Abn logo
Sep 23 2021 @ 03:06AM

బడుగులపై ధరల పిడుగు

  • కరోనా కాటుతో మరింత దయనీయం
  • ఇసుక కొరత, స్టీల్‌, సిమెంట్‌ ధరల మోతతో ఆగిన భవన నిర్మాణాలు
  • కార్మికులు కుదేలు.. పనులు లేక ఎలక్ట్రీషియన్లూ విలవిల
  • అసంఘటిత కార్మికులందరిదీ ఇదే పరిస్థితి
  • కొడిగట్టిన కార్మికుల సంక్షేమం..
  • బోర్డు ద్వారా అమలు కాని పథకాలు


రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. పని లేకపోతే పూట గడవని బడుగు జీవులు. కాయకష్టం, చేతివృత్తులతో బతుకుతున్న వారు ఊహించని కష్టంతో కుదేలయ్యారు. కరోనా కాటు, ధరల మోతతో జీవితాలు దుర్భరంగా మారాయి. స్వయం ఉపాధి కోల్పోయి.. ఆదాయం లేక.. సరుకులు కొనలేక అష్టకష్టాలు పడ్డారు. అప్పు చేస్తే కానీ కుటుంబం నడవని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, సెలూన్‌ నిర్వాహకులు తదితరుల పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

కార్మికులు, చేతివృత్తిదారుల జీవన పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. కరోనా కల్లోలం, ధరల దరువుతో వారి జీవితాలు దుర్భరమయ్యాయి. దీనికితోడు వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలు మరిన్ని కష్టా లు తెచ్చిపడింది. ప్రభుత్వం వచ్చీ రాగానే ఇసుక దొరకకుండా కృత్రిమ కొరత సృష్టించింది. ఏడాది పాటు కనీసం కుటుంబ అవసరాలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు సిమెంట్‌, స్టీల్‌ ధరలు పెరగడంతో నిర్మాణాలు కష్టతరమయ్యాయి. పట్టణాలు, నగరాల్లో భవనాలు నిర్మించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారు. రూ.5కు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎత్తేయడంతో భోజ నం ఖర్చు భారమైంది. పనులు లేక ఆర్థిక సమస్యలతో పలువురు కార్మికు లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. నిర్మాణాలు జరిగితేనే ఎలక్ట్రీషియన్లకు పనులుంటాయి. గత రెండేళ్లుగా పనులు లేకపోవడంతో వారి పరిస్థితీ దయనీయంగా మారింది. ఇక ఎప్పుడూ కిటకిటలాగే సెలూన్లు కరోనా సమయంలో వెలవెలబోయాయి. సెలూన్లకు వెళ్తే కరోనా వస్తుందన్న భయంతో జనం అటు వైపు వెళ్లలేదు. దీంతో సెలూన్ల నిర్వాహకుల జీవితాలు దుర్భరంగా మారాయి.


ఇక వాహనదారులు నెలల తరబడి బండ్లు బయటకు తీయకపోవడంతో మెకానిక్‌లకు పనుల్లేకుండా పోయా యి. కొవిడ్‌ నిబంధనల కారణంగా శుభకార్యాలు కూడా తూతూ మంత్రంగానే సాగాయి. దీంతో పురోహితులకు డిమాండ్‌ తగ్గింది. నవరత్నాల మాటున రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కొడిగట్టింది.  భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేసిన 1 శాతం సెస్‌ నిధుల నూ ఇతర అవసరాలకు మళ్లించిందని వాపోతున్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కూడా ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడుకుందున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర  ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద కరోనా లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం రూ.198 కోట్ల నిధులను ఖర్చు చేసుకోవాలని అనుమతించింది. అయితే ఆ నిధుల్లో ఒక్కపైసా కూడా కార్మికులకు చెల్లించలేదు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 33 రకాల నిర్మాణ పనులకు చెందిన కార్మికులు 20 లక్షల మందికి పైగా నమోదయి ఉన్నారు. వారందరికీ బోర్డు ద్వారా అమలు కావాల్సిన ఏ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక కింద బోర్డు రూ.20 వేలు అందిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది.  

