Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 15 Aug 2022 00:13:53 IST

అక్షరమై రగిలిన స్వేచ్ఛా కాంక్ష

twitter-iconwatsapp-iconfb-icon
అక్షరమై రగిలిన  స్వేచ్ఛా కాంక్ష

స్వాతంత్ర్యోద్యమ కాలంలో మన తెలుగు కవులెందరో తమ కలాలను స్వేచ్ఛాకాంక్షతో ఉరకలెత్తించారు. పద్య వచన కవిత్వం, గేయ సాహిత్యం విస్తృతంగా రాశారు. ఆనాటి ఉద్యమ సభలూ ఊరేగింపులూ ఈ పద్యాలూ పాటలతో హోరెత్తేవి. మన మనసుల్లో భారత జాతి అనే భావనను నిర్మించిందీ, దేశభక్తిని ఉన్నతంగా మలచిందీ ఈ కవుల సాహిత్యమే అంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ఆ సాహిత్యంలో కొన్ని ఆణిముత్యాలను, 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.


చిలకమర్తి లక్ష్మీనరసింహం

భరతఖండంబు చక్కని పాడియావు

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ

తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.


చెరసాలల్‌ పృథుచంద్రశాలలె యగున్‌, చేదోయి గీలించు న

య్యరదండల్‌ విరిదండలయ్యెడును, హేయంబైన చోడంబలే

పరమాన్నంబగు, మోటుకంబళులు దాల్పన్‌ పట్టు సెల్లాలగున్‌,

స్థిరుడై యే నరుడాత్మ దేశమును భక్తిం గొల్చు నవ్వానికిన్‌.


వానమామలై వరదాచార్యులు

జయ భారతావనీ! జయలోక పావనీ,

శాంతి సుఖదాయినీ! జననీ! నమస్తే!

సకల సంపత్ఖనీ! సస్యనందనవనీ!

ఆసేతు శీతనగ హాటకావని జనని!

చత్వారింశత్కోటి - జయ ఘంటికాధ్వనీ,

సాశీతి కోటి భుజ బల మహావాహినీ! ్ఢ్ఢజయ్ఢ్ఢ


హిందూ ముసల్మాను ఈసాయి శిఖ్‌ జైన్‌

బౌద్ధ చార్వాక సుత బహుమత కుటుంబినీ!

సంస్కృతాంధ్ర ద్రవిడ వంగ హిందీ ఓఢ్ర

ఘూర్జర మరాఠ కర్ణాట కలభాషిణీ! ్ఢ్ఢజయ్ఢ్ఢ


రాయప్రోలు

ఏ దేశమేగినా ఎందు కాలిడిన

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండుగౌరవము


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమో

జనియించినాడ వీ స్వర్గఖండమున

ఏ మంచి పూవులన్‌ ప్రేమించినా వో

నిను మోచె యీ తల్లి కనక గర్భమున.


లేదురా ఇటువంటి భూ దేవి యెందు

లేరురా మనవంటి పౌరులింకెందు

సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక

ఓడల జెండాలు ఆడునందాక.


అందాక గల ఈ అనంత భూతలిని

మన భూమి వంటి చల్లని తల్లి లేదు

పాడరా నీ తెల్గు బాలగీతములు

పాడరా నీ వీర భావ భారతము.


గుర్రం జాషువ

సగరమాంధాత్రాదిషట్చక్రవర్తుల

       యంకసీమల నిల్చినట్టి సాధ్వి

కమలనాభుని వేణుగానసుధాంబుధి

        మునిగి తేలిన పరిపూతదేహ

కాళిదాసాదిసత్కవికుమారుల గాంచి

         కీర్తి నందిన పెద్దగేస్తురాలు

బుద్ధాదిమునిజనంబుల తపంబున మోద

        బాష్పముల్‌ విడిచిన భక్తురాలు


సింధుగంగానదీజలక్షీర మెపుడు

గురిసి బిడ్డల పోషించుకొనుచునున్న

పచ్చిబాలెంతరాలు మా భరతమాత

మాతలకు మాత సకలసంపత్సమేత.


కరుణశ్రీ

‘గణగణ’ మ్రోగెరా విజయ ఘంటలు భారతమాత మందిరాం

గణమున; ద్వారబంధములఁ గట్టిరి చిత్రవిచిత్ర రత్న తో

రణతతి; వీధివీధుల విరాజిలుచున్నవవే త్రివర్ణ కే

తనములు; మేలుకాంచె పరతంత్ర పరాఙ్ముఖ సుప్తకంఠముల్‌.


గరిమెళ్ల సత్యనారాయణ

మా కొద్దీ తెల్లదొరతనము  దేవ

మా కొద్దీ తెల్లదొరతనము

మా ప్రాణాలపై పొంచి - మానాలు హరియించె

పన్నెండు దేశాలు - పండుచున్నాగాని -

  పట్టెడన్నమె లోపమండి

ఉప్పు ముట్టుకుంటే దోషమండి

నోట మట్టికొట్టి పోతాడండి

అయ్యొ! కుక్కలతో పోరాడి - కూడు తింటామండీ
దేవులపల్లి కృష్ణశాస్త్రి

జయ జయ జయ ప్రియ భారత

     జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

     నర నారీ హృదయనేత్రి

జయ జయ సస్యామల సు

     శ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా

     చరిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

     లాక్షారుణ పదయుగళా!

