ఢిల్లీ రుణం గల్లీలోనే ఆగింది!

ABN , First Publish Date - 2021-10-08T05:09:46+05:30 IST

పైసా అప్పు పుట్టని రోజుల్లో మహిళా సమాఖ్యలకు అప్పటి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సహాకారంతో రుణాలు అందాయి.

ఢిల్లీ రుణం గల్లీలోనే ఆగింది!
ఏపీఎంలతో విచారణ నిర్వహిస్తున్న డీఆర్‌డీవో విద్యాచందన, అధికారులు

ఆర్‌ఎంకే రుణ బకాయిలు రూ. రెండు కోట్లు

ముదిగొండ, బోనకల్‌లోనే నూరుశాతం చెల్లింపులు

బాధితుల్ని విచారణకు రానివ్వని ఏపీఎంలు

లోన్లపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు

వివరాలు వెల్లడించిన డీఆర్‌డీవో విద్యాచందన

ఖమ్మంసంక్షేమవిభాగం, అక్టోబరు 7: పైసా అప్పు పుట్టని రోజుల్లో మహిళా సమాఖ్యలకు అప్పటి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సహాకారంతో రుణాలు అందాయి. అదీ కేవలం రూ.1 వడ్డీకే. ఉద్దేశ్యం మంచిదైనా గ్రామ సమాఖ్యలపై అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపో వటంతో అసలును మించాయి. ఇవి గ్రామ సమాఖ్యలు, పూర్వ మండల సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్ముల కు చుట్టుకున్నాయి. లేకుంటే ఢిల్లీ కోర్టుకు రిమాండ్‌కు హాజరు కావాలని రుణాలు తీసుకున్న ప్రతి మూడు మండలాలకు ఓ కోర్టు కానిస్టేబుల్‌ ఏర్పాటు చేశారు. కాగా నాడు పని చేసిన మండల సమాఖ్య సిబ్బంది ఆర్‌ఎంకే రుణాల్లో 30శాతం వరకు చెల్లించకుండా గాయబ్‌ చేసినట్లు గుసగుసలు వినిపించాయి.

ప్రాథమిక విచారణలో రూ.2కోట్ల బకాయిలు అంచనా

తిరుమలాయపాలేం మండల సమాఖ్య ఆర్‌ఎంకే రుణాల చెల్లింపుల విషయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహిళా సమాఖ్యలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఖమ్మం డీఆర్‌డీవో విద్యాచందన గురువారం ఖమ్మం టీటీడీసీలో ఆర్‌ఎంకే రుణాలు తీసుకున్న ఏపీఎంలతో విచా రణ నిర్వహించారు. 2006-07లో ఆర్‌ఎంకే రుణాలను ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి కొత్తగూడెంలో ఐదు మండలాల్లో అందించారు.

ముదిగొండ,బొనకల్‌ భేష్‌

 ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలానికి రూ.25లక్షలు రుణం అందించగా ఆ మండల సమాఖ్యలు వడ్డీతో సహా మొత్తం రూ.30,76,470 చెల్లించారు. అలాగే బోనకల్‌ మండలంలో రూ.50లక్షలు రుణం తీసుకొగా వడ్డీతో కలిసి రూ.65,64,590 నూరుశాతం రుణాల బకాయిలను చెల్లించారు.

కేవలం 7మండలాల్లో రూ.7కోట్ల బకాయిలు

2006వ సంవత్సరంలో నూరుశాతం రుణ బకాయిలు చెల్లించిన మండల సమాఖ్యలను రాష్ట్ర మహిళ కోష్‌ రుణాలకు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ముదిగొండ, బోనకల్‌, చింతకాని, వెంసూరు, సత్తుపల్లి, కామేపల్లి, మధిర, ఖమ్మంరూరల్‌, తిరుమలాయపాలెం మండలాలను ఆర్‌ఎంకే పథకానికి ఎంపిక చేశారు. ప్రతీ మండలానికి రూ.50లక్షల చొప్పున రూ. ఐడుకోట్లు రుణాలను అందించారు. వీటిని 2007నుంచి 2012 లోగా రుణాలను క్రమ పద్దతిలో చెల్లించిన వారికి రూ.1 వడ్డీతో ఆయా మండల సమైఖ్యలతో ఆర్‌ఎంకే సంస్థ ఓప్పందం కుదుర్చుకుంది. అవి సరిగా చెల్లించకపోవటంతో ప్రతి మూడు నెలలకు చక్రవడ్డీతో కలిసి రూ. రెండు కోట్ల బకాయిలు వరకు పెరిగాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో అసలు తీసుకున్న రుణం రూ.98,91,792 కాగా వడ్డీ మాత్రం రూ. 1.20 కోట్లను వడ్డీగా చెల్లించాల్సి వస్తోదని ప్రాథమికంగా విచారణలో తెల్చారు.

30శాతం మింగేశారా ?

ఆర్‌ఎంకే విచారణ జరుగుతున్న నేపథ్యంలో రుణాలకు సంబంధించి అవినీతి జరిగిందని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కొంతమంది మండల స్థాయి అధికారులు చర్చించుకున్నారు. వాస్తవానికి రుణాలు మంజూరు సమయంలో ఆదర్శవంతంగా ఎన్‌పీఏ మండల సమాఖ్యలను ఎంపిక చేశారు. తీసుకున్న రుణాల్లో 80శాతం వరకు షెడ్యూల్‌ మేరకు చెల్లింపులు చేశారు. కాగా విచారణలో తెలిన లెక్కల మేరకు మండల సమాఖ్యలు చెల్లించిన వాటిలో 50శాతం వరకు ఆర్‌ఎంకే సంస్థకు వెళ్లినట్లు మిగిలిన 30శాతం రుణాలు చెల్లింపుల సమయంలో పనిచేసిన మండల స్థాయి అధికారులు గాయబ్‌ చేసినట్లు పరోక్షంగా చర్చ జరిగింది.

బాధితుల్ని విచారణకు రానివ్వని మండల అధికారులు

ఆర్‌ఎంకే రుణాల విచారణ పత్రికల ద్వారా తెలుసుకున్న కొన్ని మండలాల బాధితులు డీఆర్‌ డీఏ అధికారుల విచారణకు వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఆయా మండ లాల సమాఖ్యల బాధ్యత అధికారులు మాత్రం తాము విచారణకు వెళ్తామని మీరు రావొద్దని చెప్పారని కొంతమంది బాధితులు ఆంధ్రజ్యోతికి ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తంచేశారు.

7మండలాలకు ఆడిట్‌లు చేయిస్తాం.. మెరుగు విద్యాచందన, డీఆర్‌డీవో, ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లాలో తొమ్మిది మండలాకు ఆర్‌ఎంకే రుణాలు మంజూరు కాగా వాటిలో రెండు మం డలాలు నూరుశాతం చెల్లింపులు జరిగాయి. మిగిలిన ఏడు మండలాల ఏపీఎంలతో ప్రాధమిక విచారణ పూర్తి చేశాం. అసలు, వడ్డీ బకాయిలను అంచనా వేశాం. శుక్రవారం నుంచి ఆయా మండలాలకు ఆడిటర్‌లను పంపిస్తున్నాం. అయితే ఆర్‌ఎంకే బకాయిలు చెల్లింపులపై గ్రామ సమాఖ్యలతో సమీక్షిస్తాం. కోర్టు నోటీసులు వచ్చిన వారికి న్యాయపరమైన సహాయం అందిస్తాం.. ఆర్‌ఎంకే రుణాలపై పారదర్శకంగా విచారణ జరుగుతుంది.

Updated Date - 2021-10-08T05:09:46+05:30 IST