అప్పుల భారం మోయలేనని కాలికి ఆపరేషన్‌ వద్దనుకున్నా

నేను టీవీ, ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌ను. మేం ఐదుగురు కుటుంబ సభ్యులం. ఇద్దరు పిల్లలు ఐదు, మూడో తరగతి చదువుతున్నారు. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. రెండున్నరేళ్లకు ముందు నెలకు రూ.20 వేలు ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఏడెనిమిది వేలకు మించడం లేదు. ఖర్చులు మాత్రం బాగా పెరిగాయి. అప్పట్లో మెయిన్‌రోడ్డుపై షాపు ఉండేది. అద్దె రూ.2 వేలు. ఇప్పుడు 4 వేలకు పెరగడంతో షాపు ఖాళీ చేసి లోపలికి రెండు వేల అద్దెకు తీసుకున్నా. ఇంటిదీ అదే పరిస్థితి. 2018లో రెండు వేల అద్దెకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు సింగిల్‌ బెడ్రూమ్‌ ఇంటికి మారాం. అద్దె మూడు వేలకు చేరింది. గతంలో షాపు కరెంటు బిల్లు రూ.150 వస్తే..  ఇప్పుడు రూ.200 వస్తోంది. ఇంటికి రూ.300 నుంచి రూ.500కు పెరిగింది. వంట గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెరిగాయి.   ఎంత పొదుపుగా ఖర్చు చేసినా ఇంటి అద్దె, ఆయిల్‌కే ఆదాయం సరిపోతోంది. తినడానికి అప్పులు చేస్తున్నాం. నాకు ఒక కాలు సరిగా పనిచేయదు. ఆపరేషన్‌ చేయించుకోవాలి. దానికి లక్షన్నర అవుతుంది. అప్పుల భారం మోయలేనని అది కూడా వద్దనుకున్నా. 

ఉండ్రాజవరపు సిద్ధూ, టీవీ, ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌, ఏలూరు

ధరలు మా పాలిట శాపం 

నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల క్రితం రోజుకు నాలుగు నుంచి ఐదొందలు సంపాదించేవాడిని. ఇంటి ఖర్చుకు నెలకు పది వేలు సరిపోయేది. ప్రస్తుతం రోజూ రూ.800 వస్తోంది. ఇప్పుడు గ్యాస్‌, పాలు, పెట్రోలు, కరెంటు... ఇలా అన్ని ధరలూ పెరిగి పోయాయి. దాంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. కరెంటు బిల్లు, ఇంటి అద్దె సగానికి సగం పెరిగిపోయాయి. పిల్లల చదువులు, పుస్తకాల ఖర్చు లూ అధికమయ్యాయి. పెరిగిన ధరలు మా పాలిట శాపంగా మారాయి. మా బతుకులు దుర్భరంగా మారాయి. 

దాసరి సత్యనారాయణ, మెకానిక్‌, మండపేట, తూర్పుగోదావరి జిల్లా

బతకులు దయనీయం

రెండు దశాబ్దాలుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. ప్రస్తుతం వారానికి రెండు, మూడు రోజులు కూడా పని దొరకడం లేదు. దొరికినా రోజుకు రూ.400 కూడా రావడం లేదు. పని దొరకకపోవడం, మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. రోజురోజుకూ కిరాణా ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన రెండేళ్లలో లక్ష రూపాయలకు పైగా వడ్డీలకు అప్పులు చేశా. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. భవన నిర్మాణ కార్మికులకు అందడం లేదు. 

