‘లాల్‌ - నీల్‌’ మధ్య నలిగిన సాహిత్య విమర్శ

ABN , First Publish Date - 2021-10-11T06:49:00+05:30 IST

కవిత్వాన్ని ఒక పాఠకుడు అనుభవించే క్రమాన్నీ, కవిత్వం కవిత్వమెలా అవుతుందనే బౌద్ధికతతో విమర్శకుడు దాని పొరలు విప్పే ప్రయత్నాన్నీ- గుంటూరు లక్ష్మీనరసయ్య ‘కవిత్వం చర్చనీయాంశాలు’ పుస్తకం వల్ల మరొక్కమారు దగ్గరగా చూసే వీలు కలుగు తుంది...

‘లాల్‌ - నీల్‌’ మధ్య నలిగిన సాహిత్య విమర్శ

కవిత్వాన్ని ఒక పాఠకుడు అనుభవించే క్రమాన్నీ, కవిత్వం కవిత్వమెలా అవుతుందనే బౌద్ధికతతో విమర్శకుడు దాని పొరలు విప్పే ప్రయత్నాన్నీ- గుంటూరు లక్ష్మీనరసయ్య ‘కవిత్వం చర్చనీయాంశాలు’ పుస్తకం వల్ల మరొక్కమారు దగ్గరగా చూసే వీలు కలుగు తుంది. అందుకు ఈ పుస్తకం ప్రశంసార్హమైనది. కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని గురించి ఉద్దేశించిన అధ్యాయంలోని ఉదాహరణలు, వివరణ, వర్ధమాన కవులకి చాలా ఉప యోగంగా ఉంటాయి. 


తాలులోంచి మేలిమి గింజల్ని వేరు చేయడమే సాహిత్య విమర్శ చేయగలిగిన విలువైన పని. లక్ష్మీనరసయ్య నేటి కవుల్లోని సంశయం, సందిగ్ధతలు ఏ గురీలేని నిహిలిజానికి దారితీస్తున్నాయని అభియోగం మోపుతాడు. అంతేకాకుండా: ‘‘యువ కవుల్లో పవర్‌ సెంటర్స్‌కు దగ్గరగా ఉండాలనే తపన లేనివాళ్ళు అతి తక్కువమందే. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కోసం పావులు కదిపేవాళ్ళు ఎక్కువైపోయారు’’ అంటాడు. యువకవుల్లో, విమర్శకుల్లో అప్పీజ్మెంట్‌ పాలిటిక్స్‌ లాగా అపీజ్మెంట్‌ పోయెట్రీ, అపీజ్మెంట్‌ విమర్శనా ధోరణి పెరిగిపోయాయంటాడు. అసలు లక్ష్మీనరసయ్య గారు ‘పవర్‌ సెంటర్స్‌’కి నిర్వచనం యిచ్చి, సదరు ‘ముఠాధిపతుల’ ఆధిపత్యానికి కారణాలేమిటో చెబితే ఈ విమర్శకు మరింత మేలు జరిగి ఉండేది. అందరూ అందరే కాదా? కాకారాయుళ్ళు, బాకాలూదేవాళ్ళు, ఉపదేశించిన ఆదర్శాలు తప్పి అకాడెమీ ప్రధాన పురస్కారా లందుకుంటున్నవాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. సాహి త్యంపై యువ పురస్కార గ్రహీతల ప్రభావమూ, వాళ్ళ కొనసాగింపు- కొత్తగా రాసేవాళ్ళకి ప్రేరణనిచ్చే విషయాలు. హృదయ సంపన్నత, జీవన వైవిధ్యం, నిజాయితీ లాంటి ఎన్నో లక్షణాలకు ఈ తరం నిలువుటద్దంలా ఉన్నది. ఈ తరాన్ని చూసేవాళ్ళ కళ్ళద్దాలు మసకబారి ఉన్నాయంటే కోపం రాకూడదు.


భావజాలానికి సామీప్యమున్నప్పుడు ఆ సంఘర్షణాత్మక కవిత్వాంశంతో మమేకమయినదానికీ, లేనప్పుడు సాఫీగా దగ్గర కావడానికీ విభజన రేఖ ఉండి తీరుతుంది. అది వస్తు శిల్పాలగానో, మరింకేంగానో వేరు వేరుగా ఉన్నప్పటికీ కేవలం ఆస్వాదనచేత ‘ఉన్నత స్థాయి’ అనిపించుకోదు. ఎందుకంటే లక్ష్మీనరసయ్యే మనిషి సాదకబాధలతో నిమిత్తంలేని ఉత్తమ కవిత్వం ఉండజాలదంటాడు. రంజింపజేయడానికీ, కదిలించే దానికీ ఒక క్రైటీరియా ఉందంటాడు. కనుకనే ప్రతీ కవి లోనూ ఉత్త కవిత, ఉత్తమ కవిత రెండూ ఉంటాయని ఆయన అంటే ఒప్పుకుంటాం. అందరికీ చెందిన కవిత్వం ఉండదంటే ‘నిజమే’ కదా అంటాం. సమస్యేమిటంటే కవి భావజాలంతో నిమిత్తం లేకుండా కవిత్వాన్ని ఆస్వాదించ వచ్చునంటాడు. అఫ్సర్‌ మల్టిప్లిసిటీని, సీతారాం అంతర్ము ఖత్వాన్ని, కృష్ణశాస్త్రి ఎస్కేపిజాన్నీ, మో లోని విషాదాన్ని, ఇస్మాయిల్‌ యథాతథవాదాన్ని ఆయా కవులు స్థిరపరచిన ప్రమాణాలకతీతంగా సహృదయతతో మాత్రమే ఇష్టపడ్డం జరుగలేదు. నిర్దిష్టతకి ‘అనేకత’ వర్తించదని పుస్తక రచయితే వివరించడం మరువకూడనిది. 


సహజంగా అవ్యవధానమూ, ఉద్రేకపూరితంగానూ ఉండే ఫేస్బుక్‌ కేంద్రకంగా వొచ్చినప్పటికీ ఈ వ్యాసాల్లో- గాలివాటు వ్యాఖ్యలుండవు. పిడివాదమూ లేదు. అవి నచ్చుతాయి. ‘‘అభ్యుదయ కవిత్వానికి చెందినంతవరకూ శ్రీశ్రీ రారాజు. విప్లవ కవిత్వానికి శ్రీశ్రీతో సహా ఎవరూ ఇప్పటివరకూ అందుకోలేని స్థాయిని శివసాగర్‌ కైవసం చేసుకున్నాడు’’ లాంటి మాటలు ఆలోచనలో పడవేస్తాయి. ఈ పుస్తకంలో విప్లవ కవిత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేసిన లక్ష్మీనరసయ్య శివసాగర్‌ ప్రస్తావనలో మాత్రం (దళిత కవిత్వం రాశాడు కనుక) ఆదరం చూపిస్తాడు. శివసాగర్‌పై అతిశయోక్తుల్లేని ప్రశంసలు సహేతుకమని పించినా- మరి పాఠకలోకం శ్రీశ్రీని మాత్రమే మహాకవి అని, శివసాగర్‌ని ఎందుకనలేదో తేల్చలేకపోతాడు. 


శేషేంద్రకి విషయపరమైన లోతు తక్కువ, అది సినారెకూ వర్తిస్తుందన్నప్పుడు, ‘పాపులర్‌’ కవులంతా ‘గొప్ప’ కవులు కాదన్న పరిశీలన కలిగిస్తాడు. అలాగే ‘మంచి’ కవులుగా మాత్రమే మిగిలిపోయిన అజంతా, ప్రసేన్‌, ఇస్మాయిల్‌, ఎమ్మెస్‌ నాయుడు లాంటివాళ్ళు గొప్ప కవులు కాలేకపోవ డానికి ‘‘సామజిక వస్తు ఎంపిక లేకపోవడం’’, ‘‘అస్పష్టత, సంక్లిష్టత’’లే కారణమంటాడు. ఇదే పుస్తకంలో మరోచోట కవిత్వాన్ని కవిత్వం చేసేది సామాజికేతర అంశమే కానీ సామాజికాంశం కాదంటాడు. ఈ గమనింపులు కవిత్వానికి ‘ఏకైక’ ప్రమాణం లేదన్న సమంజసమైన స్పృహనిస్తుంది. కానీ ‘మంచికి’ ‘గొప్పకి’ విమర్శకుడు స్పష్టతనివ్వలేదు. ప్రసాదమూర్తిలో టోనల్‌ వేరియేషన్‌, ఎండ్లూరీ, శిఖామణిలో, వస్తు గతి తార్కికత ‘తగినంత’ లేదనడం అంత తేలిగ్గా వదిలేసే విషయాలు కాదు. కేవల భావ విన్యాసాలు కాకుండా, గతితార్కిక సూత్ర సమన్వయం, వైఖరుల్లో వాటి ప్రమేయం ఈ కవుల కవిత్వ నిర్మాణంలో అంతర్భాగంగా ఉంటాయి. అట్లాగే యాకూబ్‌, షాజహానా గార్లలోనూ మానసికం మాత్రమేకాని సామాజిక వస్తుగత వాస్తవికత దాచలేనిది. ఈ కవుల్లోని వాక్య నిర్మాణమూ (ఖిడుఽ్ట్చ్ఠ), పదజాలమూ (గౌఛ్చిఛఠజ్చూటడ) వగైరాలేవి చూసినా అది తెలిసిపోతుంది.