     జయ జయ జయ ప్రియభారత్ఢ్ఢ

జయ దిశాంత గణ శకుంత

     దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

     గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ

     చుంబిత సుందర చరణ్ఢ్ఢా

     జయ జయ జయ ప్రియ భారత

     జనయిత్రీ దివ్యధాత్ర్ఢ్ఢి


దాశరథి

ఓ జనతానతాంజలిపుటోజ్జ్వల కోష్ణనవోష్ణరక్తధా

రాజలసిక్త పాదకమలద్వయశోభిమనోజ్ఞదేహరే

ఖాజయభారతీ! యుగయుగమ్ముల పున్నెపుపంట వీవు నీ

                పూజకు తెచ్చినాడనిదె పొంగిన గుండియనిండు పద్దెముల్‌.

జండా ఒక్కటె మూడువన్నెలది, దేశంబొక్కటే భారతా

ఖండాసేతుహిమాచలోర్వర; కవీట్కాండమ్ములోనన్‌ రవీం

ద్రుండొక్కడె కవీంద్రు, డూర్జితజగద్యుద్ధాలలో శాంతికో

దండోద్యద్విజయుండు గాంధి ఒకడే తల్లీ మహాభారతీ!


సుంకర సత్యనారాయణ

ఎగురవే వినువీధి - ఎగురవే జండా

శాంతి దూతగ నేడు - జాతీయ జండా

యుగ యుగంబుల జగతి నెగురవే జండా

సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జండా ్ఢ్ఢ 


భారతీయుల మహా పోరాట ఫలితమా

వీరయోధుల రక్త ధారలకు చిహ్నమా

శాంతి మాత అశోక ధర్మచక్రము దాల్చి

శాంతి నిల స్థాపించ నరుదెంచితివి నీవు ్ఢ్ఢ


వేదుల సత్యనారాయణశాస్త్రి

నీచపు దాస్యవృత్తి మననేరని శూరత మాతృదేశసే

వాచరణమ్మునం దసువు లర్పణసేసినవారి పార్థివ

శ్రీ చెలువారుచోటఁ దదసృగ్రుచులన్‌ వికసించి వాసనల్‌

వీచుచు రాలిపోవగవలెం దదుదాత్తసమాధిమృత్తికన్‌.


బలిజేపల్లి లక్ష్మీకాంతకవి

తఱి, గాంధీయుగ మేగు దెంచె, నిక, నేతద్భారతీయ స్వరా

జ్య రథం, బాతని సారథిత్వమున వే సాగించుడంచున్‌, జగ

ద్గురు డేగెన్‌ దివిలోకమాన్యుఁడవెయుద్ఘోషించెదూర్య ధ్వనుల్‌

ఉరు తద్దివ్యరథంబు లాగుటకు, రండో! భారతీయ ప్రజల్‌!!


బసవరాజు అప్పారావు

సిగ్గులేదా నీకు - శరములేదా?

అన్నమైనలేక బీద - లల్లాడుతుంటేను

సీతాకోక చిలుకలాగ - సీమగుడ్డ కట్టి తిరుగ ్ఢ్ఢసిగ్గులేద్ఢ్ఢా

పూట కూడులేని ప్రజకు - రాట్నమొకటే పెన్నిధాన

మోటంచు పవిత్రమైన - రాటం ఖద్దరు వెక్కిరింప ్ఢ్ఢసిగ్గులేద్ఢ్ఢా

అంగుడులన్నియుంటే - అల్లుడినోట శనున్నట్లు

భాగ్యరాశి భారతభూమి - పరదేశ సరుకులేల ్ఢ్ఢసిగ్గులేద్ఢ్ఢా


శృంగవరపు శ్రీనివాసాచార్యులు

ఎత్తండి స్వరాజ్య జండా! జండా

నెత్తండి ధైర్యము నిండ! నింక

స్వరాజ్య జయమును! సంధింతుమనుచును!! ్ఢ్ఢఎత్తండ్ఢ్ఢి

మూడు రంగుల జండ - ముద్దులొల్కెడి జండ

మునుకొని మనమున - యుండ - దాని

విడిచిన మనకేది యండ - వట్టి

యెండమావులె చెంతనుండ - కుక్షి

నిండునె నద్దాని నిండ - గాన

తిండికి తలదాచి యుండుట కై యిక!! ్ఢ్ఢఎత్తండ్ఢ్ఢి

జాతి బేధములెంచి - యైుకమత్యము వీడి

నీతి బాహ్యము బొందకండి! శుష్క

వాదముతో నుండకండి! సంఘ

భేదముల నెంచకండి! గాంధి

యాదర్శముల నెంచి: యేకభావము గాంచి!! ్ఢ్ఢఎత్తండ్ఢ్ఢి

సేకరణ: గాలి నాసరరెడ్డి
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.