తెగతాగేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-05-25T06:11:29+05:30 IST

తెగతాగేస్తున్నారు.. ఽధర పెరిగినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు..

తెగతాగేస్తున్నారు..

ధర పెరిగినా తగ్గని మద్యం వ్యాపారం 

ఈ నెలలో  రూ. 70 కోట్లు తాగేశారు

ప్రతి నెలా రూ. 70 కోట్ల పైమాటే

బీరులో మునిగితేలుతున్న యువత

జూన్‌ 30న బార్ల్‌ లైసెన్స్‌ గడువు పూర్తి


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి) 

 తెగతాగేస్తున్నారు.. ఽధర పెరిగినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు.. తాగుడు షరా మామూలే. అసలే ఎండాకాలం కావడంతో లిక్కర్‌తో పాటు బీరుకు భలే గిరాకీ ఏర్పడింది. జిల్లాలో 134 మద్యంషాపులు, 24 బార్లు ఉన్నాయి. షాపుల ఎదుట క్యూలు కడుతున్నారు. కొత్తజిల్లాలు ఏర్పడినా వాస్తవానికి  మద్యం పరంగా జిల్లాలో పూర్తి విభజన ఇంకా జరగలేదు. అయినా అధికారులు డిపోల వారీగా సేకరించి లెక్కలు తేలుస్తున్నారు. ఈ విధంగా మే నెలలో రూ.80 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 


ఇంకనూ విభజన కాని ఎక్సయిజ్‌ డిపోలు..


పాత తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్లకోట, అమలాపురం ఎక్సయిజ్‌ డిపోలు ఉండేవి. అక్కడ నుంచే సరుకు సరఫరా అయ్యేది. ఇవి మూడు జిల్లాలుగా ఏర్పడడం వల్ల  తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి  రాజమహేంద్రవరం డిపోతో పాటు, చాగల్లు డిపో కూడా వచ్చింది. కానీ ఈ డిపోల నుంచి గతంలో సరఫరా అయినట్టు ఆయా ప్రాంతాలకే సరఫరా అవుతోంది. వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రంగంపేట మండలానికి సామర్లకోట డిపో నుంచి,  నల్లజర్ల మండలానికి ఏలూరు డిపో నుంచి సరుకు సరఫరా అవుతోంది.రాజమహేంద్రవరం డిపో నుంచి కోనసీమలో 48 షాపులకు సరఫరా అవు తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లిన ఏజెన్సీకి కూడా ఇంకా సరఫరా అవుతోంది. ఇవన్నీ విభజిస్తే జిల్లాల వారీ డిపోల లెక్కలు ఉం టాయి. కానీ అఽధికారులు ఆయా డిపోల నుంచి సమాచారం సేకరించి,కొత్త జిల్లాల వారీ లెక్కల వరకూ రెడీ చేస్తున్నారు. 


ఇదీ తాగుడు లెక్క....


అధికారుల లెక్కల ప్రకారం కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో  ఈనెల 15వ తేదీ నాటికి రూ.44 కోట్ల విలువైన మద్యం, బీరు తాగేశారు. 24వ తేదీ నాటికి ఏకంగా రూ.70 కోట్ల వరకూ తాగేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక మార్చి నెలలో  జిల్లా వ్యాప్తంగా రూ.71 కోట్లు తాగగా, ఏప్రిల్‌ నెలలో రూ. 75 కోట్లు తాగేశారు. ఈనెల పూర్తయ్యేసరికి ఈనెల అమ్మకాలు రూ. 80 కోట్లు వరకూ చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎండలు తట్టుకోలేక బీరు ఎక్కువ తాగుతున్నారు. పాత తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 1నుంచి ఇప్పటి వరకూ రూ.190 కోట్ల మద్యం తాగారు. అందులో లిక్కర్‌ 98 లక్షల 39 వేల బాటిళ్లు,  బీరు  13 లక్షల 21 వేల బాటిళ్లు తాగేశారు. ఇదిలా ఉండగా జూన్‌ 30వ తేదీ నాటికి బార్ల లైసెన్స్‌ గడువు పూర్తికానుంది. 


Updated Date - 2022-05-25T06:11:29+05:30 IST