బుంగ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పలాసపురం, సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా

సెలూన్‌లకు రావడం లేదు

విజయనగరంలో సెలూన్‌ షాప్‌ నిర్వహిస్తున్నా. కరోనా వచ్చాక సెలూన్‌లకు తక్కువ సంఖ్యలో జనం వస్తున్నారు. నిర్వహణ భారమైంది. ఆర్థిక ఇబ్బందులతో నాయీ బ్రాహ్మణుడు కింతాడ కొండబాబు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబం రోడ్డున పడింది. జగనన్న చేదోడు కింద ఏటా ఇస్తారనుకున్న రూ.10 వేల ఊసేలేదు. సెలూన్‌, ఇస్త్రీ, తదితర కులవృత్తులకు సంబంధించిన షాపులకు 150 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటు ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ఇవ్వలేదు. మాలాంటి చిన్న దుకాణాలను కమర్షియల్‌గా చూడొద్దని  15 ఏళ్ల కిందట జీవో 95 విడుదల చేశారు. దానిని అమలు చేయాలని కోరుతున్నాం. గతంతో పోలిస్తే ఈ మూడేళ్లలో సామాన్యుడు భరించలేనంతగా ధరలు పెరిగాయి. గతంలో నిత్యవసర వస్తువులు, గ్యాస్‌, పెట్రోల్‌, కూరగాయాలు, బియ్యం, నూనె, పప్పులు ఉప్పులు కొనుగోలు చేయాలంటే నెలకు రూ.3 వేల నుంచి 4 వేల వరకు సరిపోయేవి. ఇప్పుడు సుమారు 8 వేల నుంచి 10 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. 

దుర్గారావు, సెలూన్‌ షాపు నిర్వాహకుడు, విజయనగరం

ప్రతినెలా అప్పు చేయాల్సి వస్తోంది

ఓ హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. రెండేళ్ల కిందట  నెలకు రూ.9 వేలు జీతం ఇచ్చేవారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికితోడు గడిచిన రెండేళ్లలో గ్యాస్‌, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఇంటి అద్దెకు నెలకు రూ.2 వేలు ఉంటే, ఇప్పుడు అదనంగా మరో వెయ్యి కట్టాల్సి వస్తోంది. దీంతో నెలనెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతం పెరకపోగా ప్రతినెలా రూ.5 వేలు వరకు అప్పులు చేసి కుటుంబ పోషణ చేయాల్సి వస్తోంది.


సావుకారి మోహన్‌రావు, హోటల్‌లో కార్మికుడు, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా

పని కోసం ఎదురు చూస్తున్నాం

నేను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నా. మాది రాజంపేట. భార్య, ఇద్దరు పిల్లలు నాపై ఆధారపడ్డారు. పిల్ల లు చదువుతున్నారు. మూడేళ్ల క్రితం కువైట్‌కు పోయివచ్చినోళ్లు ఇక్కడ ఎక్కువగా ఇళ్లు కట్టించేవారు. ఇసుక సమస్య లేదు. సిమెంట్‌, స్టీల్‌ ధరలు కూడా అందుబాటులో ఉండేవి. చేతినిండా పని ఉండేది. నాతో పాటు మరో నలుగురికి ఉపాధి చూపించేవాడిని. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇసుక సమస్య, ధరల పెంపు కారణంగా భవన నిర్మాణాలు పూర్తిగా తగ్గిపోయాయి. వారంలో మూడు నాలుగు రోజులైనా పని ఉండదు. నెలకు రూ.10-15 వేలకు మించి రావడం లేదు. ఏ వస్తువు కొందామన్నా ధరలు భగ్గమంటున్నార ుు. నాడు నెలకు రూ.20 వేలకు పైగా సంపాదించేవాడిని. పైగా ధరలు కూడా తక్కువే. ఏ ఇబ్బంది లేకుండా జీవించేవాళ్లం.


