మద్యం షాపులు మరో గంట

ABN , First Publish Date - 2022-01-18T09:04:58+05:30 IST

‘నవ్విపోదురుగాక నాకేటి..’ అనే సామెతలా తయారైంది వైసీపీ సర్కారు తీరు. ఎవరేమనుకుంటే మాకేంటి? మా రూటే

మద్యం షాపులు మరో గంట

  • కరోనా వేళ ఇదేంటంటూ సర్వత్రా విమర్శలు
  • మద్యం షాపులు గంట పెంపు
  • రాత్రి 10 వరకూ తెరచి ఉంచాలని ఉత్తర్వులు.. అకౌంట్ల నిర్వహణకే అంటున్న సర్కారు
  • దాని కోసం గతంలోనే 60 నిమిషాలు పెంపు
  • ఇప్పుడు మళ్లీ అదే పేరుతో మరో గంట
  • ఓ వైపు నైట్‌ కర్ఫ్యూ, వ్యాపారాలపై ఆంక్షలు
  • మద్యానికి వర్తించవా?:  సర్వత్రా విమర్శలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

 ‘నవ్విపోదురుగాక నాకేటి..’ అనే సామెతలా తయారైంది వైసీపీ సర్కారు తీరు. ఎవరేమనుకుంటే మాకేంటి? మా రూటే సెపరేటు అన్నట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దేశమంతా కరోనాను ఎలా అడ్డుకోవాలా అని చూస్తుంటే, రాష్ట్రంలో మాత్రం మద్యం షాపుల పనివేళలు పెంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నిత్యావసరాలకు సంబంధించిన వ్యాపారాలకు కాస్తంత వెసులుబాటు ఇవ్వాలంటేనే పరిస్థితి ఎటు దారితీస్తుందోనని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.


మన రాష్ట్రంలో మాత్రం మద్యమే ముఖ్యం అన్నట్టుగా మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు బార్లా తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. నైట్‌ కర్ఫ్యూతో పాటు సినిమా థియేటర్లు, ఇతరత్రా వ్యాపారాలపై అనేక ఆంక్షలు విధిస్తున్న తరుణంలో మద్యం షాపుల పనివేళలు మాత్రం పెంచడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాత్రి 11 గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ ప్రారంభం అవుతుండగా అంతకు సరిగ్గా గంట ముందు వరకూ మద్యం షాపులను మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది. ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, పెంచిన సమయం మద్యం అమ్మకాల లెక్కలు చూసుకునేందుకేనంటూ కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొవిడ్‌ మార్గదర్శకాల నేపథ్యంలోనే అకౌంట్ల నిర్వహణ కోసం రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే అకౌంట్ల నిర్వహణకు షట్టర్లు తెరిచి ఉంచడమెందుకో స్పష్టత లేదు. 


అసలు పనివేళలు ఏంటి?

ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం షాపుల పనివేళలపై ఎవరికీ స్పష్టత లేదు. గత ప్రభుత్వంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరిగేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీ మద్య నిషేధ చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాల పనివేళలు కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలుంటాయని కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా రాత్రి వరకూ మద్యం షాపులు తెరిచి ఉంచిందని, తమ ప్రభుత్వం ఒకేసారి 3గంటలు తగ్గించిందని గొప్పగా ప్రకటించుకుంది.


ఆ తర్వాత కొద్దికాలానికే అకౌంట్ల నిర్వహణ కోసం అంటూ మద్యం షాపులు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచాలని గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీచేసింది. పేరుకు అకౌంట్ల నిర్వహణ అయినా రాత్రి 9 గంటల వరకు మద్యం అమ్ముతున్నారు.  అధికారులే ఈ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఇదంతా తెలిసినా మద్యం షాపులను రాత్రి 8గంటలకే మూసేస్తున్నామని ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు మరోసారి అకౌంట్ల నిర్వహణ పేరుతో మరో గంట సమయం పెంచి 10 వరకు షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. 




ఆలోచన లేని నిర్ణయాలతో నవ్వులపాలు

తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మద్యం ఇప్పుడు గొప్ప ఆదాయ మార్గంలా కనిపిస్తోం ది. మద్యంతో నెలకు దాదాపు రూ.2వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టే మరో రంగం లేనేలేదు. దీంతో వీలైనంత మేర మద్యం అమ్మకాలు పెరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా, మళ్లీ పాత విధానానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ప్రభుత్వం నవ్వులపాలవుతోంది. మద్యం అమ్మకాలు భారీగా పెంచడం, మళ్లీ పూర్తిగా తగ్గించేయ డం, పనివేళలు కుదించడం, మళ్లీ పెంచడం, షాపుల్లో రిఫ్రిజిరేటర్లు తీసేయడం, మళ్లీ పెట్టడం, షాపుల సం ఖ్య తగ్గించడం, మళ్లీ కొత్త టూరిజం అవుట్‌లెట్లకు అనుమతివ్వడం లాంటి ప్రతి వెనకడుగు చర్యా వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోంది. ముందస్తు ఆలోచన లేకుండా తీసుకున్న పిచ్చి తరహా నిర్ణయాల వల్లే ఇలా నవ్వులపాలు కావాల్సి వస్తోందంటూ ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి.


Updated Date - 2022-01-18T09:04:58+05:30 IST