IPL 2022: బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్ ఊచకోత.. punjab Kings భారీ స్కోరు

ABN , First Publish Date - 2022-05-14T03:09:11+05:30 IST

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (punjab Kings) చెలరేగిపోయింది.

IPL 2022: బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్ ఊచకోత.. punjab Kings భారీ స్కోరు

ముంబై: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (punjab Kings) చెలరేగిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బౌలర్లను  బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ ఊచకోత కోశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి బంతి నుంచే బెయిర్‌స్టో చెలరేగిపోతుంటే పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత తప్పో అప్పటికి కానీ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌కు అర్థం కాలేదు. 


శిఖర్ ధవన్ (21), భానుక రాజపక్స (1) అవుటైన తర్వాత పరుగుల వేగం తగ్గుతుందని భావించారు. అయితే, బెయిర్‌స్టోకు లివింగ్ స్టోన్ జత కలిశాక స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇద్దరూ ఎడాపెడా బంతులను స్టాండ్స్‌లోకి తరలిస్తూ బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించారు. బెయిర్‌స్టో క్రీజులో ఉన్నంతసేపు చిచ్చరపిడుగుల్లే చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (19), జితేష్ శర్మ (9), హర్‌ప్రీత్ బ్రార్ (7), రిషి ధావన్ (7), రాహుల్ చాహర్ (2) వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరారు.


అయితే, క్రీజులో ఉన్న లివింగ్‌స్టోన్ బంతి పదును మాత్రం తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను కంగారెత్తించాడు. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. కాగా, పంజాబ్ చేసిన 209 పరుగులే ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

Read more