చుక్క లేదని చావబోయారు

ABN , First Publish Date - 2020-03-30T09:48:46+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఎనిమిది రోజుల నుంచి మద్యం దుకాణాలు, కల్లు డిపోలు బంద్‌ కావడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మద్యానికి బానిసలైన ఇద్దరు ఆత్మహత్యయత్నానికి

చుక్క లేదని చావబోయారు

అశ్వారావుపేటలో గొంతు కోసుకున్న వ్యక్తి..

బోధన్‌లో కడుపు కోసుకున్న మరొకరు

మానసిక వ్యాధితో ఎర్రగడ్డ ఆస్పత్రికి బాధితులు..

2 రోజుల్లోనే 43 మంది రాక..

ఐదుగురి ఆరోగ్య పరిస్థితి విషమం

బోధన్‌/అశ్వారావుపేట/ఎర్రగడ్డ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా ఎనిమిది రోజుల నుంచి మద్యం దుకాణాలు, కల్లు డిపోలు బంద్‌ కావడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మద్యానికి బానిసలైన ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బోధన్‌ పట్టణానికి చెందిన సయ్యద్‌ ఎజాజ్‌ కల్లు దొరక్క మూడు రోజులుగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోని కత్తితో పొట్ట భాగంలో కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బోధన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన మర్రివాడ రాంబాబు శనివారం అర్ధరాత్రి కత్తితో గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు.


అశ్వారావుపేట ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ తరహా బాధితులు హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు ఇప్పుడు క్యూ కడుతున్నారు. సాధారణంగా రోజూ ఇక్కడి ఆస్పత్రికి ఇద్దరు, ముగ్గురు బాధితులు మాత్రమే వస్తుంటారు. కానీ.. శని, ఆదివారాల్లో వారి సంఖ్య ఏకంగా 43కు పెరిగిపోయింది. శనివారం 18 మంది, ఆదివారం 25 మంది ఆస్పత్రి వచ్చారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆదివారం వచ్చిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి అవుట్‌ పేషెంట్‌గా చికిత్స అందించి పంపించేశారు.


ఈవిషయమై మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ ఉమా శంకర్‌ మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారికి కొన్ని రోజులు తాగకపోతే మానసిక వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిని ఆల్కహాల్‌ విత్‌డ్రాయల్‌ సిండ్రోమ్‌ అంటారని, ఇలాంటి వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని అన్నారు. మద్యానికి బానిసైన వారు రెండు మూడు రోజుల పాటు మద్యం తాగకపోయినా మామూలుగానే ఉంటారని, రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయని వివరించారు. వ్యాధి లక్షణాలు తీవ్రమైతే ఆత్మహత్యలకు సైతం పాల్పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు.  


Updated Date - 2020-03-30T09:48:46+05:30 IST