హైదరాబాద్‌లో కొత్తగా 34 కేసులు.. ఏఏ ప్రాంతాల్లో నమోదయ్యాయంటే..

ABN , First Publish Date - 2020-05-20T16:45:01+05:30 IST

గ్రేటర్‌ను కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. మంగళవారం కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. ఒక్క కింగ్‌కోఠి ఆస్పత్రిలోనే 11 కేసులు నమోదయ్యాయి. ఈదీబజార్‌లో 55ఏళ్ల మహిళ, మాదన్నపేట కుర్మగూడకు చెందిన వృద్ధుడు(75) కరోనాతో ఆస్పత్రుల్లో మృతి చెందారు.

హైదరాబాద్‌లో కొత్తగా 34 కేసులు.. ఏఏ ప్రాంతాల్లో నమోదయ్యాయంటే..

ఫీవర్‌ ఆస్పత్రికి తగ్గిన కరోనా బాధితులు 

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ను కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. మంగళవారం కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. ఒక్క కింగ్‌కోఠి ఆస్పత్రిలోనే 11 కేసులు నమోదయ్యాయి. ఈదీబజార్‌లో 55ఏళ్ల మహిళ, మాదన్నపేట కుర్మగూడకు చెందిన వృద్ధుడు(75) కరోనాతో ఆస్పత్రుల్లో మృతి చెందారు.  


కింగ్‌కోఠి ఆస్పత్రిలో 11 పాజిటివ్‌ కేసులు

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రిలో మొత్తం 52 మంది అనుమానితులు ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన 11 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 21 మందికి నెగెటివ్‌ రాగా డిశ్చార్జి చేశారు.


న్యూదత్తానగర్‌లో మహిళకు..  

హస్తినాపురం డివిజన్‌లోని న్యూ దత్తానగర్‌లో 37 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆమె ఇటీవల సైదాబాద్‌ కుర్మగూడలో ఉంటోన్న తండ్రి ఇంటికి వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చింది. నాలుగు రోజుల క్రితమే ఆమె తండ్రికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆమెను, కుటుంబ సభ్యులను వైద్యపరీక్షలకు పంపించగా, మహిళకు పాజిటివ్‌గా ఆమె భర్త, పిల్లలకు నెగెటివ్‌గా తేలింది. ఆ ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 


ఎస్‌ఆర్‌టీయూ కాలనీలో మరొకరికి.. 

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 53 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, మంగళవారం పాజిటివ్‌ అని తేలింది. ఈమె కొంతకాలంగా హైపర్‌ టెన్షన్‌తోపాటు కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఆయాసంతోపాటు వాంతులు కూడా అయ్యాయి. డయాలసిస్‌ కోసం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆమె కుటుంబంలోని ఎనిమిది మందిని హోం క్వారంటైన్‌ చేశారు.  


పాపిరెడ్డికాలనీలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ 

శేరిలింగంపల్లి సర్కిల్‌ పాపిరెడ్డికాలనీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని సర్కిల్‌ ఉపకమిషనర్‌ వెంకన్న తెలిపారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తామని చెప్పారు.  


మంగళ్‌హాట్‌లో మరొకరికి.. 

మంగళ్‌హాట్‌లోని జాలీహనుమాన్‌ దేవాలయ సమీపంలో ఉండే 38 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 17న జ్వరం, దగ్గు రాడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో వారిని హోం కార్వంటైన్‌ చేశారు. మొత్తంగా మంగళ్‌హాట్‌లో కరోనా కేసుల సంఖ్య 46కు చేరింది.  


లంగర్‌హౌస్‌లో మహిళకు..

లంగర్‌హౌస్‌ ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(26)కు కరోనా పాజిటివ్‌ తేలింది. జియాగూడలో బంధువుల ఇంటికి వారం రోజుల క్రితం వెళ్లి వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి జ్వరంతో బాధపడుతోంది. డాక్టర్‌ వద్దకు వెళితే ఆమెకు ఉన్న లక్షణాలను గమనించి జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆ మహిళ కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. ఆమె ఇంటిని పోలీసులు కట్టడి ప్రాంతంగా ప్రకటించారు.


చెస్ట్‌ ఆస్పత్రిలో పది మంది అనుమానితులు 

చెస్ట్‌ ఆస్పత్రిలో మంగళవారం ఎనిమిది మందికి నెగెటివ్‌ రావడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ప్రస్తు తం ఆస్పత్రిలో పదిమంది అనుమానితులు ఉన్నారు.  


19 రోజుల్లో 121 అనుమానితులు

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా అనుమానిత కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో రోజూ పదుల సంఖ్యలో నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 121 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఈ ఆస్పత్రిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంబర్‌పేటకు చెందిన ముగ్గురు... చాంద్రాయణగుట్ట, పహాడిషరీ్‌ఫలకు చెందిన  ఒక్కొక్కరు వైరస్‌ బారిన పడ్డారు.  గత 19 రోజుల్లో ఈ నెల 7న 17 కేసులు, 18న పది కేసులు నమోదయ్యాయి. మిగిలిన రోజుల్లో రోజుకు తొమ్మిదికి లోపు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులు ఐదుగురు అనుమానితులు ఉన్నారు. 


ఇంటికి చేరుకున్న కానిస్టేబుల్‌ కుటుంబం

మేడిపల్లి కానిస్టేబుల్‌, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందికి కరోనా నెగెటివ్‌ రావడంతో అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 


కట్టడి ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్‌

ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఆదివారం 30 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ రాగా, సోమవారం అతడి కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారు ఉంటున్న ఇంటి ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడి ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సర్వే నిర్వహించాలని మలక్‌పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ జ్యోతిని ఆయన ఆదేశించారు. ఆయన వెంట చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌, మలక్‌పేట సర్కిల్‌-6 డీసీ రజినీకాంత్‌రెడ్డి, నోడల్‌ ఆఫీసర్లు మహావీర్‌, జమీల్‌ షేక్‌, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌, చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తదితరులు ఉన్నారు.


భోలక్‌పూర్‌లో వైద్య బృందం సర్వే

భోలక్‌పూర్‌లో గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతాన్ని కట్టడి చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. బడీ మసీదు, మండీగల్లీ, భోలక్‌పూర్‌లో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు.


ముషీరాబాద్‌, అంబర్‌పేటలో భయం.. భయం.. 

ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 20, అంబర్‌పేట నియోజకవర్గంలో 25 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తాజాగా భోలక్‌పూర్‌లో ఒకటి, బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో చెన్నారెడ్డినగర్‌, అశోక్‌నగర్‌, గోల్నాక, కామ్‌గార్‌నగర్‌, కాచిగూడ ప్రాంతాలలో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు.


కరోనాతో ఇద్దరి మృతి

జీహెచ్‌ఎంసీ సంతోష్ నగర్‌ సర్కిల్‌-7 పరిధిలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఈదీబజార్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ పాజిటివ్‌గా తేలింది. మంగళవారం ఆస్పత్రిలో ఆమె చనిపోయింది. మాదన్నపేట కుర్మగూడ నివాసి 75 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 15న కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇదే కుటుంబంలో సోమవారం ఎనిమిది మందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం వృద్ధుడు చనిపోయాడు. 

Updated Date - 2020-05-20T16:45:01+05:30 IST