లోన్‌యాప్‌ జోలికెళ్లొద్దురో!

ABN , First Publish Date - 2022-08-10T06:47:49+05:30 IST

ఇన్‌స్టంట్‌ లోన్‌యాప్‌లు ప్రజలపాలిట యమపాశాలౌతున్నాయి.

లోన్‌యాప్‌ జోలికెళ్లొద్దురో!
మొబైల్‌ వచ్చిన ఓ ఇన్‌స్టెంట్‌ లోన్‌యాప్‌కు సంబంధించిన లింక్‌.

రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నది కొందరే 

36యాప్‌ల తొలగింపు... 12యా్‌పలపై కేసులు

350 అకౌంట్లు, రూ. 11 కోట్లు ఫ్రీజ్‌ 


తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 9: ఇన్‌స్టంట్‌ లోన్‌యాప్‌లు ప్రజలపాలిట యమపాశాలౌతున్నాయి. లోన్‌ తీసుకున్నవారి కష్టార్జితాన్నే కాకుండా... వారి పరువు మర్యాదలను హరించే స్థాయికి చేరుతున్నాయి.వీరిలో కొందరే పోలీసులను ఆశ్రయిస్తుండడంతో కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు.అలాంటి యా్‌పల ద్వారా లోన్లు తీసుకోవద్దని, అసలు ఇన్‌స్టంట్‌ లోన్‌యా్‌పలనే ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని సూచిస్తున్నారు. 


లోన్‌ చాలా సులభం


లోన్‌యా్‌ప ద్వారా అప్పు సులభంగా దొరుకుతుండడంతో జనం మొగ్గు చూపుతున్నారు.మొబైల్లో లోన్‌యా్‌ప డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయి అడిగిన డాక్యుమెంట్లు వాట్స్‌పలో పంపితేచాలు. నిమిషాల్లో రుణం మంజూరవుతుంది. ధనం బ్యాంక్‌ అకౌంట్‌కు చేరుతుంది. ఇంత సులభంగా లోన్‌ దొరుకుతుండఛింతో కొందరు మోసపోతున్నారు. తమ వలలో పడినవారిని పిండి పిప్పి చేసేందుకు ఇలాంటి లోన్‌ యాప్‌లు ప్లేస్టోర్‌లో వందలకొద్దీ కాచుక్కూర్చున్నాయి. కేవలం ప్లేస్టోర్‌లోనే కాకుండా యాప్‌లకు సంబంధించిన లింక్‌లను బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా ప్రజల మొబైళ్లకు పంపుతున్నారు. అలాగే వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో తక్కువ వడ్డీలకు ఇన్‌స్టంట్‌ లోన్స్‌ అంటూ విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 


అనేక రూపా మోసాలు


ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని లోన్‌కోసం రిక్వెస్ట్‌ వచ్చిందంటే ఇక యాప్‌ల నిర్వాహకులు  మోసాలకు తెరతీస్తారు. కొందరు లోన్‌ మొత్తంలో సగమే పంపుతారు. కానీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటారు. మరికొందరు లోన్‌ అమౌంట్‌ మొత్తాన్ని పంపించి చక్రవడ్డీలు వేస్తూ చెల్లించాలని బెదిరిస్తారు. ఇంకొందరు కంతులు కట్టించుకుని తమకు ఆ మొత్తం చేరలేదంటారు. బెదిరించి, భయపెట్టి మళ్లీ మళ్లీ కంతులు కట్టించుకుంటారు. కొందరు మన క్షేమం కోరేవారిలా, సాయం చేసేవారిలా మాట్లాడుతూ పలానా లోన్‌యా్‌పలో రుణం తీసుకుని తమకు చెల్లింపు చేయమంటారు. తమకు చేరని కంతు విషయాన్ని రెండురోజుల్లో పరిష్కరించి మీ అమౌంట్‌ మీకు పంపిస్తామంటూ ఇంకా ఊబిలోకి నెట్టేస్తారు.ఆదుకునే ఆపన్న హస్తంలా రుణాలు అందించి... పీకలమీద కత్తిపెట్టి వసూలు చేస్తారు. అదీ కాకుంటే వారి ఫొటోలను, కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌తో నగ్నంగా మార్చి తెలిసినవారికి పంపించి... డబ్బు కట్టలేదంటే ఆత్మహత్యే శరణ్యం అనుకునేలా వేధిస్తారు. 


