Britain pm election: రిషి సునాక్‌కు నిరాశ తప్పదా..?

ABN , First Publish Date - 2022-07-30T23:59:33+05:30 IST

భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ఆ దేశ ప్రధాని అయ్యే అవకాశాలు పది శాతానికి పడిపోయాయని తాజా సర్వే ఒకటి తేల్చింది.

Britain pm election: రిషి సునాక్‌కు నిరాశ తప్పదా..?

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(Rishi sunak) ఆ దేశ ప్రధాని అయ్యే అవకాశాలు పది శాతానికి పడిపోయాయని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఆయన ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌.. బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు 90 శాతం ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు క్రమక్రమంగా లిజ్ ట్రస్‌వైపు మళ్లుతున్నారని పేర్కొంది. బెట్టింగ్ ఎక్సేంజ్ సంస్థ స్మార్కెట్స్ ఈ సర్వే నిర్వహించింది. 


బోరిస్ జాన్సన్.. ప్రధానిగా రాజీనామా చేసేందుకు నిర్ణయించాక అధికార పార్టీ సభ్యులు తమ తదుపరి నేతను ఎన్నుకునేందుకు కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత ఈ పోటీలో(Britain PM election) 11 మంది పాల్గొన్నారు. అయితే.. మొదటి నుంచి రిషి సునాక్, లిజ్ ట్రస్‌(Lizz Truss) ముందు వరుసలో నిలిచారు. ఇద్దరు అభ్యర్థులూ గత ఆరు వారాలుగా బ్రిటన్‌ అంతటా పర్యటిస్తూ 1,75,000 మంది పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ‘‘రేసులో కేవలం లిజ్ ట్రస్, రిషి సునాక్ మిగిలే సమయానికి.. ట్రస్ ప్రధాని అవుతారని 60 శాతం మంది భావించారు. అయితే..ఆమె విజయావకాశాలు క్రమక్రమంగా పెరుగుతూపోయాయి. రిషియే మెరుగైన ప్రచారకర్త అని తొలుత అందరూ భావించారు. కానీ.. టీవీ చర్చల్లో లిజ్ ట్రస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రిషిపై పైచేయి సాధించారు.’’ అని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న మాథ్యూ షాడిక్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..  ఈ పోటీలో తాను గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు రిషి సునాక్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అయితే.. ప్రతి ఒక్క ఓటు కోసం చివరి వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. 


బ్రిటన్ ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలనుంది. వచ్చే వారం నుంచి సభ్యులకు బ్యాలట్ పేపర్లు పంచనున్నారు. సెప్టెంబర్ 2 సాయంత్రం ఐదు లోపు వారు తమ అభ్యర్థి ఎవరో తెలియజేస్తూ బ్యాలట్ పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-07-30T23:59:33+05:30 IST