Abn logo
Oct 20 2020 @ 11:36AM

లివర్‌ ఆరోగ్యంలో శస్త్రచికిత్సల పాత్ర

ఆంధ్రజ్యోతి(20-10-20)

మానవ శరీరంలో లివర్‌ ముఖ్యమైన అవయవం.  ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు విసర్జక పదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏకకాలంలో అనేక పనులు చేసే ఈ అవయవంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. వీటిలో చాలావాటిని మందులతో పరిష్కరించవచ్చు. కొన్ని సమస్యలకు మాత్రం సర్జికల్‌ పరిష్కారాలు అవసరం అవుతుంటాయి. వీటిలో ప్రధానమైనవి మూడు. 1. లివర్‌ సిస్టులు, 2. గాల్‌బ్లాడర్‌ లేదా బైల్‌ డక్ట్‌ స్టోన్‌లు, 3. లివర్‌ క్యాన్సర్‌.


1) లివర్‌ సిస్టులు: లివర్‌ లోపల పుట్టుకతోటే కొందరికి ఈ సిస్టులు వస్తాయి. కొందరికి తరువాత రావచ్చును. ఇవి చిన్నవిగా ఉండి 1, 2 ఉంటాయి. కొన్నిసార్లు అనేక నీటి బుగ్గలు ఉంటాయి. ఇవి లివర్‌ మొత్తం వ్యాపించినట్లయితే అడల్ట్‌ పాలీసిస్టిక్‌ లివర్‌ డిసీజెస్‌ అని పిలుస్తారు. జన్యులోపాలు, కొన్నిసార్లు పరాన్న జీవుల ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడతాయి. చీము గడ్డలు, కొన్ని రకాల లివర్‌ క్యాన్సర్‌లు కూడా సిస్టులు మాదిరిగా కనిపిస్తాయి. లివర్‌లో సిస్టులు సాధారణంగా 5 సెంటీమీటర్ల లోపు, పెద్దవిగా కూడా ఏర్పడవచ్చు. ఇవి ఏర్పడినప్పుడు కడుపులో కడివైపున నొప్పి వస్తుంది. కొన్నిసార్లు నొప్పితో పాటు జ్వరం వస్తుంటుంది. ప్రాథమిక స్థాయిలో ఈ సిస్టులను ఆలా్ట్రసౌండ్‌ పరీక్షలతో గుర్తించవచ్చు. సిటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయిస్తే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. లివర్‌ సిస్టుల సైజు, విస్తరణను గమనించి చికిత్స చేయాలి. చాలావరకు లాప్రోస్కోపిక్‌ విధానాలతో చికిత్స చేయడానికి వీలవుతుంది.


2) గాల్‌ బ్లాడర్‌ లేదా బైల్‌ డక్టుల్లో స్టోన్‌లు: లివర్‌ నుంచి విడుదలయ్యే జ్యూస్‌ బైల్‌ గొట్టాల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో బైల్‌ గొట్టాలు, గాల్‌ బ్లాడర్‌లలో స్టోన్స్‌ ఏర్పడుతుంటాయి. చాలాసార్లు ఇన్‌ఫెక్షన్‌ ఇందుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం, అధికబరువుతో పాటు కొన్ని హెల్మింథియల్‌ ఇన్‌ఫెక్షన్‌లు కారణం కావచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చిన వాపుతో వస్తుంటాయి. కడుపులో స్టోన్స్‌ను   కుడివైపు నొప్పి, చలి జ్వరాలు వంటివి ప్రాథమిక లక్షణాలతో గుర్తించవచ్చు. ఈ సమస్యను ప్రాథమిక రక్తపరీక్ష (ఎల్‌టీఎఫ్‌), ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌లతో నిర్ధారణ చేయవచ్చు. అవసరాన్ని బట్టి ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ చేయవచ్చు.


ఆధునిక టెక్నాలజీ చికిత్సలు: బైల్‌ డక్ట్‌లు, గాల్‌ బ్లాడర్‌లలో సమస్యలను గుర్తించేందుకు ఎండోస్కోపిక్‌ ఆలా్ట్రసౌండ్‌ ఉపయోగపడుతోంది. గాల్‌ బ్లాడర్‌లో స్టోన్స్‌ను లాప్రోస్కోపిక్‌ చేసి తొలగించవచ్చు. బైల్‌ గొట్టాలలోని స్టోన్స్‌ను ఎండోస్కోపీతో పరిష్కరించవచ్చు. లిథోట్రిప్సీ, ఈ ఆర్‌సీపీ పద్ధతులతో స్టోన్స్‌ను పూర్తిగా తొలగించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో హెపాటికో జెజునెస్టమీ ఆపరేషన్‌ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.


3) లివర్‌ క్యాన్సర్‌: లివర్‌లో ఏర్పడే కణితులు క్యాన్సర్‌ కణితులు కాకపోవచ్చు. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను హెపటో సెల్యులార్‌ క్యాన్సర్‌ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్‌ తీసుకొనే వారిలో వస్తుంది. హెపటైటిస్‌ బీ, హెపటైటిస్‌ సీ ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడవచ్చు. చిన్న పిల్లల్లో (3 - 7 సంవత్సరాల వయస్సు పిల్లలు) కనిపిస్తుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. కొన్ని సందర్భాలలో లివర్‌లోనే క్యాన్సర్‌ ఏర్పడవచ్చు. లేదా జీర్ణ వ్యవస్థలోని ఇతర భాగాల్లో లేదా ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్‌ కాలేయంలోకి పాకవచ్చు. 


ఆధునిక పరిష్కారాలు: కడుపు పైభాగంలో నొప్పితో పాటు బరువు తగ్గటం, పసరికలు, రక్తవిరేచనాలు వంటి లక్షణాలు కూడా నిపిస్తుంటాయి. ప్రాథమిక దశలో గుర్తించకపోతే ఇబ్బంది అధికం అవుతుంది. ప్రాథమికంగా రక్తపరీక్ష (ఎల్‌టీఎఫ్‌), ఆలా్ట్రసౌండ్‌ పరీక్షలతో గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సిటీస్కాన్‌, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే హెపటెక్టమీ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేయలేని పరిస్థితుల్లో  ప్రత్యేక విధానాలు అయిన టేస్‌, అబ్లేషన్‌ విధానాలు అవలంబించాల్సి ఉంటుంది. అంటే శాస్త్రీయమైన ఈ విధానాలతో క్యాన్సర్‌ కణజాలాన్ని కరిగించడం. వీటిలో మైక్రోవేవ్‌ అబ్లేషన్‌ చాలా మెరుగైన చికిత్స విధానం అనుకోవచ్చు.


జాగ్రత్తలు: అనేక రకాల లివర్‌ సమస్యలను క్రమబద్ధమైన జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో నివారించవచ్చు. మద్యపానానికి దూరంగా ఉండటం, హెపటైటిస్‌ వ్యాక్సీన్‌లు తీసుకోవడం ద్వారా లివర్‌ వ్యాధులను నివారించుకోవచ్చు.


డాక్టర్‌ ఆర్‌.వి.రాఘవేంద్రరావు 

M.S, M.Ch, (SGPGI), F.H.P.B.,F.L.T, (SNUH)

రెనోవా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌, 

న్యూ ఎమ్‌ ఎల్‌ ఏ కాలనీ, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 7993089995, ఈ-మెయిల్‌: [email protected]

Advertisement
Advertisement
Advertisement