యాప్‌తోనే మనడేటా పట్టేస్తారు: 


యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేయగానే మొట్టమొదట మన మొబైల్లోని డేటా మొత్తం వారి గుప్పిట్లోకి చేరిపోయేలా యాప్‌ను రూపొందించి ఉంటారు. ఫొటోలు, కాంటాక్ట్స్‌, కెమెరా, లొకేషన్‌ తదితరాలకు సంబంధించిన పర్మిషన్లను యాప్‌ ఇన్‌స్టాల్‌ సమయంలో అడుగుతుంది. మనం ఒక్కొక్కదానికి పర్మిషన్‌ ఇవ్వగానే ఆయా వివరాలు వారి సిస్టంలో నిక్షిప్తం అయిపోతాయి. ఏ ఒక్కదానికి మనం పర్మిషన్‌ ఇవ్వకపోయినా యాప్‌ పూర్తిస్థాయిలో పనిచేయదు. తప్పనిసరిగా అన్నింటికీ పర్మిషన్‌ ఇవ్వాల్సిందే. ఇలా మన మొబైల్‌ నుంచి తస్కరించిన కుటుంబ సభ్యుల ఫొటోలు, స్నేహితుల ఫోన్‌ నెంబర్లు, ఇతర విలువైన పత్రాలు, గోప్యంగా దాచివుంచిన వ్యక్తిగత వివరాలను అడ్డుపెట్టుకుని బెదిరించి దారికి తెచ్చుకుంటారు. 


12 లోన్‌ యాప్‌లపై కేసులు


లోన్‌యా్‌పల ద్వారా మోసపోయి వేధింపులకు గురవుతున్న వారు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక కొందరు తమ బాధను దాచుకుంటుంటే... మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఐతే తమ వివరాలు బయట పెట్టొదని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. దీంతో పోలీసులు కూడా ఆయా కేసుల వివరాలను గోప్యంగానే ఉంచుతున్నారు. గత 8 నెలల కాలంలో తిరుపతి జిల్లా పోలీసులు 12 లోన్‌ యాప్‌లపై కేసులు నమోదుచేశారు. తిరుపతిలోని సైబర్‌ వింగ్‌ వీటిపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో 36 నకిలీ లోన్‌యా్‌పలను ప్లేస్టోర్‌ నుంచి జిల్లా పోలీసులు తీసేయించారు. బాధితులు మొత్తం రూ. 15 లక్షల రూపాయలు నష్టపోగా...లోన్‌యా్‌పలకు సంబంధించి 350 బ్యాంక్‌ అకౌంట్లు, 11 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు.  


ఫిర్యాదు చేయాలంటే


బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే సంబంఽధిత పోలీసు స్టేషన్లను సంప్రదించవచ్చు. అలాగే తిరుపతిలోని ఎమ్మార్‌ పల్లె పోలీస్‌ పరేడ్‌ మైదానంలో వున్న సైబర్‌ క్రైమ్‌ ల్యాబ్‌లో అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్‌ సైబర్‌ క్రైమ్‌ కంప్లైంట్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 


ఓ విద్యార్థి చదువు ఖర్చుల నిమిత్తం 60 వేల రూపాయల కోసం లోన్‌యాప్‌ ద్వారా ప్రయత్నించాడు. నిమిషాల్లో రుణం మంజూరైంది. ఐతే 32 వేల రూపాయలు మాత్రమే అతని బ్యాంక్‌ అకౌంట్‌కు జమయింది. తరువాత రూ. 60 వేలు చెల్లించాలని వేధించడం ప్రారంభించారు. 


తిరుపతికి చెందిన ఓ మహిళ లోన్‌యాప్‌ ద్వారా కొంతమొత్తంలో లోన్‌ తీసుకుంది. ఐతే ఓ కంతు తిరిగి చెల్లించడం ఆలస్యమైంది. అంతే... ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, నగ్నంగా, అసభ్యకరంగా మార్చి ఆ ఫొటోలను ఆమెకు తెలిసినవారికే వాట్స్‌పద్వారా పంపించారు. 

పుంగనూరుకు చెందిన ఓ వ్యక్తి లోన్‌ యాప్‌ ద్వారా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఐతే సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో తిరుపతిలో ఉంటున్న ఆయన అన్న, వదిన పొటోలను అసభ్యకరంగా చిత్రీకరించి, ఆ ఫొటోలను వారికి తెలిసినవారికి పంపిస్తూ వేధించడం ప్రారంభించారు. చివరకు బాధితులు లోన్‌యాప్‌ ఆగడాలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు.

తిరుపతి మిలటరీ కాలనీకి చెందిన ఓ ఇంజనీర్‌ అసలు లోనే తీసుకోలేదు. కాని లోన్‌యాప్‌ నిర్వాహకులు ఆయనకు ఫోన్‌చేసి డబ్బు కట్టాలని వేధించడం ప్రారంభించారు. అలాగే ఆయన ఇరుగు పొరుగువారికి కూడా ఫోన్లుచేస్తూ ఇంజనీర్‌ గురించి అసభ్యంగా చెబుతుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 



తిరుచానూరుకు చెందిన ఎల్లయ్యకు రూ. 5వేలు  అవసరమైంది.వాళ్లను వీళ్లను అడిగి లేదనిపించుకున్నాక సులభంగా లోన్‌ మంజూరు చేస్తామంటూ మొబైల్‌కు వస్తున్న మెసేజ్‌లు గుర్తుకొచ్చాయి.ఓ సారి ప్రయత్నించి చూద్దామని ఓ మెసేజ్‌ను ఓపెన్‌చేసి అందులోని లింక్‌ను క్లిక్‌ చేశాడు. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌ ఓపెన్‌ అయింది. అందులో డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేశాడు... యాప్‌ డౌన్‌లోడ్‌ అయింది.సెక్యూరిటీ, కెమెరా, గ్యాలరీ తదితరాలకు సంబంధించిన అనుమతులు కోరడంతో అన్నింటిపై ఓకే బటన్‌ క్లిక్‌ చేస్తూ పోయాడు. చివరిగా యాప్‌ ఓపెన్‌ అయింది. మొబైల్‌తో రిజిస్ట్రేషన్‌ అడగడంతో తన మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేశారు.తరువాత స్ర్కీన్‌పై కనబడుతున్న వివరాలను బట్టి ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, కస్టమర్‌ ఐడీ వివరాలను నమోదు చేశారు. అప్పటికి యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. లోన్‌ ఆప్షన్‌లోకి వెళ్లి తనకు కావాల్సిన రూ. 5 వేలు నమోదు చేశారు.కొంతసేపటికి వెరిఫికేషన్‌ పూర్తయిందని, ఆయన సిబిల్‌ స్కోర్‌ ప్రకారం రూ. 3 వేలు మంజూరు చేస్తున్నట్టు వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది. మరికొన్ని క్షణాల్లో... డబ్బు అకౌంట్‌కు పంపినట్టు మెసేజ్‌ వచ్చింది. ఎల్లయ్య చెక్‌చేస్తే... 1800 రూపాయలు మాత్రమే బ్యాంక్‌ అకౌంట్‌కు జమయ్యాయి. దీంతో ఆయన ఆ విషయాన్ని యాప్‌ వాట్సప్‌కు మెసేజ్‌ చేశారు. ప్రాసెసింగ్‌ ఛార్జ్‌, డాక్యుమెంటేషన్‌ ఛార్జి మినహాయించుకుని డబ్బు పంపించినట్టు తిరుగు సమాఽధానం వచ్చింది.వారం రోజుల లోపల లోన్‌ అమౌంట్‌ తిరిగి చెల్లించాలని, లేదంటే అధిక వడ్డీ కట్టాల్సి వస్తుందని హెచ్చరిక వచ్చింది. చేసేదేమీలేక అవసరంలో దొరికినంత చాల్లే అనుకున్నాడు ఎల్లయ్య. ఐతే ఈ అనుభవంతో మిగతా అమౌంట్‌కోసం మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. షరా మామూలే.వారం తరువాత లోన్‌ సంస్థ ప్రతినిధుల టార్చర్‌ ప్రారంభమైంది. 

Updated Date - 2022-08-10T06:47:49+05:30 IST