పెంపుదలకు ప్రాధాన్యమివ్వకుండా కేవలం రుణసదుపాయం కల్పించడమంటే కేన్సర్‌తో బాధపడుతున్న ఒక రోగిని– బ్యాంకు రుణం తీసుకుని లగ్జరీ కారు కొనుక్కుని చనిపోయేలోగా విలాసవంతమైన విహారయాత్రకు వెళ్ళమనడమే అవుతుంది. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-05-19T06:24:33+05:30 IST