లక్ష్మీనరసయ్య గారు ‘‘ఖాదర్‌, ముస్లిం జాషువా’’ అని తీర్మానం చేస్తాడు. స్ఫూర్తి వరకూ సరే అనిపించినా, జాషువాని కేవలం దళిత వర్గానికీ, ఖాదర్‌ గారిని ముస్లిం సమూహానికీ పరిమితం చేయడం సబబు కాదు. భాష, వ్యక్తీకరణ, కవితా నిర్మాణ పద్ధతుల విషయాలలో జాషువా మీద లక్ష్మీనరసయ్య చేసిన విమర్శను ఖాదర్‌ గారికి కూడా వర్తింపజేయగలమా? లేదు.


వస్తుశిల్ప చర్చల్లో ఏది ముఖ్యమైనదన్న నిర్ధారణల్లో లక్ష్మీ నరసయ్య ఒక్కో సందర్భంలో ఒక్కోవైపు తూగడం చిత్రంగా ఉంటుంది. కవిత్వ రూప నిర్మాణాల్లో సామాజిక మార్పుల కతీతమైన పాక్షిక స్వతంత్రత ఉంటుందనీ, అలాగే ఒట్టి రూపంతో మెస్మరైజ్‌ చేయడం గాలత్వంలో భాగమేననీ, వస్తువుకూ రూపానికీ ఉన్న సంబంధం ఒన్‌ సైడెడ్‌ కాదనీ, కవుల సామర్థ్యం వారి కవిత్వ వస్తువులో కంటే రూపంలోనే ఎక్కువ బయటపడుతుందని ధైర్యంగా చెప్పగలమనీ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు. లక్ష్మీ నరసయ్య గారిలో కవిత్వ కళా తీవ్రత పట్ల, టెక్నిక్‌ జోక్యం పట్ల పెరిగిన ఇష్టం అతనిలోని ఒక భావజాల మళ్ళింపును సూచిస్తున్నదని భావిస్తున్నాను. అతనిలో వస్తువు కన్నా శిల్పమే ప్రధానమనే అభిప్రాయ మార్పు ఎక్కువగా ఈ పుస్తకంలో కనిపించింది. అతనికి వస్తువుతోనే పేచీ ఉందన్న విషయం రూఢీ అవుతుంది. ఏమిటది? 


లక్ష్మీనరసయ్య విప్లవ కవిత్వంలో హెచ్చార్కేని, త్రిశ్రీని ఉటంకించి, వాళ్ళ విప్లవ విమర్శనాత్మక ధోరణిని మెచ్చు కుంటాడు. విప్లవోద్యమాలు కూడా కుల వ్యవస్థలో కూరుకుపోయాయన్న విల్సన్‌ సుధాకర్‌ గారి వాక్యాల్లోని ట్విస్టెడ్‌ లక్ష ణాన్ని గొప్పగా వివరిస్తాడు. ఇబ్బంది లేదు. కానీ బతికినంత కాలం ఒకే సిద్ధాం తానికీ, ఒకే పార్టీకీ, ఒకే ఉద్యమానికీ పూర్తిగా కట్టుబడి ఉండటాన్ని ఛాందసంగా, ఒకే రాజకీయ ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళని ‘వీరపత్నులుగా’ అభివర్ణించడాన్ని మాత్రం వ్యతిరేకించాలి. అందులో స్వార్థంతో కూడిన సెటైర్‌ మాత్రమే ఉందనుకోలేము. కళా స్వరూప ప్రశంస కన్నా వస్తువు పట్ల అభ్యంతరకర అవమానమూ ఉంది. ఇక్కడే లక్ష్మీనరసయ్యగారు విమర్శలో వ్యక్తంచేసిన మనోధర్మాన్ని గురించి పునర్వివేచన చేయాలి. అది నిస్సందేహంగా లాల్‌ - నీల్‌ మధ్యగల వైరుధ్య సామీ ప్యాల్లోంచి చూడవలసింది. 


