భార్య సజీవ దహనం.. భర్త, పిల్లలకు స్వల్ప గాయాలు.. పలు అనుమానాలు!

ABN , First Publish Date - 2021-05-25T18:00:14+05:30 IST

ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు...

భార్య సజీవ దహనం.. భర్త, పిల్లలకు స్వల్ప గాయాలు.. పలు అనుమానాలు!

  • ఎఫ్‌సీఐ కాలనీలో అగ్ని ప్రమాదం
  • భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు
  • సంఘటనపై పలు అనుమానాలు

హైదరాబాద్/వనస్థలిపురం : ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆహుతయ్యారు. ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర సరస్వతి (42), చల్లం బాలకృష్ణ దంపతులు వనస్థలిపురం, ఎఫ్‌సీఐ కాలనీ ఫేజ్‌-1లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సరస్వతి ఎల్బీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. కుమారుడు వెంకటరమణ శంషాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తుండగా, కూతురు అక్సిత ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. సోమవారం ఉదయం 8.30 నిమిషాలకు వీరి ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేసి బాలకృష్ణను, పిల్లలను బయటికి తరలించారు. సరస్వతి మంటల్లో కాలిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.


గ్యాస్‌ సిలిండర్‌ అనుకున్నారు...

అగ్ని ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దం సంభవించటంతో స్థానికులంతా గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఇంటిని మంటలు చుట్టు ముట్టినట్లు భావించారు. కానీ లోనికి ప్రవేశించిన పోలీసులకు అలాంటి ఆధారాలు కన్పించలేదు. గ్యాస్‌ సిలిండర్‌ బాగానే ఉంది. దీంతో పోలీసులు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉండవచ్చని భావించారు. మొదట బెడ్రూమ్‌లోంచి మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అక్కడి నుంచి బయటికి వ్యాపించటం మూలంగా అందులోంచి బాలకృష్ణ బయటికి పరుగులు తీయగా, అక్కడే ఉన్న సరస్వతి మంటలకు ఆహుతైనట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగ మంటల ధాటికి హాల్‌ పూర్తిగా బుగ్గిపాలైంది. అక్కడి నుంచి కిచెన్‌లోకి మంటలు వ్యాపించాయి. ఫర్నిచర్‌, విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి.


తప్పించుకునేందుకు వీలున్నా..?

ఉదయాన్నే జరిగిన అగ్ని ప్రమాదం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్‌ బెడ్రూమ్‌ ఇంట్లో ఓ బెడ్రూమ్‌లో దంపతులు ఉండగా, మరో బెడ్రూమ్‌లో కూమారుడు, కూతురున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా భార్యాభర్తలున్న బెడ్రూమ్‌లోంచి మంటలు వ్యాపించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలకృష్ణ, వారి పిల్లలను వనస్థలిపురం కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, పోలీసులు సురక్షితంగా బయటికి తరలించారు. భర్త బెడ్రూమ్‌లో ఉండగానే మంటలు వ్యాపించి ఉంటే అతడు సరస్వతిని ఎందుకు రక్షించుకోలేక పోయారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భార్యను వదిలి పిల్లలున్న గదిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సురక్షితంగా బయటికి వెళ్లేందుకు వీలున్నా ప్రధాన ద్వారం మీదుగా ఎందుకు బయటికి వెళ్లలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే సరస్వతి 70 శాతం కాలి మృతి చెందారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఉంటుందని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయాలపాలైన బాలకృష్ణను మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగిసున్నారు. సంఘటనపై పిల్లలు కూడా నోరువిప్పడం లేదు. 



Updated Date - 2021-05-25T18:00:14+05:30 IST