కన్నా.. నేనున్నా!

ABN , First Publish Date - 2021-06-20T09:47:33+05:30 IST

తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పదినెలల శిశువు తల్లిదండ్రులకు ఇప్పుడు గొప్ప ఊరట! ఆర్థికపరమైన అడ్డంకులన్నీ తొలగి శస్త్రచికిత్స జరిగి తమ బిడ్డ కోలుకుంటుందని వారిలో ఓ నమ్మకం! ఈ భరోసాను వారిలో కలిగించింది మంత్రి కేటీఆర్‌.

కన్నా.. నేనున్నా!

  • పది నెలల శిశువుకు కాలేయ సమస్య
  • ట్విటర్‌ విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్‌ 
  • నిమ్స్‌లో ఆపరేషన్‌కు భరోసా
  • ఆదుకోవాలని తల్లిదండ్రుల వినతి


చౌటుప్పల్‌ టౌన్‌, జూన్‌ 19: తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పదినెలల శిశువు తల్లిదండ్రులకు ఇప్పుడు గొప్ప ఊరట! ఆర్థికపరమైన అడ్డంకులన్నీ తొలగి శస్త్రచికిత్స జరిగి తమ బిడ్డ కోలుకుంటుందని వారిలో ఓ నమ్మకం! ఈ భరోసాను వారిలో కలిగించింది మంత్రి కేటీఆర్‌. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లింగోజిగూడకు చెందిన ఎర్రంబెల్లి శ్రీశైలం, ప్రవళిక దంపతుల కూతురు శ్రీణిక (10నెలలు). మూడు నెలల వయసు నుంచే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 


అప్పటి నుంచి లక్షల్లో అప్పు చేసి పాపకు చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం పాపకు నిలోఫర్‌లో చికిత్స చేయిస్తున్నారు. అయితే శిశువుకు ఏఐజీ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేయించాల్సి ఉంటుందని, అందుకు రూ.20లక్షలకు పైగా ఖర్చవుతుందని తల్లిదండ్రులకు నిలోఫర్‌ వైద్యులు తెలిపారు. ఇప్పటికే పాపకు వైద్య చికిత్స కోసం ఎంతో ఖర్చు చేసిన  తల్లిదండ్రులకు ఇది మోయలేని భారంగా మారింది. పాప అనారోగ్య సమస్యను శ్రీశైలం మిత్రుడు నవీన్‌రెడ్డి  ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్‌, నిమ్స్‌లో పాపకు కాలేయ మార్పిడి చేయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కాగా పాప చికిత్స కోసం ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, వివరాలకు సెల్‌ నంబర్‌ 9951318265లో సంప్రదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-06-20T09:47:33+05:30 IST