జీవన కళకు మార్గదర్శి

ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST

ఆనందంగా జీవించడం ఒక కళ. ఊహించని ఆపదలు వచ్చి మీద పడవచ్చు. కాలు కదపలేని దుర్భర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆ కళ తెలిస్తేనే..

జీవన కళకు మార్గదర్శి

ఆనందంగా జీవించడం ఒక కళ. ఊహించని ఆపదలు వచ్చి మీద పడవచ్చు. కాలు కదపలేని దుర్భర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆ కళ తెలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది. అలాంటి జీవితాన్ని కోరుకొనే వ్యక్తి ఇతరులను ప్రేమించాలి, వారి నుంచి తిరిగి ప్రేమను పొందాలి. దీన్ని సాధించాలంటే ‘‘జీవించే కళ మీద దృష్టి పెట్టే బదులు మనలో జీవం ఎక్కడి నుంచి ఉద్భవిస్తోందో, దాని మూలాలకు సారం ఎక్కడ నుంచి అందుతోందో అన్వేషించాలి’’ అంటారు ‘ఓషో’గా సుప్రసిద్ధులైన ఆచార్య రజనీశ్‌. ఆ అన్వేషణ క్రమంలో అంతరంగపు లోలోతుల్లోకి వెళితే జ్ఞానోదయపు దివ్యానుభూతి కలుగుతుంది. అదే ‘ఎరుక’ అనీ, అదే ‘జాగృతి’ అనీ ఆయన చెబుతారు. అలాంటి జాగృతిని ప్రజల్లో కలిగించడానికి ఆయన  ఎన్నో ప్రసంగాలు చేశారు.


ఉన్నత విద్యావంతుల నుంచి సామాన్యుల వరకూ ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పడం, మత, చారిత్రక గ్రంథాలలోని కథలను ఉదాహరణలుగా ప్రస్తావించడం ఓషో ప్రత్యేకత. జీవితంలోని మర్మాల గురించి ఆయన చేసిన ప్రసంగాల సంకలనం ‘లైఫ్స్‌ మిస్టరీస్‌’. దాన్ని ఇప్పుడు తెలుగులోకి భరత్‌ అనువాదం చేశారు. భరత్‌ ఓషో ప్రసంగాల అనువాదకునిగా ఇటీవల పాపులర్‌. జీవితం లక్ష్యం, అసలైన ప్రేమ, ప్రేమానుబంధాల తీరు తెన్నులూ, స్నేహాలు, వైవాహిక జీవితాలూ, ప్రశాంతతను సాధించే క్రమం, అహాన్ని వదిలించుకొనే మార్గం, స్వేచ్ఛ, నిబద్ధత, బాధ్యత... ఇలా పలు అంశాల మీద ఈ పుస్తకంలో ఓషో సాధికారికంగా చేసిన విశ్లేషణ, చూపిన మార్గదర్శకత్వం ఆకర్షిస్తాయి. వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఇష్టపడేవారినే కాదు... మామూలు చదువరులను సైతం ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేస్తాయి. భరత్‌ చేసిన చక్కని అనువాదం కూడా దీనికి దోహదం చేస్తుంది. 




అందమైన జీవితం

- అందుబాటులోనే ఉంది

ఓషో నవజీవన మార్గదర్శకాలు

అనువాదం: భరత్‌, ప్రచురణ: ధ్యానజ్యోతి పబ్లికేషన్స్‌

పేజీలు: 272, వెల: 270

ప్రతులకు: నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ (9490099063)

మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST