పోటీ చేసి గెలుస్తారా..?

ABN , First Publish Date - 2021-03-01T05:16:28+05:30 IST

పోటీ చేసి గెలుస్తారా..?

పోటీ చేసి గెలుస్తారా..?

మా మాట విని విత్‌డ్రా చేసుకోండి

ఎన్నికలు అయిపోయాక మీ పనులేమైనా ఉంటే చేసి పెడతాం

ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ బుజ్జగింపులు.. బెదిరింపులు

రేపటి నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

భారీ విత్‌డ్రాలకు వైసీపీ వ్యూహం

దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ సన్నద్ధం


అధికారం మాది.. అన్నీ మేమనుకున్నట్లే జరుగుతాయి.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మాపక్షానే నిలిచారు.. మున్సిపాలిటీల్లో మీరు ఎలాగూ గెలవలేరు? మా మాట విని విత్‌డ్రా చేసుకుంటే, ఎన్నికల తర్వాత మీ పనులు చేసి పెడతాం.. అంటూ ఏకగ్రీవాల కోసం అధికార వైసీపీ కీలక నేతలు బుజ్జగింపులు, బేరాలకు శ్రీకారం చుట్టారు. మాట వినకపోతే పోలీసులను బరిలోకి దింపి పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రేపటి నుంచి మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. తొలిరోజు భారీ సంఖ్యలో నామినేషన్లను విత్‌డ్రా చేయించి కార్పొరేటర్‌, మున్సిపల్‌ వార్డు సభ్యుల ఏకగ్రీవాలు చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీటుగా ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. 


(కడప-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కడప నగరపాలక సంస్థతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటితో ప్రారంభమవుతుంది. గత ఏడాది మార్చి 15న ఎన్నికలు వాయిదా సమయంలో ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయా మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్‌తో పాటు వివిధ మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు 257కు గాను 1453 మంది నామినేషన్లు వేశారు. అందులో అధికార వైసీపీ 624, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 249, బీజేపీ జనసేన కూటమి 100, ఇతర పార్టీలు, స్వతంత్రులు 479 మంది నామినేషన్లు వేశారు. గత ఏడాది విత్‌డ్రాలకు ఒకరోజు ముందు ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో 2వ తేదీ మంగళవారం విత్‌డ్రాలతో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. 


బెదిరింపులు.. బుజ్జగింపులు

భారీ ఎత్తున అభ్యర్థులను విత్‌డ్రాలు చేయించి, అన్ని మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకోవడానికి అధికార వైసీపీ వ్యూహాత్మక పావులు కదుపుతోంది. గత ఏడాదే కొందరితో రాజకీయ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో విత్‌డ్రాల పర్వాన్ని మరింత వేగం చేశారు. ఒకరోజు గడువు ఉండటంతో ప్రధాన నాయకులు బరిలో దిగి బెదిరింపులు, బుజ్జగింపులతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఆ క్రమంలో పెద్దఎత్తున ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. కడప కార్పొరేషన్‌తో పాటు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్‌ ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే పులివెందులలో అన్ని వార్డుల్లో అధికార పార్టీ సింగిల్‌ నామినేషన్లతో మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన మున్సిపాలిటీల్లోను సగానికి పైగా వార్డులను ఏకగ్రీవం చేసుకుని మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను తన ఖాతాలో వేసుకోవడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. 


దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం సన్నద్ధం

అధికార పార్టీ ఏకగ్రీవాల వ్యూహానికి దెబ్బకొట్టి అన్ని వార్డుల్లో నామినేషన్‌ వేసిన అభ్యర్థులను బరిలో ఉంచేలా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ జనసేన కూటమిలు పావులు కదుపుతున్నారు. ఇదే విషయంపై ఆదివారం జిల్లాకు చెందిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మలు చంద్రబాబును కలిశారు. పంచాయతీల్లో దీటుగా ఎదుర్కొన్నారు. అదే తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లోను దీటుగా నిలబడాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. బద్వేలు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా చేయకుండా అధికార పార్టీ ఒత్తిడుల నుంచి తప్పించేందుకు అభ్యర్థులను క్యాంపులకు తరలించే అలోచన చేస్తున్నారు. కడప నగరంలో అభ్యర్థులే కాకుండా పార్టీ అభ్యర్థులు లేని స్వతంత్రులకైనా సహకరించేందుకు టీడీపీ అధిష్ఠానం సన్నద్ధమవుతోంది. అలాగే బీజేపీ జనసేన కూటమి నామినేషన్లు వేసిన డివిజన్లలో అభ్యర్థులు పోటీలో ఉండేలా చేసేందుకు ఎత్తులు వేస్తోంది. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నగరపాలక సంస్థల్లో బలమైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ తదితరులు సిద్ధమవుతున్నారు. ఒకపక్క టీడీపీ, మరోపక్క బీజేపీ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ ఏకగ్రీవాల ఎత్తులను చిత్తు చేసేందుకు సై అంటున్నారు. వీరి ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే. 


వివిధ మున్సిపాలిటీల్లో దాఖలైన నామినేషన్లు ప్రధాన పార్టీల నామినేషన్ల వివరాలు

మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు వైసీపీ టీడీపీ బీజేపీ/

జనసేన ఇతరులు

కడప 50 389 85 61 24 219

ప్రొద్దుటూరు 41 276 105 80 17 74

మైదుకూరు 24 144 78 32 5 29

జమ్మలమడుగు 20 125 64 - 29 32

ఎర్రగుంట్ల 20 124 76 8 18 22

బద్వేల్‌ 35 177 90 34 3 50

రాయచోటి 34 173 81 34 4 53

పులివెందుల 33 45 45 -- -- --

మొత్తం 257 1453 624 249 100 479

Updated Date - 2021-03-01T05:16:28+05:30 IST