రుణ పునర్‌ వ్యవస్థీకరణ అర్హత వెబ్‌సైట్‌లోనే నిర్ధారణ

ABN , First Publish Date - 2020-09-22T06:17:04+05:30 IST

ఎస్‌బీఐ రిటైల్‌ కస్టమర్లు ఏకకాల రుణ పునర్‌ వ్యవస్థీకరణ అర్హత ఉన్నదా లేదా అనే విషయం ఆన్‌లైన్‌లోనే పరిశీలించుకునేందుకు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లోనే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ కస్టమర్లు బ్యాంకుకు రావలసిన పని లేకుండా వెబ్‌సైట్‌ సహాయంతోనే అర్హతను పరిశీలించుకునేందుకు ఇది ఏర్పాటు చేశామని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు...

రుణ పునర్‌ వ్యవస్థీకరణ అర్హత వెబ్‌సైట్‌లోనే నిర్ధారణ


  • కస్టమర్ల సౌలభ్యానికి ఎస్‌బీఐ ఏర్పాటు 


ముంబై : ఎస్‌బీఐ రిటైల్‌ కస్టమర్లు ఏకకాల రుణ పునర్‌ వ్యవస్థీకరణ అర్హత ఉన్నదా లేదా అనే విషయం ఆన్‌లైన్‌లోనే పరిశీలించుకునేందుకు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లోనే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ కస్టమర్లు బ్యాంకుకు రావలసిన పని లేకుండా వెబ్‌సైట్‌ సహాయంతోనే అర్హతను పరిశీలించుకునేందుకు ఇది ఏర్పాటు చేశామని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. అర్హత గల కస్టమర్లు మాత్రం మిగతా లాంఛనాలు పూర్తి చేయడానికి బ్యాంకుకు రావచ్చునని ఆయన అన్నారు. తాత్కాలికంగా ఉపాధి కోల్పోయి 6 నుంచి 24 నెలల కాలపరిమితిలో తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉన్న వారికి తాము అండగా నిలవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. 


ఏం చేయాలి?

  1. మొదట కస్టమర్లు వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి రుణపునర్‌ వ్యవస్థీకరణను తెలియచేసే విభాగంలో తమ ఖాతా నంబర్‌ నింపాలి. 
  2. అప్పుడు కస్టమర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నిర్ధారించిన తర్వాత మిగతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు సంబంధిత కస్టమర్‌ అర్హుడా, కాదా తెలియచేసే సందేశం వస్తుంది. 
  3. అర్హులైన కస్టమర్లకు ఒక రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. ఆ రిఫరెన్స్‌ నంబర్‌ 30 రోజుల పాటు చెల్లుబాటవుతుంది. ఆ లోగా కస్టమర్‌ సంబంధిత బ్రాంచ్‌కి వెళ్లి మిగతా లాంఛనాలు పూర్తి చేసుకోవాలి. 
  4. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత బ్యాంకు అధికారులు రుణపునర్‌ వ్యవస్థీకరణ అమలుపరుస్తారు.

Updated Date - 2020-09-22T06:17:04+05:30 IST