Social Media లో ప్రకటన.. లోన్‌ ఇప్పిస్తానని.. లక్షలు దోచేశాడు!

ABN , First Publish Date - 2021-09-14T16:38:31+05:30 IST

ఓ ప్రైవేట్‌ సంస్థలో రూ. 20 లక్షల రుణం ఇప్పిస్తానంటూ..

Social Media లో ప్రకటన.. లోన్‌ ఇప్పిస్తానని.. లక్షలు దోచేశాడు!

హైదరాబాద్‌ సిటీ : ఓ ప్రైవేట్‌ సంస్థలో రూ. 20 లక్షల రుణం ఇప్పిస్తానంటూ రూ. 4 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌కు చెందిన అరిగె చిరంజీవి సోషల్‌మీడియాలో ఒక ప్రకటన చూశాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వ్యక్తిగత రుణాలు ఇస్తామని ఆ ప్రకటన లింక్‌ను ఓపెన్‌ చేశాడు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయగా, ఒకరు కాల్‌ చేసి, సంబంధిత పత్రాలను వాట్సాప్‌లో పంపాల్సిందిగా కోరాడు. చిరంజీవి ప్రతాలు పంపించాడు.


మరోసారి ఫోన్‌ చేసిన కేటుగాళ్లు రూ. 20 లక్షల రుణం మంజూరు చేస్తున్నట్లు నమ్మించి విడతల వారీగా రూ. 4 లక్షలపైనే వారు సూచించిన ఖాతాల్లో జమ చేశాడు. ఎంతకీ లోన్‌ డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో ఫోన్‌లు చేయగా.. స్విచ్చాఫ్‌ వచ్చాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో డీసీపీ యాదగిరి, ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి సాంకేతిక ఆధారాలు సేకరించారు. యూపీ నుంచి దందా జరిగిందని నిర్ధారణకు వచ్చి, యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన నిందితుడు వికాస్‌ దీక్షిత్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు కన్హాశర్మ పరారీలో ఉంది. 

Updated Date - 2021-09-14T16:38:31+05:30 IST