మహారాజు కల!

ABN , First Publish Date - 2021-06-27T05:20:55+05:30 IST

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు ఒక కల వచ్చింది. ఆ కలలో గాలిలో తేలియాడుతున్న ఒక అందమైన ప్యాలెస్‌ కనిపించింది. బంగారు తాపడం, విలువైన రత్నాలు, సకల సదుపాయాలతో ఆ ప్యాలెస్‌ అత్యంత సుందరంగా ఉంది. నిద్ర

మహారాజు కల!

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు ఒక కల వచ్చింది. ఆ కలలో గాలిలో తేలియాడుతున్న ఒక అందమైన ప్యాలెస్‌ కనిపించింది. బంగారు తాపడం, విలువైన రత్నాలు, సకల సదుపాయాలతో ఆ ప్యాలెస్‌ అత్యంత సుందరంగా ఉంది. నిద్ర లేచిన మహారాజుకు ఆ కలే గుర్తుకురాసాగింది. ఆ కల గురించి సభికులతో చర్చించాడు. అందరూ కూడా అద్భుతమైన కల అంటూ పొగిడారు. ‘‘అలాంటి ప్యాలెస్‌ను నిర్మించిన వారికి వెయ్యి బంగారు నాణేలు బహుమానంగా ఇస్తాను’’ అని ప్రకటించారు మహారాజు. దాంతో సభలో ఒక్కసారిగా నిశబ్దం ఆవరించింది. అలాంటి ప్యాలెస్‌ను నిర్మించడం అసాధ్యం. కానీ ఆ విషయం మహారాజుకు చెప్పే ధైర్యం లేక అందరూ మిన్నకుండిపోయారు. విషయాన్ని తెనాలి రామకృష్ణతో చెప్పి సహాయం చేయమని కోరారు. అంతా విన్న రామకృష్ణ విషయం తనకు వదిలేయమని అన్నాడు. మరుసటి రోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా ఒక ముసలి వ్యక్తి సభలోకి ఏడుస్తూ వచ్చాడు. అతణ్ణి చూసిన మహారాజు ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. 



అప్పుడా వ్యక్తి ‘‘నా విలువైన ఆస్తి మొత్తం దోచుకెళ్లిపోయారు’’ అన్నాడు. దొంగతనం చేసింది ఎవరో చెప్పు? నీకు న్యాయం చేస్తాను అన్నాడు మహారాజు. అతని పేరు చెబుతాను, కానీ మీరు న్యాయం చేస్తానని మాట ఇవ్వండి అన్నాడు ముసలి వ్యక్తి. సరే! అని మాట ఇచ్చాడు మహారాజు. అప్పుడా వ్యక్తి దొంగతనం చేసింది మీరే మహారాజా! అన్నాడు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు కోపంతో ‘‘మతి ఉండే మాట్లాడుతున్నావా? నీ ఇంట్లో నేను దొంగతనం చేయడమేంటి?’’ అన్నాడు. దాంతో ఆ ముసలి వ్యక్తి మహారాజా! ‘‘రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో మీరు, మీ సైనికులతో కలిసి  మా ఇంటిపైకొచ్చి నేను దాచుకున్నదంతా దోచుకెళ్లారు’’ అన్నాడు. అప్పుడు మహారాజు కలలో వచ్చింది నిజమెలా అవుతుంది? అన్నాడు. ‘‘కానీ మహారాజా! గాలిలో తేలియాడే ప్యాలెస్‌ నిజమవుతున్నప్పుడు, నా కల ఎందుకు నిజం కాదు?’’ అని ప్రశ్నించాడు. ఆ మాటలతో సభ మొత్తం నిశబ్దంగా మారింది. ఆ ముసలివ్యక్తి ఎవరో కాదు. తెనాలి రామకృష్ణ. వెంటనే తన మారువేషాన్ని తొలగించి, ‘‘క్షమించండి మహారాజా! మీ కల వాస్తవానికి దూరంగా ఉంది. ఆ విషయాన్ని మీకు చెప్పి ఒప్పించడానికే ఈ పని చేశాను’’ అని అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 

Updated Date - 2021-06-27T05:20:55+05:30 IST