లిక్కర్‌ కింగ్‌

ABN , First Publish Date - 2022-08-20T04:24:34+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలానికి చెందిన ఓ వ్యక్తి లిక్కర్‌ కింగ్‌ అవతారం ఎత్తాడు.

లిక్కర్‌ కింగ్‌
పాతపాలెంలో గత బుధవారం పట్టుకున్న మద్యం కాటన్లు

నకిలీ మద్యం తయారీ.. కర్ణాటక మద్యం రవాణాలో ఘనాపాటి

కేటీదొడ్డి మండలం పాతపాలెం కేంద్రంగా దందా

కర్నూలు, ధరూర్‌, కేటీదొడ్డి పోలీస్‌ స్టేషన్లలో కూడా కేసులు

రాయిచూర్‌కు చెందిన వైన్స్‌ షాపు నుంచి తరచూ మద్యం రవాణా

ఏపీ, తెలంగాణలోని మద్యం దుకాణాలు, బెల్టు షాపుల్లో విక్రయం

అందర్‌ బాహర్‌, సీహెచ్‌, గుట్కాదందాలో భాగస్వామ్యమనే ఆరోపణలు

భారీగా కేసులు నమోదవుతున్నా స్టేషన్‌ బెయిల్‌తో బయటకు..


జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలానికి చెందిన ఓ వ్యక్తి లిక్కర్‌ కింగ్‌ అవతారం ఎత్తాడు. గద్వాల జిల్లా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు సరిహద్దులో ఉండటంతో నకిలీ మద్యం తయారీ, కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో రాటు దేలిపోయాడు. తన గ్రామం కేంద్రంగా ఏళ్లుగా దందా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే కేటీదొడ్డి, ధరూర్‌, కర్నూలు నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో నకిలీ మద్యం కేసుల్లో అతని పేరు ప్రధానంగా ఉన్నా, దందా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది. 

- ఆంధ్రజ్యోతి, గద్వాల

జోగుళాంబ గద్వాల జిల్లా పాతపాలానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ మద్యం తయారీ, మద్యం అక్రమ సరఫరాలో రాటుదేలాడు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకున్న అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇంత జరుగుతున్నా తమ పరిధిలో కేసులు లేవని ఎక్సైజ్‌ అధికారులు చెబుతుండగా, మరోవైపు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల నుంచి సులభంగా తప్పించుకుంటున్నాడు. కొందరు అధికారుల సహకారం ఉండటం వల్లే అతను దందాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నెల 17న కూడా పాతపాలెంలో 20 కాటన్ల మద్యం పట్టుకున్న కేసులో కూడా అతని పేరే ప్రధానంగా ఉంది. అయితే ఎక్కువ మద్యం ఉన్న వాహనాన్ని తప్పించారనే విమర్శ లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మద్యం తాగి ఇల్లు గుల్ల చేసుకుంటున్న సామాన్యులకు కల్తీ మద్యం రూపంలో ఆరోగ్యం విపరీతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి, వరుస కేసులు నమోదవుతున్న వారిపై పీడీ యాక్ట్‌ లాంటి కఠిన కేసులు నమోదు చేస్తే దందాకు బ్రేకులు పడే అవకాశం ఉంది. 


దందా సాగుతోందిలా..

