బ్రాండెడ్‌ బ్లాక్‌

ABN , First Publish Date - 2022-07-12T06:13:49+05:30 IST

పల్నాడులో మద్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారం అండతో మద్యం వ్యాపారులు చెలరేగిపోతున్నారు. తెలంగాణ సరిహద్దుల నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుంది.

బ్రాండెడ్‌ బ్లాక్‌
గురజాల లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో బెల్ట్‌ షాపులో మందుబాబులు

జోరుగా అక్రమ మద్యం వ్యాపారం

ప్రభుత్వ దుకాణాల నుంచే పక్కదారి

అధిక ధరకు రెస్టారెంట్లకు సిబ్బంది చేరవేత 

ఓ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులే బెల్ట్‌ నిర్వాహకులు

పల్నాడులో ఏ మూలకైనా యథేచ్ఛగా మద్యం డోర్‌ డెలివరీ

 


పిడుగురాళ్ల, జూలై 11: పల్నాడులో మద్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారం అండతో మద్యం వ్యాపారులు చెలరేగిపోతున్నారు. తెలంగాణ సరిహద్దుల నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుంది. గస్తీ అధికారుల సహకారంతో విచ్చలవిడిగా పట్టణాలు దాటి గ్రామాల వరకు తెలంగాణ మద్యం చేరుతుంది. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బ్రాండెడ్‌ మద్యం పక్కదారి పడుతోంది. ఆయా దుకాణాల్లో పనిచేసే కొందరు సిబ్బంది అధిక ధరలకు రెస్టారెంట్లతో పాటు తమకు అధిక ధర ఇచ్చే వారికి అందజేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉండాల్సిన మద్యం సీసాలు పలు రెస్టారెంట్లలో లభిస్తున్నాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పట్టణాల్లో ఉన్న మద్యం దుకాణాల్లోని బ్రాండెడ్‌ మద్యం సీసాలు ఆయా పట్టణ శివార్లలో ఉన్న కొన్ని రెస్టారెంట్లలో లభిస్తుంది.  తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎవరూ అటువైపే కన్నెత్తి చూడటం లేదు. పల్నాడు ప్రాంతంలో రహదారిపక్కనే కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అక్కడ కేవలం ఫుడ్‌ మాత్రమే అందాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం కూడా అందజేస్తున్నారు. ప్రభుత్వ మద్య దుకాణాల్లో సేల్స్‌పై టార్గెట్‌పెట్టి మరీ రోజువారి కలెక్షన్‌ పెంచాలని ఉన్నతాధికారుల నుంచి సిబ్బందిపై ఒత్తిడి ఉంది. ఇదే అవకాశంగా దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యాన్ని అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎక్కువ గ్రామాల్లో తెలంగాణ మద్యంతోపాటు ప్రభుత్వ దుకాణాల్లో కొన్నిరకాల బ్రాండెడ్‌లు కూడా  అందుబాటులో ఉంటున్నాయి. పల్నాడులో పల్లెలతో పాటు పట్టణ శివారుప్రాంతాలకు మద్యాన్ని కొందరు డోర్‌ డెలివరీ చేస్తున్నారంటే ఆశ్చర్యంకాదు. కొన్నిచోట్ల కొందరు వల్లంటీర్లు కూడా అడిగిన వారికి మద్యం సీసాలు అందజేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, గ్రామ ఉత్సవాల్లో మద్యం గలగలతో నిండిపోతున్నాయి.   ఓ నగర పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలోనే గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వారికి తెలియకుండా మరొకరు ఆ మండలంలో మద్యాన్ని సరఫరా చేసే వీలు లేదని సమాచారం.


తనిఖీలపై దృష్టి సారించని అధికారులు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలుదారుడు మూడు బాటిళ్లకన్నా  ఎక్కువ విక్రయించకూడదు. అయితే విక్రయాలు పెంచాలన్న అధికారుల ఒత్తిడితో ఇష్టానుసారంగా సిబ్బంది పదుల కొద్దీ మద్యం సీసాలను అడ్డదారుల్లో తరలించేస్తున్నారు. అయితే తనిఖీలకు వచ్చే అధికారులు విక్రయాలు, నగదు చూస్తున్నారేకాని నిబంధనలను సిబ్బంది పాటిస్తున్నారా లేదా అని చూడటంలేదు. నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని ఇటీవల పిడుగురాళ్లలో అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ విషయం రట్టుకాకుండా మరొక మార్గంలో మద్యం సీసాలను షాపునకు తరలించి తాత్కాలికంగా లెక్కలను సరిచేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ దుకాణంలో ఉండాల్సిన మద్యం బాటిళ్లు, తెలంగాణా మద్యం సీసాలు రెస్టారెంట్లలో లభిస్తున్నా తనిఖీ అధికారులు వాటి గురించి పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. 

 

Updated Date - 2022-07-12T06:13:49+05:30 IST