కవిత్వ విమర్శలో న్యాయమైన గీటురాళ్ళు తెలిసిన విమర్శకుడిలో కూడా కొన్ని పక్షపాతాలుండటాన్ని కాదనలేం. అవి అతను ఉటంకించిన వ్యక్తుల పేర్లలోనే కాకుండా అనేక వాదాలని, సిద్ధాంతాల్నీ వ్యాఖ్యానించడంలోనూ గమనించవచ్చు. ‘‘కవులు ఏనాటి సమాజంలో ఉన్నారనేది మాత్రమే కాదు, వారు ఏ కులం, ఏ వర్గం, ఏ మతం, లింగం, ప్రాంతంలో ఉన్నారు అనేది కూడా వారి కవిత్వాన్ని ప్రభావితం చేస్తుంది’’ అన్నందుకు అభ్యంతరం లేదు. అతను దళిత బహుజన కులాల కవుల్ని ఎక్కువ మెచ్చు కుంటాడు. వారి వారి కవిత్వ నేపథ్యాల్లోంచీ ఎక్కువగా తన విమర్శని నిర్మించుకుంటాడు. ఇతరుల్ని ‘అంతగా’ పట్టించుకోడు. అది అతనికేమీ రహస్యపు ఎజెండా కాదు. ఈ విమర్శకుడు అట్టడగు జనాల అస్తిత్వాల్లో జీవన పోరాట సత్యాల్ని రికార్డు చేయవలసిన అవసరాన్ని ఆవశ్యక దృష్టిగా మలచుకున్నవాడు. అతని విమర్శలో కుల ప్రభావ రిజిడిటీ అమితంగా ఉంటుంది. అది కవిత్వ ప్రకటనలో ఉండే సాంఘిక ప్రగతిశీల ప్రాధాన్యకోణాన్ని తక్కువ చేయాలని చూస్తుంది. దేశంలో ఒకప్పటి బ్రాహ్మణేతరుల ఉద్యమాల్ని, అందులో బలపడ్డ శూద్ర కుల పెత్తందారుల్నీ గుర్తుకు తెస్తుంది. వరవరరావు రాజకీయ కవే అని ఒప్పుకున్న లక్ష్మీనరసయ్య గారు శివారెడ్డి శిల్పంలో హిందూవాదం ఉందనడం, అతని కవిత్వంలో కులవాస్తవికతకు చెందిన వస్తువు లేదనడం సరైన గమనింపు కాదు. శివారెడ్డి గారే కాదు, ఏ కవైనా తన జీవన ప్రాదేశికతలోంచి వాడే కొన్ని పదాలు, భావనలు ఒక కుల, మత వాద ప్రతిబింబాలు కావు. రకరకాల కులాల కలగూరగంపే హిందూవాదమని మర్చిపోకూడదు కదా? ఆ మాటకొస్తే, ‘‘శివుని చెవి నీకు కొంత చేరువగనుండు, విన్నవింపుము నాదు జీవిత చరిత్ర’’ అని గబ్బిలాన్ని అన్ని గుళ్ళూ తిరగమన్నాడు కనుక జాషువాదీ హిందూవాద శిల్పమనే పొరబాటు చేయ గలమా? ఎత్తుగడ, నడక, ముంపుల్లో శివారెడ్డిది నవీన శిల్పం. ఒక కవి శిల్పానికి మతంతో ముడి పెట్టదలిస్తే ఆ అన్వేషణ ఏ ఒక్కరి దగ్గరో ఆగేది కాదు. 