ఓదేటి నాగరాజు, ఎలక్ట్రీషియన్‌, రాజంపేట, కడప జిల్లా 

ఇసుక కొరత కొంప ముంచింది

గతంలో భవన నిర్మాణ పనులు పుష్కలంగా ఉండేవి. దీనివల్ల తాపీ  మేస్త్రీలకు, కార్మికులకు డిమాండ్‌ ఉండేది. డబ్బులు బాగా వచ్చేవి. మొత్తం పనిని ఒప్పుకొని చేయడం వల్ల రోజువారీ ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితి ఉండేది. గత మూడేళ్లుగా ఇసుక బంగారం అయింది. మార్కెట్లో లభ్యం కావడం లేదు. మా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో చంపావతి నది ఉంది. నది సమీపంలోనే ఉన్నా ఇసుక దొరకడం లేదు. భవన నిర్మాణాలు చేపడుతున్న వారు నాటు బండి ఇసుక రూ.12 నుంచి 15 వందలకు కొనుగోలు చేస్తున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి ఎపుడూ చూడలేదు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ పనులు తగ్గాయి. జగనన్న కాలనీలకు సైతం ఇసుక లేదు. దీంతో పనులు భారీగా తగ్గాయి. ఒక్కోరోజు పనులు లేక తిరిగి ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. సిమెంట్‌ బస్తా 2018 ప్రాంతంలో రూ.280 ఉండేది. ఇప్పుడు రూ.360కి చేరింది. టన్ను ఐరన్‌ రూ.38 వేలు నుంచి రూ.60వేలకు చేరుకుంది. ఫ్లంబింగ్‌, శానిటరీ, హార్డ్‌వేర్‌, విద్యుత్‌ ముడిసరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2018 ఏడాదితో పోల్చితే వీటి ధరలు రెండింతలు పెరిగాయి. ధరల పెరుగుదలతో ఈ రంగంలోని కార్మికులు రోడ్డున పడుతున్నారు. 

కిలాన పైడినాయుడు, భవన నిర్మాణ కార్మికుడు, తాడివాడ గ్రామం, విజయనగరం

ఆదాయం పెరగలేదు.. ఖర్చు రెట్టింపు 

కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో పురోహితుడిగా పనిచేస్తున్నాను.   2018 ప్రాం తంలో నెలకు కనీసం రూ.15 ,000 వరకు సంపాదించేవాడి ని. అన్ని ఖర్చులు పోనూ నెల కు రూ.2000 మేర  మిగులు కన్పించేది. గడిచిన మూడేళ్లలో ఆదాయం ఏమీ పెరగలేదు. పెట్రోలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పెట్రోలు ఇప్పుడు రూ.107కు పెరిగింది. నెలకు ఇక్కడే వెయ్యి రూపాయలకు పైగా భారం పెరిగింది. నా ఆదాయం మూడేళ్ల క్రితం, ఇప్పుడూ రూ.15 వేలే ఉంది. కానీ ఖర్చు మాత్రం రెట్టింపు అయింది. నెలకు రూ.20 వేలు పైచిలుకు ఖర్చు అవుతోంది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే అప్పు చేసి మరీ నా భార్యతో చిన్న వ్యాపారాన్ని పెట్టించాను. ప్రతి నెలా రూ.2 వేలు వరకు మిగులు ఉంటోంది.

పరాంకుశం రవి కుమార్‌, పురోహితుడు, అవనిగడ్డ, కృష్ణా జిల్లా

ఇల్లు గడవడం కూడా కష్టం 

16 సంవత్సరాల నుంచి క్యాటరింగ్‌ నిర్వహిస్తున్నాం. 2018 నాటికి, ఇప్పటికి ఖర్చుల్లో చాలా మార్పు వచ్చింది. గ్యాస్‌, సరుకులు, కరెంటు చార్జీలు, వంట నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కస్టమర్ల దగ్గర రేట్లు పెంచే పరిస్థితి లేదు. దానికి తోడు కరోనాతో వేడుకలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి కానీ.. ఆదాయం తగ్గిపోయింది.  ఇంటి ఖర్చులు రూ.6 వేలు దాకా పెరిగాయి. సంవత్సరానికి రూ.72 వేలు  భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇల్లు గడవటం కూడా కష్టం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఒక్క అమ్మఒడి పథకం 14 వేలు మాత్రమే అందుతుంది. 

పవన్‌ కుమార్‌, లక్ష్మీ, క్యాటరింగ్‌, తాడికొండ, గుంటూరు జిల్లా


ఆంధ్రప్రదేశ్ మరిన్ని...