సిండికేట్‌ ‘బెల్ట్‌’

ABN , First Publish Date - 2020-02-20T10:17:41+05:30 IST

జిల్లా కేంద్రంగా లిక్కర్‌ మాఫియా మామూలుగా సాగడంలేదు. కొద్ది రోజులుగా నిమ్మకుండిపోయిన సిండికేట్‌ వ్యాపారులు

సిండికేట్‌ ‘బెల్ట్‌’

జిల్లా కేంద్రంగా లిక్కర్‌ దందాకు మళ్లీ రెక్కలు

అధిక ధరలకు విక్రయాలు  

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు


కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 19: జిల్లా కేంద్రంగా లిక్కర్‌ మాఫియా మామూలుగా సాగడంలేదు. కొద్ది రోజులుగా నిమ్మకుండిపోయిన సిండికేట్‌ వ్యాపారులు మళ్లీ  అందరూ ఒక్కటయ్యారు. రానున్న వేసవిని బూచీగా చూపించి మద్యం అమ్మకాలపై తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పారదర్శకత పేరుతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అందులోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ దందా సాగిస్తున్నారు.


సార్వత్రిక ఎన్నికలు, ఇతర ఎన్నికల సమయంలో చడీచప్పుడు లేకుండా మూసుకున్న బెల్ట్‌షాపులు మళ్లీ యథాస్థితికి చేరాయి. ఈ బెల్టు షాపుల్లో విక్రయాలను పెంచాలనే ఉద్దేశంతో లైసెన్స్‌ కలిగిన మద్యందుకాణాలను సైతం ఆలస్యంగా తెరుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే జిల్లా వ్యాప్తంగా ఇక్కడి సిండికేట్‌ వ్యాపారుల నుంచే మద్యం సరఫరా జరగడంతో పాటు వారికి అనుకూలంగా లేకున్నా వారిని తమ దారికి తెచ్చుకుని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఎమ్మార్పీకే  మద్యం విక్రయాలు చేయాలని చెబుతున్నా యథేచ్ఛగా ఆ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం వార్డుల వారిగా ఈ సిండికేట్‌ వ్యాపారులే పోటీలో ఉన్న అభ్యర్థులకు టోకుగా మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సిండికేట్‌ వ్యాపారం సాగించే వారు తొలుత వైన్‌షాపులలో బీర్లు అమ్మవద్దని హుకుం జారీ చేస్తారు. దాంతో బీర్‌ తాగేందుకు వచ్చేవారు బార్‌షాపుల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


ఈ రకంగా వైన్‌షాపులో అమ్మే బీర్‌ కంటే బార్‌షాపుల్లో అమ్మే బీరు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దాంతో బెల్ట్‌ దుకాణాలను ఆశ్రయిస్తారు. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో వైన్‌షాపుల్లో బీర్లు అమ్మకుండా చేయడంతో పాటు బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తూ పెద్ద మొత్తం నగదును సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే వాస్తవంగా అమ్మకాలు సాగించాల్సిన వ్యక్తులు ఒకరైతే తీరా షాపులు వచ్చాక ఇదే సిండికేట్‌ వ్యాపారులు తమ అనుయాయులను పంపించి ఆయా షాపులను తమకు అమ్మాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన సెంటర్లలో ఉన్న షాపులను నయానో.. భయానో.. చేజిక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తూ.. లాటరీ ద్వారా షాపులను కైవసం చేసుకున్న వారిని సైతం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లక్షలు వెచ్చించి షాపులు దక్కించుకున్న సదరు వ్యాపారస్తులు ఈ విషయంలో ఫిర్యాదులకు వెళ్తే లేనిపోని తలనొప్పులు ఎందుకు కొని తెచ్చుకోవడం అంటూ ఇటు మింగలేక.. అటు కక్కలేక సతమతమవుతున్నారు. జిల్లా కేంద్రంలో మద్యం అమ్మకాలపై పట్టుఉన్న ఒక వ్యక్తి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాలు బయటకు రాగానే ఎక్సైజ్‌శాఖ కూడా తూతూమంత్రంగా దాడులు చేస్తూ.. హడావిడి చేయడం తరువాత నిమ్మకుండిపోవడం పరిపాటిగా మారింది.

Updated Date - 2020-02-20T10:17:41+05:30 IST