విప్లవమూ, దళిత బహుజన సాహిత్య వాదాల నడుమ కులవ్యవస్థల్ని నిరసిస్తూనే, కాలక్రమేణా అప్రయత్నంగా వాటి బలోపేతం జరిగిందనిపిస్తోంది. లక్ష్మీనరసయ్యగారు ప్రగతిశీల విప్లవ కవిత్వాన్ని మొత్తం ఒక మనువాద చట్రంలో బిగించాలని చూస్తాడు. దళిత బహుజన సాహిత్య సిద్ధాంతమే హిందూవాదాన్ని ఎదుర్కొన్న ఏకైక శక్తిగా నిలబెట్టే ప్రయ త్నమూ చేస్తాడు. ‘‘అభ్యుదయ కవులూ, దిగంబర కవులూ, విప్లవ కవులూ తెలిసో తెలీకో హిందూవాద కంటెంట్‌ని హిందూవాద రూపం నుంచి వ్యక్తీకరించారు, ఆ పనిని బహుజన కవులు బద్దలు కొట్టారు’’ అంటాడు. ఒకప్పుడు విప్లవ సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఇప్పుడు దళిత బహుజనవాదం కచ్చితంగా పైచేయి తీసుకుంటు న్నది. ప్రజాస్వామిక మార్పే. ఆహ్వానించవలసిందే. కానీ దళిత బహుజనేతర కవులూ రచయితల రచనలన్నింటిలో వ్యక్తంకాని సర్వసామాజిక వర్గమూలాల్ని తప్పుబట్టేందుకే లక్ష్మీనరసయ్యలాంటివాళ్ళ విమర్శ పనిముట్టు కాకూడదు. కులవ్యతిరేక పోరాట విజయానికి కులదృక్పథంతో కూడిన సాహిత్య విమర్శలోసైతం నిష్పక్షపాతమూ, నిర్మమకారాలను కోరుకోవడం అత్యాశ కాదు. లక్ష్మీ నరసయ్య గారు ఇప్పటి దాకా నడచిన ప్రగతిశీల ఉద్యమాల్ని పూర్వపక్షంచేసే విఫల యత్నం చేస్తాడు. బహుశా అందరికీ చెందిన కవిత్వం లేనట్టే, అందరికీ చెందిన విమర్శ కూడా ఉండదన్న ఎరుక కలిగించడంలో మాత్రమే ఆయన రాసిన ఈ పుస్తకం విజయవంతమౌతుంది.


లక్ష్మీనరసయ్య లాంటి వాళ్ళ పీడిత అస్తిత్వ వాద సాహిత్య విమర్శ, సామాజిక వాస్తవికతని అద్దంలో చూపెడుతుంది. ఈ విమర్శనా గ్రంథం స్థూలంగా భావజాలాన్ని, సూక్ష్మంగా కళాజాలాన్ని మెథడాలజీగా స్వీకరిస్తుంది. బహుజన రాజ్యాధికార కాంక్ష లక్ష్యంగా ఉంటుంది. అయితే కులతత్వ మూలాల్ని కవిత్వం ఏ మేరకు బహిర్గతపరచి, అది ఏ నూతన ‘కుల చైతన్య’ సామాజిక సిద్ధాంతాన్ని ప్రతి పాదిస్తున్నదో, అది కదా చాలా అవసరం. అంబేద్కర్‌ మహాశయుడి బౌద్ధమత స్వీకారం, అది కొత్త దేశీయ సాహిత్య సిద్ధాంతం కాగల చర్చ ఎక్కడా తేకపోవడం కొంత ఖాళీగానే అనిపిస్తుంది. లక్ష్మీనరసయ్యలోని వామ పక్షీయతను గురించి ‘‘ఈ విమర్శకుడి ఎడమ కన్ను గుడ్డిది’’ అని అన్నాడొకప్పుడు ప్రసేన్‌. మార్క్సిస్టుల ఆర్థిక వాద, వర్గవాద భావజాలం ‘నిర్దిష్ట రూపురేఖలున్న’ దళిత బహుజన విముక్తికి పనికిరాదని లక్ష్మీనరసయ్య ప్రతిపాదిం చడాన్ని మరువలేము. గడచిన పాతికేళ్ళ కాలంలో పీడిత కుల విముక్తికి తన సాహిత్య విమర్శ సరైన ప్రాపంచిక దృక్పథంలోంచి స్పష్టమైన తాత్విక ప్రేరణ పొందిందా లేదా? పూలే అంబేద్కర్‌ తాత్వికతల్ని ఏకీకృతం చేయడంలో ఈ విమర్శకు వామపక్ష వ్యతిరేకత ఏమేరకు ఉపయోగపడింది? వీటికి సమాధానాలు చెప్పుకోలేకపోతే లక్ష్మీ నరసయ్యగారు నడిపిస్తున్న సాహిత్య భావజాలపు దారులు కురచనయ్యే ప్రమాదముంది. సాహిత్యంలో వాటాలు కావల్సిందే. కొన్ని వర్గాలే అనుభవించిన, అనుభవిస్తున్న లబ్ధిని అన్ని వర్గాల వారూ పొందాల్సిందే. అయితే లక్ష్మీనరసయ్యే ఉటంకించి నట్టు ‘‘కవిత్వమనేది ఏదో స్థిరీకరణకు చెందిన చట్రానికి మాత్రమే పరిమితం కాదు’’ కదా! 

శ్రీరామ్‌ పుప్పాల, 99634 82597

Updated Date - 2021-10-11T06:49:00+05:30 IST