గద్వాల జిల్లా అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉంది. రాయిచూరు పట్టణం అతిచేరువలో ఉండటంతో అక్కడ ఉన్న ఒక వైన్‌షాపు నిర్వాహకుడి ద్వారా భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా చీప్‌ లిక్కర్‌ను మాత్రమే తీసుకు వస్తారు. మద్యాన్ని అక్కడి నుంచి పాతపాలేనికి తీసుకొచ్చి, అక్కడ కొన్నిచోట్ల డంపింగ్‌ చేసుకుంటారు. ఇందుకోసం కొందరు యువతకు తర్ఫీదు ఇచ్చి, భారీ మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారు. ఎక్కువగా 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్లను కొనుగోలు చేసి తెచ్చి, గద్వాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న ఓ మండలంలోని రెండు దుకాణాలకు తరలిస్తున్నారు. అక్కడ బ్రాండెడ్‌ మద్యం బాటిళ్లను ఓపెన్‌ చేసి, అందులో చీఫ్‌ లిక్కర్‌ను కలుపుతారు. ఒక్కో 90 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్‌ ధర రూ.35 ఉంటుంది. ఒక్కో కాటన్‌ ఖరీదు రూ.3,400 వరకు వస్తోంది. కాటన్‌లో మొత్తం 96 బాటిళ్లు ఉంటాయి. అలాగే 180 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్లు ఒక్కో కాటన్‌లో 48 ఉంటాయి. వాటి ధర కూడా అంతే ఉంటుంది. వీటిని బ్రాండెడ్‌ మద్యంలో కలపడం ద్వారా భారీగా లాభాలు గడిస్తున్నారు. అలాగే మెజారిటీ బెల్టు దుకాణాలకు కూడా ఇదే మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అలాగే ఏపీలో చీప్‌ లిక్కర్‌ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి కూడా సదరు లిక్కర్‌ కింగ్‌ ఆధ్వర్యంలోనే మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. రాయిచూర్‌ నుంచి నేరుగా కర్నూలు తరలించి, గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో చీప్‌ లిక్కర్‌ 90 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్‌ రూ.35కు వస్తే దాన్ని సుమారు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇచ్చి, పోలీసులు పట్టుకుంటే అసలు సూత్రధారులు కాకుండా వేరే వారిపై కేసులు నమోదయ్యేలా లిక్కర్‌ కింగ్‌ ప్రణాళికలు ఉంటాయి. అతనిపై ఇప్పటికే కల్లు విక్రయం, పేకాట, అందర్‌ బహర్‌, లిక్కర్‌కు సంబంధించిన కేసులు చాలానే నమోదు కాగా, ఇంకొన్ని కేసుల్లో మాత్రం తను అధికారుల సహకారంతో తప్పించుకుంటున్నాడని తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో పట్టుబడిన కల్తీ మద్యం తయారీ రాకెట్‌లో కూడా ఈ లిక్కర్‌ కింగ్‌ సూత్రధారి కాగా, అతన్ని తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. 


 కేసులు.. మద్యం పట్టివేత

కల్తీ మద్యం తయారీ, కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న లిక్కర్‌ కింగ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. 

ఏపీలో కర్నూలు నాలుగో టౌన్‌లో జూన్‌ 5వ తేదీన ఓ కేసు నమోదైంది. స్కార్పియోలో మద్యం తరలిస్తుండగా అక్కడి పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అందులో డ్రైవర్‌ను ఏ1 గా చేర్చగా, గద్వాల లిక్కర్‌ కింగ్‌ ఏ3 గా ఉన్నారు. ఇందులో 50 కాటన్ల 90 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్ల మద్యం దొరికింది. మొత్తం 4,800 టెట్రా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. 

అలాగే గత సంవత్సరం మే ఐదో తేదీన ధరూర్‌ మండలంలో కూడా ఒక కేసు నమోదైంది. అందులో లిక్కర్‌ కింగ్‌ ఏ1గా చేర్చారు. ఆ రోజు నైట్‌ డ్యూటీలో ఉన్న బీట్‌ కానిస్టేబుళ్లకు ట్రాక్టర్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో చెక్‌ చేయగా 128 కాటన్ల 180 ఎంఎల్‌ ఒరిజినల్‌ చాయిస్‌ మద్యం, 58 కాటన్ల బ్లాక్‌ మేజిక్‌ 90 ఎంల్‌ మద్యం దొరికింది. పాతపాలెం నుంచి తరలిస్తున్నట్లు డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. సదరు లిక్కర్‌ కింగ్‌ పేరు కూడా తెలుపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 6,144 టెట్రా ప్యాకెట్ల 180 ఎంల్‌ మద్యం, 5,568 టెట్రా ప్యాకెట్ల 90 ఎంఎల్‌ మద్యం దొరికింది. 

కేటీదొడ్డి పీఎస్‌లో 2020 మార్చి నెలలో పాతపాలెం శివారులో అందర్‌ బహర్‌ ఆడుతుండగా కొంతమందిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అందులో కూడా ఏ1గా లిక్కర్‌ కింగ్‌ పేరు ఉంది. 

ఈ నెల 17వ తేదీన పాతపాలెంలో పట్టుకున్న 20 కాటన్ల ఒరిజనల్‌ చాయిస్‌ టెట్రా ప్యాకెట్ల కేసులోనూ లిక్కర్‌ కింగే ఏ1గా ఉన్నారు. ఇవే కాకుండా గతంలో ధరూర్‌ మండలంలో ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన కేసులోనూ అతని పేరు ఉంది. 

2017, 2018లో లైసెన్స్‌ లేకుండా కల్తీ కల్లు విక్రయం చేస్తున్న ఘనటల్లో కూడా అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇంకా వెలుగులోకి రాని కేసులు అనేకం ఉండగా, కొన్ని కేసుల్లో తనకు బదులు వేరేవారిపై కేసులు నమోదయ్యేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-20T04:24:34+05:30 IST